ఫలించిన ప్లాన్.!

Trump Hamas Gaza War: ట్రంప్ ఇచ్చిన 20 పాయింట్ల గాజా శాంతి ప్లాన్‌ని హమాస్ ఒప్పుకోవడం గొప్ప విషయమే. మరి ఇది గాజా యుద్ధాన్ని ఆపుతుందా? ఇజ్రాయెల్ మరిన్ని కుట్రలు పన్నకుండా ఉంటుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్లాన్‌ను హమాస్ కొంతవరకూ ఒప్పుకుంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి సిద్ధమని ప్రకటించింది. అందువల్ల దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసేలా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి.. వైట్ హౌస్‌లో ఈ 20 పాయింట్ల ప్లాన్ ప్రకటించారు. ఇందులో యుద్ధాన్ని వెంటనే ఆపడం, బందీల మార్పిడి, హమాస్ ఆయుధాల్ని వదులుకోవడం, గాజా పునర్నిర్మాణం వంటి కీలక అంశాలు ఉన్నాయి.

ఇరు పక్షాలు సంతకం చేయగానే తక్షణమే సీజ్‌ఫైర్ ప్రకటిస్తారు. గాజా తాత్కాలిక పాలనా బాధ్యతలను టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీకి అప్పగిస్తారు. దీనిని అధ్యక్షుడు ట్రంప్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది.గాజాను పునరుద్ధరించడానికి, పాలస్తీనా, ప్రపంచ నిపుణులతో కూడిన కొత్త గవర్నింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పాలస్తీనియన్ పౌరులను గాజాను విడిచి వెళ్లవలసిందిగా నిర్బంధించడం జరగదు. ఇజ్రాయెల్ 72 గంటల్లోగా బంధీలుగా ఉన్న అందరినీ (బతికున్న లేదా మరణించిన) అప్పగిస్తుంది.ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా పౌరులను విడుదల చేస్తుంది. ఆయుధాలు విడిచిపెట్టి, శాంతికి హామీ ఇచ్చే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది, వారు సురక్షితంగా బయటకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గాజాలో మానవీయ సాయం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయంతో సహాయ సామగ్రిని అందిస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఒక ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అందుకు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ ప్రయత్నాలకు గౌరవం చూపుతూ, హమాస్ బందీల మార్పిడి సూత్రాన్ని అంగీకరించింది. గాజాలో జరుగుతున్న మానవాళి విషాదానికి ముగింపు రావాలనే ఆశతో, సహాయాలు పెరగాలనే కోరికతో పాక్షికంగా ఒప్పుకుంది. అయితే… పాలన, ట్రంప్ నేతృత్వంలోని బోర్డ్ వంటి అంశాలపై మరిన్ని చర్చలు జరగాలని కోరింది. హమాస్.. 48 మంది ఇజ్రాయెలెలను బందీలుగా ఉంచుంది. వారిలో 20 మంది జీవించి ఉన్నారు. వారందర్నీ విడుదల చేయడానికి సిద్ధమని తెలిపింది. కానీ గాజా పాలన మాత్రం.. పాలస్తీనా జాతీయ సమ్మతి ఆధారంగా టెక్నోక్రాట్ల ద్వారానే జరగాలని డిమాండ్ చేసింది.

హమాస్ ‘శాంతికి సిద్ధం’ అని చెప్పిందనీ, గాజా దాడులు ఆపాలని ట్రంప్, ఇజ్రాయెల్‌ని ఆదేశించాడు. ఇజ్రాయెల్ మొదటి దశ అమలుకు సిద్ధమైంది. కానీ హమాస్ పూర్తిగా 20 పాయింట్లనూ ఒప్పుకోలేదు. ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధపడింది కానీ.. ఇజ్రాయెల్ తీరు భవిష్యత్తులో సరిగా లేదని భావిస్తే, మళ్లీ ఆయుధాలు పట్టినా పట్టొచ్చు. అంటే.. హమాస్ కాకపోతే మరొకరు ఆయుధాలు పట్టొచ్చు. అలా జరగకూడదంటే.. ఇజ్రాయెల్.. పాలస్థీనా విషయంలో నియంతృత్వ పోకడల్ని మానుకోవాలి. కానీ ఇజ్రాయెల్ తీరు అలా ఉండకపోవచ్చనే విశ్లేషణలున్నాయి. ఎందుకంటే నెతన్యాహూపై ప్రస్తుతం ప్రజల్లో అభిమానం లేదు. అందువల్ల ఆయన యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ.. ప్రజా మద్దతు పొందేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు అమెరికా తోడుగా ఉంటోంది. ఇదే హమాస్ ఆగ్రహానికి కారణం అవుతోంది. హమాస్ ఇప్పుడు ఒప్పుకున్నది పాక్షికంగా మాత్రమే, పూర్తిగా కాదు. అందువల్ల యుద్ధం అప్పుడే ముగిసిపోయినట్లు కాదు. ట్రంప్.. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ డెడ్‌లైన్ పెట్టారు కాబట్టి.. అప్పటికల్లా.. చర్చలు జరిగి.. ఒక నిర్ణయానికి వస్తే, యుద్ధం ముగిసే ఛాన్స్ ఉంటుంది.

