అమెరికా నిర్ణయాలతో విసిగిపోయిన పలు దేశాలు..!

Donald Trump America: పెరుగుట విరుగుట కొరకే అంటారు. డాలర్ అండ చూసుకుని ట్రంప్ రెచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఏ దేశమైన మరోదేశంతో వాణిజ్యం చేయాలంటే డాలరే గతి.. ఇదే అదునుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదరింపులకు పాల్పుడుతున్నారు. దీంతో డాలర్ బదులు వేరే కరెన్సీలను లావాదేవీలకు వాడుకుంటున్నాయి కొన్ని దేశాలు. రోజురోజుకు అమెరికా డాలర్ ఆధిపత్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో దాని పాత్రపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. భారత్, చైనా వంటి దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ డాలర్ బదులు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గలు చూసుకుంటోంది..? గతంలో డాలర్ అంతర్జాతీయ కరెన్సీ కాకముందు మన రూపాయి విలువ ఎలా ఉండేది.

డబ్బు అనేది పుట్టక ముందు.. వాణిజ్యం అనేది వస్తు మార్పిడి ద్వారా జరిగేది. ఆ సమయంలో వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వాణిజ్యం జరిగేది. ఆ తర్వాత బంగారాన్ని వాణిజ్యం కోసం కొంతకాలం ఉపయోగించుకున్నారు. రాజుల కాలంలో బంగారు నాణెలను ఇచ్చి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకునేవారు. బంగారంలానే ఇతర లోహాలతో నాణెలను తయారు చేసుకుని మానవులు వాణిజ్యం కొనసాగించారు. వాటి నుంచే నగదు పుట్టకొచ్చింది. ఆ తర్వాత దేశాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకం డబ్బు. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు జరపాలంటే ఒక దేశం కరెన్సీ మరో దేశం కరెన్సీకి సంబంధం ఉండేది కాదు. దీంతో బంగారంతో లావాదేవీలు జరిపారు. ఇలా కాకుండా ఉమ్మడిగా ఒక కరెన్సీ ప్రపంచం అంతా ఉంటే బాగుంటుందని డాలర్ ను తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా డాలర్ చెల్లుతుంది. అయితే ఇదే అదునుగా అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టింది.

అమెరికా డాలర్‌ను అంతర్జాతీయ వాణిజ్యంలో ఆయుధంగా ఉపయోగించడం, స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్విఫ్ట్ వ్యవస్థ 200 దేశాల్లో 11,000 బ్యాంకులను అనుసంధానిస్తుంది, కానీ అమెరికా ఒత్తిడి వల్ల ఈ దేశాలను స్విఫ్ట్ నుంచి తొలగించారు. దీని వల్ల ఆ దేశాలు లావాదేవీలు చేయలేకపోతున్నాయి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2022లో రష్యాను స్విఫ్ట్ నుంచి తొలగించడం వల్ల.. దాని 300 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్‌లు నిలిచిపోయాయి. ఇది ఇతర దేశాలకు డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడటం ప్రమాదకరమని సంకేతం ఇచ్చింది. ఫలితంగా, బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై 10% టారిఫ్, రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 500% టారిఫ్ విధిస్తామని హెచ్చరించడం ఈ విసుగును మరింత పెంచింది. ఈ చర్యలు దేశాలను డాలర్‌కు ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. Donald Trump America.

అమెరికా ఆంక్షల వల్ల డాలర్‌లో లావాదేవీలు చేయలేని దేశాలు స్థానిక కరెన్సీలు, ఇతర ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు మొగ్గుతున్నాయి. 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయిలో లావాదేవీలకు అనుమతించింది. దీంతో రష్యాతో చమురు వాణిజ్యం రూపాయిలు, యూఏఈ దిర్హామ్‌లలో జరుగుతోంది. రష్యా-చైనా వాణిజ్యంలో 90% రూబుల్స్, యువాన్‌లలో సెటిల్ అవుతోంది, 2022కు ముందు ఇది 30% మాత్రమే ఉంది. సౌదీ అరేబియా కూడా నాన్-డాలర్ చమురు వాణిజ్యానికి వెళ్లేలా ఉంది. ఇది 1970ల పెట్రోడాలర్ ఒప్పందానికి వ్యతిరేకంగా మారొచ్చు. ఇరాన్ యూరో, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, డిజిటల్ కరెన్సీలను అన్వేషిస్తోంది. రష్యా స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా సిస్టమ్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్ అనే కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసింది. చైనా క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ను ఉపయోగిస్తోంది. బ్రిక్స్ దేశాలు గోల్డ్-బ్యాక్డ్ యూనిట్ కరెన్సీని పరిశీలిస్తున్నాయి, అయితే భారత్ బ్రిక్స్ కామన్ కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించింది.

