
Trump defamation lawsuit against Wall Street Journal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్‌పై వేసిన 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా కేసు అమెరికన్ రాజకీయాల్లో, అంతర్జాతీయ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ట్రంప్‌కు, సెక్స్ స్కాండల్ నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్‌కు సంబంధం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం ఈ వివాదానికి కారణమైంది. అసలు ఈ కథనం వెనుక వాస్తవాలు ఏమిటి? ట్రంప్, ఎప్స్టైన్ మధ్య సంబంధం ఎంతవరకు నిజం? నిజాం ట్రంప్ కు సెక్స్ కేసులతో సంబంధం ఉందా?
వాల్ స్ట్రీట్ జర్నల్, దాని యజమాని రూపర్ట్ మర్డోక్, ఇతర సంబంధిత మీడియా సంస్థలపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం కేసు దాఖలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాల్ స్ట్రీట్ జర్నల్ జనవరిలో ప్రచురించిన ఒక కథనం ఈ కేసుకు కారణంగా చెబుతున్నారు. 2003లో ట్రంప్ సెక్స్ స్కాండల్ నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్‌కు పంపిన జన్మదిన శుభాకాంక్షల లేఖ గురించి ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ లేఖలో అభ్యంతరకరమైన డిజైన్లు, వ్యంగ్య పదజాలం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ట్రంప్ ఈ లేఖను పూర్తిగా ఫేక్ అని ఖండించారు. తాను అలాంటి లేఖలు రాయను, చిత్రాలు గీయను. ఇది తన పరువును దెబ్బతీసే కుట్ర అని ట్రంప్ పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్, మర్డోక్, రిపోర్టర్లపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ట్రంప్, కథనం ప్రచురితమైన తర్వాత కోర్టుకు వెళ్లారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలువడిన వెంటనే ట్రంప్ మద్దతుదారులు, కొందరు రిపబ్లికన్ నాయకులు మీడియా తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కథనం ట్రంప్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని వారు ఆరోపించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ పూర్తిగా అబద్ధాలు ప్రచురించిందని.. రూపర్ట్ మర్డోక్ తనను తగ్గించే ప్రయత్నం చేశాడని.. కానీ ఇప్పుడు అతను కోర్టులో తనను ఎదుర్కోవాలని అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ మద్దతుదారులు ఈ కథనాన్ని ఫేక్ న్యూస్ గా చెబుతూ, మీడియా సంస్థలు రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నాయని విమర్శించారు. Trump defamation lawsuit against Wall Street Journal.
ట్రంప్, జెఫ్రీ ఎప్స్టైన్ మధ్య సంబంధం 1980ల చివరి నుంచి 2000 వరకు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇద్దరూ పామ్ బీచ్, న్యూయార్క్‌లోని పలు పార్టీలు, ప్రైవేట్ ఈవెంట్‌లలో కలిసి కనిపించారు. 2002లో ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో, జెఫ్రీ మంచి వ్యక్తి, చాలా కాలంగా తనకు తెలుసునని.. అతనికి అమ్మాయిల పట్ల ఆసక్తి ఉందని చెప్పిన వ్యాఖ్యలు న్యూయార్క్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. అయితే, 2006లో జెఫ్రీపై లైంగిక నేర ఆరోపణలు రాగానే ట్రంప్ అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఎప్స్టైన్‌తో చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నానని.., అతని దురాగతాలకు తాను మద్దతు ఇవ్వలేదు అని ట్రంప్ వివరణ ఇచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఎప్స్టైన్ సహచరి గిస్లేన్ మాక్స్‌వెల్ 2003లో ఎప్స్టైన్ జన్మదిన ఆల్బమ్‌లో ఈ లేఖ దొరికినట్లు పేర్కొన్నారు, దీనిలో ట్రంప్ పేరుతో అభ్యంతరకర రాతలు, రేఖాచిత్రాలు ఉన్నాయని ఆరోపించారు.
జెఫ్రీ ఎప్స్టైన్ అమెరికన్ హైసొసైటీలో లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తిగా ఆరోపణలు ఉన్నాయి. అతడిపై 2006లో మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు రాగా, 2008లో ఒక కేసులో శిక్ష అనుభవించాడు. 2019లో మరోసారి అరెస్టై, జైలులో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్స్టైన్ సహచరి గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం లైంగిక నేరాలకు సంబంధించి శిక్ష అనుభవిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, 2003 ఎప్స్టైన్ జన్మదిన ఆల్బమ్‌లో ట్రంప్ పేరుతో లేఖ దొరికినట్లు చెప్పబడింది, దీనిని ట్రంప్ నకిలీ అని ఖండించారు. ఈ కథనం ట్రంప్‌ను ఎప్స్టైన్ నేరాలతో ముడిపెట్టే ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు, అయితే ట్రంప్‌పై ఇలాంటి నేర ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని మద్దతుదారులు వాదిస్తున్నారు.
ట్రంప్‌పై గతంలో వ్యాపార లావాదేవీలు, ఎన్నికల కౌంటింగ్, లైంగిక ఆరోపణలు వంటి అనేక వివాదాలు ఉన్నాయి. ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, దానిపై కేసు కొత్త అధ్యాయంగా చూడవచ్చు. ట్రంప్ గతంలో కూడా CNN, న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు వేసి, మీడియాపై ఎదురుదాడులు చేసే వ్యూహాన్ని అనుసరించారు. ఈ కేసు కూడా ఆ వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు ట్రంప్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు డెమోక్రాట్‌లు, లిబరల్ మీడియా కలిసి చేసిన ప్రయత్నంగా ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ కథనం మీడియా స్వేచ్ఛపై ట్రంప్ విధానాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.
జెఫ్రీ ఎప్స్టైన్ కేసు అమెరికన్ రాజకీయ, సామాజిక వర్గాల్లో ఇప్పటికీ పెద్ద వివాదం. ఎప్స్టైన్‌తో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ధనవంతుల పేర్లు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. కొందరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ఎప్స్టైన్ కేసు డాక్యుమెంట్‌లను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులు ఈ కథనాన్ని వాస్తవాలను తప్పుదారి పట్టించే కుట్ర గా చూస్తున్నారు. ఎప్స్టైన్ కేసులో ట్రంప్‌పై నేరుగా క్రిమినల్ ఆధారాలు లేవని, కానీ మీడియా అతని పేరును ముడిపెట్టడం రాజకీయ ఉద్దేశంతో జరిగిందని వాదిస్తున్నారు.
ఈ వివాదం అమెరికన్ మీడియా స్వేచ్ఛ, రాజకీయ ప్రయోజనాల మధ్య సంఘర్షణను మరోసారి బయటపెట్టింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, రూపర్ట్ మర్డోక్ మీడియా సామ్రాజ్యం, ట్రంప్ లీగల్ చర్యలు అమెరికన్ ప్రజాస్వామ్యంలో చట్టపరమైన పోరాటంగా కనిపిస్తున్నాయి. ట్రంప్-ఎప్స్టైన్ సంబంధంపై ఇప్పటివరకు క్రిమినల్ విచారణలో ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ మీడియా కథనాలు, సోషల్ మీడియా దుమారం కొనసాగుతోంది. ట్రంప్ ఈ కేసును తన రాజకీయ బేస్‌ను బలోపేతం చేసుకునేందుకు, మీడియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసు ఫలితం 2026 మధ్యంతర ఎన్నికలపై, అంతర్జాతీయ మీడియా విశ్వసనీయతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.