యూఏఈ గోల్డెన్ వీసా ప్రచారం ఫేకా..?

UAE Golden Visa: 23 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు యూఏఈలో శాశ్వత నివాసం అనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లో లైఫ్‌టైమ్ గోల్డెన్ వీసా అంటూ ప్రచారం చేయగా, కొందరు భారతీయులు నమ్మి అప్లై చేయడానికి ప్రయత్నించారు. పలు కన్సల్టెన్సీలను సంప్రదించారు. అయితేు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అసలు గోల్డెన్ వీసా 23 లక్షలకు అనే ప్రచారం ఫేక్ అని తేల్చింది. కానీ గోల్డెన్ వీసా ఉందని చెప్పింది. అందేంటి గోల్డెన్ వీసా ఉందని అంటున్నారు.. మరోపక్క ఫేక్ ప్రచారం అంటున్నారు.. అసలు దీని వెనుక నడిచిన వ్యవహారం ఏంటి..? అలాగే అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పౌరసత్వానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి..?

యూఏఈలో స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు.. అలాంటి వారి కోసం గోల్డెన్ వీసా తీసుకొచ్చామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినట్టు గత వారం రోజులుగా ప్రచారం జరిగింది. అయితే అది ఫేక్ అని తేలిపోయింది. యూఏఈలో రూ. 23 లక్షలకు జీవితకాల గోల్డెన్ వీసా అందిస్తామని వైరల్ అయిన ప్రచారం నకిలీదని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ తేల్చేసింది. ఈ ఫేక్ న్యూస్ వెనుక దుబాయ్ కు చెందిన రాయద్ గ్రూప్ ఉదని గుర్తించాు. వీరు VFS గ్లోబల్‌ అనే సంస్థతో కలిసి నామినేషన్ ఆధారిత వీసా అందిస్తామని ప్రకటించారు. రాయద్ గ్రూప్ MD చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుని.. తాము తప్పుడు సమాచారం ప్రచారం చేశామని ఆ సంస్థ క్షమాపణ చెప్పింది. మరోవైపు ఈ తప్పుడు ప్రచారంపై యూఏఈ అధికారులు సీరియస్ అయ్యారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటి..?
యూఏఈ గోల్డెన్ వీసా అనేది 5 లేదా 10 సంవత్సరాల రెన్యువల్ అయ్యే నివాస వీసా. ఇది పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అత్యుత్తమ విద్యార్థులు, మానవతావాదులకు మాత్రమే ఇస్తారు. సుమారు రూ. 4.66 కోట్లు పెట్టుబడి లేదా ఏదైనా రంగంలో ప్రత్యేక సామర్థ్యం ఉంటే దీనికి అర్హత లభిస్తుంది. ఈ వీసాకు స్పాన్సర్ అవసరం లేదు. కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయవచ్చు, యూఏఈ వెలుపల ఎక్కువ కాలం ఉన్నా వీసా చెల్లుబాటు అవుతుంది. అయితే కొందరు ఈ వీసాను తప్పుదారి పట్టించారనే అంటున్నారు. ఈ వీసా అందరికీ రాకపోయినా .. 23 లక్షలు కడితే చాలు గోల్డెన్ వీసా వచ్చేస్తుంది అంటే నమ్మేశారు. కొందరు పలు కన్సల్టెన్సీలను కలిసి ఈ వీసా కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఇది ఫేక్ ప్రచారం అని తేలడంతో.. అందరూ ఊసురోమన్నారు. అలాగని ఇది పూర్తిగా ఫేక్ వీసా కదా విశేష ప్రతిభావంతులకు ఈ విసాను ఇస్తున్నారు. UAE Golden Visa.

