
Corruption in a Buddhist temple: భారత్ నుంచి చైనా వెళ్లి అక్కడ వారికి ఎంతో సహాయం చేసిన బౌధిధర్మ ఆలయంలో పాడుపనులా..? ఎంతో పవిత్రంగా భావించే ప్రాంతంలో కుతంత్రాలా..? అసలు ఏంటీ కథ…? చైనాలోని షావలిన్ టెంపుల్, బౌద్ధమతం, కుంగ్‌ఫూ కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం, ఇప్పుడు ఈ ఆలయం వివాదంలో చిక్కుకుంది. ఈ ఆలయ పీఠాధిపతిపై తీవ్ర ఆరోపణలు రావడంతో చైనా అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఆరోపణలు ఏమిటి? విచారణ ప్రక్రియ ఎలా సాగుతోంది? షి యాంగ్‌సిన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? షావలిన్ టెంపుల్‌కు చైనాలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? భారత్‌తో దీనికి ఉన్న సంబంధం ఏమిటి?
కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ అనే హీరో సూర్య నటించిన సినిమా గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తమిళనాడు నుంచి బౌధిధర్మ చైనాకు వలస వెళ్లి అక్కడి ప్రజల కోసం ఎంతో సేవ చేసే అక్కడే ఉండిపోయారు. ఆరోగ్యం, యుద్ధ విద్యల్లో మెళకువలను వారికి నేర్పారు. ఓ భారతీయుడు చైనాకు వెళ్లి.. వారికి ఓ మార్గాన్ని చూపించారు. అక్కడే తన తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుర్తుగా ఆలయాన్ని నిర్మించి.. అక్కడే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. దీనినే షావలిన్ టెంపు అంటారు. అలాగే షావలిన్ టెంపుల్ పీఠాధిపతి షి యాంగ్‌సిన్‌పై ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఆర్థిక అవకతవకలు, అనైతిక సంబంధాలు, ఆలయ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. షి యాంగ్‌సిన్ ఆలయ వాణిజ్య కార్యకలాపాల ద్వారా సంపాదించిన లాభాలను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆయనకు ఒక మహిళతో అనైతిక సంబంధం ఉందని, ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారని ఆరోపణలున్నాయి. ఇది బౌద్ధ సన్యాసుల బ్రహ్మచర్య సూత్రాలకు విరుద్ధం. ఈ ఆరోపణలు షావలిన్ టెంపుల్ ఆధ్యాత్మిక గౌరవాన్ని దెబ్బతీశాయని విమర్శకులు భావిస్తున్నారు. Corruption in a Buddhist temple.
షి యాంగ్‌సిన్‌పై వచ్చిన ఆరోపణలపై చైనా అధికారులు ఒక సమగ్ర విచారణను ప్రారంభించారు. చైనాలోని బౌద్ధ సంఘం, హెనాన్ ప్రావిన్స్ అధికారులు కలిసి ఈ విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆలయ ఆర్థిక లావాదేవీలు, షి యాంగ్‌సిన్ వ్యక్తిగత ఆస్తులు, ఆలయం వాణిజ్య కార్యకలాపాలపై దృష్టి సారించారు. అలాగే, అనైతిక సంబంధాల ఆరోపణలపై కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే చైనా ప్రభుత్వం ఈ విషయంలో గోప్యతను పాటిస్తోంది, షావలిన్ టెంపుల్ అంతర్జాతీయ ఖ్యాతి కారణంగా ఈ విచారణ సీక్రెట్ గా సాగుతోంది. ఈ విచారణ ఫలితాలు ఆలయ భవిష్యత్తు నిర్వహణపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
షి యాంగ్‌సిన్‌పై ఆరోపణలు నిరూపితమైతే, ఆయనను ఆలయ పీఠాధిపతి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. చైనా బౌద్ధ సంఘం ఆయనను సన్యాస జీవనం నుంచి బహిష్కరించవచ్చు, ఆర్థిక అవకతవకలు నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తీసుకొవచ్చు. అయితే, షావలిన్ టెంపుల్ ఆర్థిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా చైనా ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. షి యాంగ్‌సిన్ ఆలయాన్ని ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు, కాబట్టి ఆయన తొలగింపు ఆలయ ఆదాయం, పర్యాటకంపై ప్రభావం చూపవచ్చు. ఒకవేళ ఆరోపణలు నిరూపితం కాకపోతే, షి యాంగ్‌సిన్ తన పదవిలో కొనసాగవచ్చు, కానీ ఆలయ ఆర్థిక వ్యవహారాలపై మరింత పారదర్శకత, కఠినమైన నియంత్రణలు విధించే అవకాశం ఉంది.
