
Thailand And Combodia War: ప్రస్తుతం ప్రపంచంలోనే చాలా దేశాలు యుద్ధం వైపు ఎందుకు అడుగులు వేస్తున్నాయి. సరిహద్దులు, రక్షణ పేరుతో ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగియలేదు, ఇజ్రాయెల్ తన చుట్టు పక్కల శత్రుదేశాలతో పోరాటం ఆపనేలేదు, నిన్నకాక మొన్న భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు. ఇప్పుడు ఆసియాలోని మరో రెండు దేశాలు యుద్ధానికి రెడీ అయిపోయాయి.. ఇంతకీ ఆ దేశాలు ఏంటి..? అక్కడ యుద్ధ మేఘాలు ఎందుకు అలుముకుంటున్నాయి..? అసలు ఆ దేశాల మధ్య గొడవ ఏంటి…? తెలుసుకోవాలంటే ఈ ప్యాకేజీ చూడాల్సిందే..
ఆసియాలో రెండు దేశాలు ఇప్పుడు యుద్ధం చేసుకోవడానికి సద్ధం అవుతున్నాయి. అవే థాయ్‌ల్యాండ్, కంబోడియా. సరిహద్దు వివాదాలు, పురాతన దేవాలయాల చుట్టూ ఏర్పడిన సమస్యలు, మందుపాతర ఘటనలు ఈ రెండు దేశాలను తీవ్ర ఘర్షణ వైపు నడిపిస్తున్నాయి. ఈ సరిహద్దు సమస్య కారణంగా థాయ్‌ల్యాండ్ ప్రధాని తన పదవిని కూడా కోల్పోయారు. ఈ రెండు దేశాల మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ పాలన సమయంలో ఈ సరిహద్దును నిర్ణయించగా.. ఈ సరిహద్దు ప్రాంతంలోని ఆలయాల విషయంలో వివాదాలు ఈ యుద్ధానికి కారణంగా మారాయి. 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్మానించినప్పటికీ, స్థానికుల భావోద్వేగాలు ఈ సమస్యను ఇంకా రగిలిస్తున్నాయి. తాజాగా, ల్యాండ్‌మైన్ ఘటనలు, థాయ్‌ల్యాండ్ యుద్ధ విమానాల దాడులు, కంబోడియా సైనికుల దాడులు ఈ సంఘర్షణను మరింత తీవ్రం చేశాయి.
9వ శతాబ్దంలో నిర్మించిన ప్రీహ్ విహార్ అనే ఆలయం విషయంలో కూడా థాయ్ ల్యాండ్, కంబోడియా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ ఆలయాన్ని ఖెమర్ రాజవంశం నిర్మించింది, ఇది డాంగ్రెక్ పర్వతాల శిఖరంపై థాయ్‌ల్యాండ్‌కు సమీపంలో ఉంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీనిని థాయ్‌ల్యాండ్ కూడా అంగీకరించింది. అయినప్పటికీ, ఈ ఆలయం చుట్టూ స్థానిక థాయ్ ప్రజలు ఇది తమకే చెందుతుందని ఇప్పటికీ అంటుండటంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. 2008లో కంబోడియా అభ్యర్థన మేరకు యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది, దీనిని థాయ్‌ల్యాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా చూపిన సరిహద్దు మ్యాప్‌లో 4.6 చదరపు మైళ్ల భూమిని ఆక్రమించినట్లు థాయ్‌ల్యాండ్ ఆరోపించింది. ఈ ప్రాంతంలో సరిహద్దు నిర్ణయం స్పష్టంగా జరగలేదు, దీనివల్ల 2008 నుంచి 2011 మధ్య రెండు దేశాల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 2011లో ఈ సంఘర్షణలలో దాదాపు చాలా మంది మరణించారు, వేలాది మంది సరిహద్దు ప్రాంతాల నుంచి తమ ఇళ్లను వదిలి పారిపోయారు. Thailand And Combodia War.
కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం మరో తీర్పు ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది. ప్రీహ్ విహార్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో కంబోడియాకు సార్వభౌమాధికారం ఉందని, థాయ్‌ల్యాండ్ సైనిక దళాలు ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని ఆదేశించింది. బ్యాంకాక్ ఈ తీర్పును అంగీకరించినప్పటికీ, సరిహద్దు మ్యాప్‌లు, సైనిక గస్తీలపై కొత్త వివాదాలు తలెత్తాయి. థాయ్‌ల్యాండ్‌లోని సురిన్ ప్రావిన్స్‌లో ఉన్న ట మోన్ థోమ్ , ట మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా మారాయి. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన ఒక ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించాడు. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి.
ఈ సరిహద్దు వివాదం థాయ్‌ల్యాండ్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. అధికారం చేపట్టి పది నెలలు గడవకముందే థాయ్‌ల్యాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా తన పదవిని కోల్పోయారు. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఆమె చేసిన ఫోన్ సంభాషణలో, ఆమె హున్‌సేన్‌ను అంకుల్ అని సంబోధించి, థాయ్‌ల్యాండ్‌లోని రాజకీయ, సైనిక పరిస్థితులను వివరించారు. థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ ఫోన్ సంభాషణ లీక్ కావడంతో థాయ్‌ల్యాండ్‌లో ఆమెకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సంభాషణ దేశ ప్రతిష్ఠను, సైన్యం గౌరవాన్ని దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో షినవత్రా సంకీర్ణ ప్రభుత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఆమెకు మద్దతు ఉపసంహరించుకుని, ప్రభుత్వం నుంచి విడిపోయింది. ఫలితంగా షినవత్రా తన పదవిని కోల్పోయారు.
ఇటీవలి కాలంలో థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య మందుపాతర ఘటనలు ఈ రెండు దేశాల మధ్య మంటలకు మరింత పెట్రలో పోసాయి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ల్యాండ్‌మైన్లు పేలడంతో థాయ్ సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనలు తమ భూభాగంలో జరిగాయని థాయ్‌ల్యాండ్ వాదిస్తుండగా, కంబోడియా మాత్రం ఇవి ప్రీహ్ విహార్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో జరిగాయని పేర్కొంది. గత వారంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కంబోడియా రష్యా నుంచి కొనుగోలు చేసిన మైన్లను ఈ ప్రాంతంలో ఇటీవల పాతినట్లు థాయ్‌ల్యాండ్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను కంబోడియా తోసిపుచ్చింది, థాయ్ సైనిక దళాలు ఒప్పందంలోని గస్తీ మార్గాలను ఉల్లంఘిస్తున్నాయని వాదించింది.
దీనికి తోడు థాయ్‌ల్యాండ్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ట మోన్ థోమ్ ఆలయ ప్రాంతంలో బాంబు దాడులు చేశాయి. దీనికి ప్రతిగా, కంబోడియా సైనిక దళాలు శతఘ్నులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఈ సైనిక దాడులు జరుగుతున్న ప్రాంతంలో దాదాపు 40,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. థాయ్‌ల్యాండ్ సరిహద్దులను మూసివేసింది, కంబోడియా తన రాయబారులను బ్యాంకాక్ నుంచి వెనక్కి రప్పించింది. అయితే ఈ రెండు దేశాల మధ్య సంక్షోభం చారిత్రక ఆలయాలు, జాతీయ భావోద్వేగాలు, మందుపాతర ఘటనలతో తీవ్రమైనట్టు కనిపిస్తున్నాయి. ఈ సంఘర్షణ ఆసియా శాంతికి, రెండు దేశాల సంబంధాలకు పెద్ద సవాలుగా మారింది.