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్, వెనిజులా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు డాలర్ ఆధారిత లావాదేవీలు చేయడానికి వీలుల లేకుండా పోయింది. 2018లో ఇరాన్‌పై ఆంక్షలు తిరిగి విధించినప్పుడు, 2022లో రష్యాపై స్విఫ్ట్ నిషేధం, వెనిజులాపై నిరంతర ఆంక్షలు ఈ దేశాలతో డాలర్‌లో చెల్లింపులు కష్టమయ్యాయి. యూరోపియన్ దేశాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు రష్యా రూబుల్స్‌లో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేసింది. దీనివల్ల రూబుల్ విలువ స్థిరపడింది. ఈ చర్యలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నాయి.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్-జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అమెరికా ఆర్థిక, భౌగోళిక రాజకీయ చర్యలు దేశాలను డీ-డాలరైజేషన్ వైపు నడిపిస్తున్నాయని స్పష్టం చేశారు. డాలర్ నుంచి మార్పు ఒక తిరుగుబాటు కాదు, అది ఏకైక మార్గం అని ఆయన అన్నారు. రష్యా-చైనా వాణిజ్యంలో 90% రూబుల్స్, యువాన్‌లలో, భారత్-రష్యా చమురు వాణిజ్యం రూపాయిలు, దిర్హామ్‌లలో జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా నాన్-డాలర్ చమురు వాణిజ్యానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు, స్విఫ్ట్ నిషేధాలు దేశాలను డాలర్ ప్రత్యామ్నాయాల వైపు నడిపించాయని, ఇది ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఒక అవసరమైన చర్య అని శ్రీవాస్తవ చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 10% బ్రిక్స్ టారిఫ్, 500% రష్యన్ చమురు టారిఫ్‌లు దేశాలను మరింత డీ-డాలరైజేషన్ వైపు నెట్టివేస్తాయని ఆయన హెచ్చరించారు. భారత్ చైనా బ్రిక్స్ కామన్ కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, రూపాయి ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.

డాలర్ రాకముందు చలామణిలో ఉన్న కరెన్సీ ఏంటి..?
డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఆవిర్భవించడానికి ముందు, రెండవ ప్రపంచ యుద్ధం వరకు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం వహించింది. 1944లో బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం తర్వాత డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారింది. బ్రిటిష్ పౌండ్, ఫ్రెంచ్ ఫ్రాంక్, జర్మన్ మార్క్ వంటి కరెన్సీలు వివిధ దేశాలలో వాణిజ్యానికి ఉపయోగించబడేవి. బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థలో డాలర్ బంగారానికి పెగ్ చేయబడినప్పటికీ, 1971 తర్వాత ఈ వ్యవస్థ కూలిపోయింది. డాలర్ ప్రధాన అంతర్జాతీయ కరెన్సీగా మారింది. ఆ సమయంలో అంతర్జాతీయ వాణిజ్యంలో బంగారం, వెండి కూడా కొంత మేర ఉపయోగించబడ్డాయి.

డాలర్ రాకముందు భారత రూపాయి విలువ ఎలా ఉండేది..?
1947లో భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు, రూపాయి విలువ బ్రిటిష్ పౌండ్‌కు లింక్ చేసి ఉండేది. ఒక పౌండ్ దాదాపు 13.37 రూపాయలుగా ఉండేది. అప్పట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 4.16 రూపాయలు ఒక డాలర్‌కు సమానంగా ఉండేదని అంచనా. బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ప్రకారం, రూపాయి బ్రిటిష్ పౌండ్ ద్వారా డాలర్‌కు అనుసంధానించబడింది. 1971 వరకు రూపాయి డాలర్‌తో 7.5 రూపాయల వద్ద స్థిరంగా ఉండేది. అయితే, 1971లో నిక్సన్ షాక్, 1973లో ఆయిల్ క్రైసిస్ వల్ల రూపాయి విలువ క్షీణించడం ప్రారంభమైంది. 1975 తర్వాత రూపాయి వివిధ కరెన్సీలతో అనుసంధానించబడింది. 1990లలో ఆర్థిక సంక్షోభం వల్ల రూపాయి మరింత క్షీణించి, 1992లో ఒక డాలర్‌కు 25.92 రూపాయలకు చేరుకుంది.

బ్రిటిష్ కాలంలో రూపాయి విలువ బ్రిటిష్ పౌండ్‌కు అనుసంధానించబడి ఉండేది. 1927 నుంచి 1966 వరకు ఒక పౌండ్ సుమారు 13 రూపాయలుగా ఉండేది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితులు, గ్రేట్ డిప్రెషన్ వంటి అంతర్జాతీయ కారణాలు రూపాయి విలువను ప్రభావితం చేశాయి. 1947లో స్వాతంత్ర్యం సమయంలో రూపాయి విలువ స్థిరంగా ఉంది, ఎందుకంటే భారత్‌కు విదేశీ రుణాలు లేవు. అయితే, స్వాతంత్ర్యం తర్వాత యుద్ధాలు, ఆయిల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభాల వల్ల రూపాయి విలువ క్రమంగా క్షీణించింది. 2025 నాటికి ఒక డాలర్ సుమారు 85.82 రూపాయలుగా ఉంది, గత 12 నెలల్లో 2.76% క్షీణతను చూపింది.

Also Read: https://www.mega9tv.com/international/trump-has-stopped-the-aid-fund-with-the-america-first-policy-and-suspended-us-air-travel/