షావలిన్ టెంపుల్, చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని డెంగ్‌ఫెంగ్‌లో ఉంది. ఇది 495లో స్థాపించబడిన ఒక బౌద్ధ ఆలయం. ఈ ఆలయం జెన్ బౌద్ధమతం జన్మస్థలంగా, కుంగ్‌ఫూ ఆవిర్భావ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. షావలిన్ సన్యాసులు కుంగ్‌ఫూ కళను అభివృద్ధి చేశారు, ఇది ఆధ్యాత్మిక సాధన, శారీరక శిక్షణను ఒకటిగా చేస్తుంది. చైనా సంస్కృతిలో ఈ ఆలయం ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు ఇక్కడికి వెళ్తుంటారు. షావలిన్ టెంపుల్ కుంగ్‌ఫూ షోలు, సినిమాలు, ఆన్‌లైన్ కోర్సులు చైనాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ ఆలయాన్ని ఒక జాతీయ వారసత్వ స్థలంగా, సాంస్కృతిక గుర్తింపుగా కాపాడుతోంది.
భారత్‌కు షావలిన్ టెంపుల్‌తో సంబంధం ఏంటి..?
షావలిన్ టెంపుల్‌కు భారత్‌తో లోతైన చారిత్రక, ఆధ్యాత్మిక సంబంధం ఉంది. ఇది బౌద్ధమతం ద్వారా ముడిపడి ఉంది. బౌద్ధమతం భారతదేశంలో జన్మించింది. షావలిన్ టెంపుల్‌లో జెన్ బౌద్ధమతం భారతీయ బౌద్ధ సన్యాసి బోధిధర్మ ద్వారా 5వ శతాబ్దంలో స్థాపించబడిందని చెబుతారు. బోధిధర్మ, దక్షిణ భారతదేశం నుంచి చైనాకు వెళ్లి, షావలిన్ టెంపుల్‌లో ధ్యానం, శారీరక శిక్షణను పరిచయం చేశారు. ఇది కుంగ్‌ఫూకు పునాదిగా మారింది. ఈ చారిత్రక సంబంధం భారత్-చైనా సాంస్కృతిక బంధానికి ఒక ముఖ్యమైన భాగం. ఆధునిక కాలంలో, షావలిన్ టెంపుల్ భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంది, భారత్‌లోని కుంగ్‌ఫూ శిక్షణా కేంద్రాల్లో షావలిన్ సన్యాసుల ఎక్కువగా ఉంటారు.
షి యాంగ్‌సిన్‌పై ఆరోపణలు, విచారణ షావలిన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఖ్యాతిని దెబ్బతీశాయి. చైనాలో బౌద్ధ ఆలయాలు కమర్షియల్ మారడం, నిర్వహణపై కొత్త చర్చను ఈ వివాదం రేకెత్తించింది. అయితే భవిష్యత్తులో, చైనా ప్రభుత్వం ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకతను, ఆర్థిక జవాబుదారీతనాన్ని విధించే అవకాశం ఉంది. భారత్‌తో ఈ ఆలయం చారిత్రక సంబంధం కలిగి ఉండటం కారణంగా, ఈ వివాదం భారతీయ బౌద్ధ సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారింది. షావలిన్ టెంపుల్ ఆధ్యాత్మిక గౌరవాన్ని పునరుద్ధరించడం, దాని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం ఇప్పుడు చైనా, అంతర్జాతీయ బౌద్ధ సమాజం ముందున్న సవాళ్లు.