గాజాలో మానవాళి సంక్షోభం తీవ్రంగా ఉంది. అక్టోబర్ 1 నాటికి 48 ఇజ్రాయెల్ బందీలు ఇంకా హమాస్ కంట్రోల్‌లో ఉన్నారు. ఆక్సిజన్, ఆహారం కొరత, కరవు తీవ్రంగా ఉన్నాయి. లక్షల మంది వలసలు వెళ్లారు. ఆసుపత్రులు సరిగా లేవు. మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. 2023 అక్టోబర్ 7 నుంచి 2025 సెప్టెంబర్ 24 వరకు వేల మరణాలు నమోదయ్యాయి. చాలా మంది దిక్కులేని వారయ్యారు. ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ట్రంప్ ప్లాన్ అమలైతే.. సహాయాలు పెరిగి, పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ట్రంప్ ప్లాన్‌ను ‘బోల్డ్ విజన్’గా పిలిచి, అరబ్ దేశాలు, ఐరోపా మద్దతుగా స్పందించాయి. కానీ, ఇజ్రాయెల్ కోరుతున్న పూర్తి భద్రతా హామీలు లభిస్తాయా, హమాస్ పాలస్తీనా స్వయం పాలన కోరికలు ఫలిస్తాయా అనేది తేలాల్సిన అంశం. గాజా ప్రజలకు ఈ శాంతి ఒప్పందం ఆశల కిరణం, కానీ పూర్తి అమలు కీలకం.

డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ శాంతి ప్రణాళికకు మొత్తం 8 అరబ్, ముస్లిం దేశాలు తమ సమ్మతిని తెలిపాయి. ఈ దేశాల్లో ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు ట్రంప్ నాయకత్వాన్ని, శాంతి ప్రయత్నాలను స్వాగతించారు. ఈ ప్రణాళిక గాజాలో తక్షణ కాల్పుల విరమణకు, పునర్నిర్మాణానికి , పాలస్తీనా పౌరుల స్థానభ్రంశాన్ని అరికట్టడానికి, శాశ్వత శాంతికి దోహదపడుతుందని వారు ప్రశంసించారు.

హమాస్ కనుక శాంతి ప్రతిపాదనను అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుందని.. అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయన్నారు. అరబ్, ముస్లిం దేశాలు కూడా ఈ ప్రక్రియలో సహకరిస్తాయి. ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే, హమాస్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం కూడా ఈ పనిని పూర్తి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇక మరోవైపు ఇజ్రాయెల్ సాగిస్తోన్న దాడులతో అల్లకల్లోలంగా మారిన గాజాలో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని ప్రతిపాదనలను గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అంగీకరించిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన ఓ పోస్ట్ పెట్టారు. గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తోన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సాగిస్తోన్న ప్రయత్నాలు, ఆయన నాయకత్వాన్ని తాము స్వాగతిస్తోన్నామన్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనల వల్ల సుదీర్ఘకాలంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదలకు సంబంధించిన సూచనల్లో ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని వ్యాఖ్యానించారు. గాజాతో పాటు మధ్య- తూర్పు దేశాల్లో శాశ్వత ప్రాతిపదికన శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ ప్రతిపాదనలు దోహదపడతాయని, అందులో మెజారిటీ షరతులను హమాస్ అంగీకరించడం దీనికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఇరువర్గాలకు సమ న్యాయాన్ని కలిగించే అన్ని రకాల ప్రయత్నాలకు కూడా భారత్ బలమైన మద్దతును ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు.vTrump Hamas Gaza War.

ఇజ్రాయెల్- గాజా మధ్య సంధిని కుదర్చడానికి డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు అంగీకరించాల్సి ఉంటుందని, లేకపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు అల్టిమేటం జారీ చేశారు. మరీ ఏం జరుగుతుందో తెలియాలీ అంటే వేచి చూడాల్సిందే.