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అసలు ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి..
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వీసాలు రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి. విజిట్ వీసాలు, రెసిడెన్సీ వీసాలు. ఈ వర్గాల కింద వివిధ రకాల వీసాలు ఉన్నాయి, ఒక్కోటి నిర్దిష్ట ప్రయోజనం, అర్హతలను కలిగి ఉంటాయి. విజిట్ వీసాలు అనేవి యూఏఈలో స్వల్పకాలిక ఉపయోగం కోసం విజిట్ వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టూరిస్ట్ వీసా ఉంది, ఇది వీసా-ఆన్-అరైవల్ లేదా వీసా-ఫ్రీ ఎంట్రీకి అర్హత లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రాన్సిట్ వీసా యూఏఈ గుండా ఇతర గమ్యస్థానాలకు వెళ్ళే వారి కోసం. మెడికల్ వీసా అనేది యూఏఈలోని లైసెన్స్‌డ్ హాస్పిటల్ స్పాన్సర్‌షిప్‌తో వైద్య చికిత్స కోసం జారీ చేయబడుతుంది. జాబ్ సీకర్ వీసా స్పాన్సర్ లేకుండా ఉద్యోగ, పెట్టుబడి, లేదా వ్యాపార అవకాశాల కోసం 60 రోజులు ఉండటానికి అనుమతిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్సీ వీసాల విషయానికి వస్తే.. యూఏఈలో దీర్ఘకాలిక నివాసం కోసం స్టాండర్డ్ రెసిడెన్సీ వీసాలు 1-3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడతాయి. వర్క్ వీసా అనేది యూఏఈలో ఉపాధి పొందిన వారికి యజమాని స్పాన్సర్‌షిప్‌తో జారీ చేయబడుతుంది, ఫ్యామిలీ వీసా అనేది యూఏఈ నివాసితులకు జీవిత భాగస్వామి, 25 ఏళ్లలోపు పిల్లలు, వివాహం కాని కుమార్తెలు, డిటర్మినేషన్ ఉన్న పిల్లలను స్పాన్సర్ చేయడానికి ఇస్తారు. స్టూడెంట్ వీసా- యూఏఈ విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులకు 1 సంవత్సరం వ్యవధితో జారీ చేయబడుతుంది, డొమెస్టిక్ వర్కర్ వీసా గృహ కార్మికులకు స్పాన్సర్ ద్వారా జారీ చేయబడుతుంది.

ఇక లాంగ్-టర్మ్ రెసిడెన్సీ వీసాల విషయానికి వస్తే.. యూఏఈలో దీర్ఘకాలిక నివాసం కోసం గోల్డెన్ వీసా, గ్రీన్ వీసా అందుబాటులో ఉన్నాయి. గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, సైంటిస్ట్‌లు, వైద్యులు, ఇంజనీర్లు, అత్యుత్తమ విద్యార్థులు, మానవతావాదులకు జారీ చేయబడుతుంది. గ్రీన్ వీసా స్కిల్డ్ ఎంప్లాయీస్ , ఫ్రీలాన్సర్లు, ఇన్వెస్టర్లు కోసం ఇస్తారు. రిటైర్మెంట్ వీసా 55 ఏళ్లు పైబడిన వారికి 5 సంవత్సరాల వ్యవధితో అందుబాటులో ఉంది. రిమోట్ వర్క్ వీసా దుబాయ్‌లో యజమాని కోసం రిమోట్‌గా పనిచేసే వారికి 1 సంవత్సరం వ్యవధితో జారీ చేయబడుతుంది. అలాగే హ్యూమానిటేరియన్ వీసా ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేయబడుతుంది. ఇన్వెస్టర్ వీసా కంపెనీ షేర్‌హోల్డర్లకు 3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడుతుంది, ప్రాపర్టీ ఓనర్ వీసా రియల్ ఎస్టేట్ యజమానులకు 2-3 సంవత్సరాల వ్యవధితో జారీ చేయబడుతుంది. యూఏఈలో మొత్తం 12 ప్రధాన వీసా రకాలు ఉన్నాయి.

అమెరికాలో శాశ్వత నివాసానికి ఎలా వీసా ఉంది..?
అమెరికాలో శాశ్వత నివాసం కోసం పలు వీసాలు ఉన్నాయి. వాటిలో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రముఖమైనది. EB-5 కింద, సుమారు రూ. 6.7 కోట్లు పెట్టుబడి పెట్టి.. ఉద్యోగాలు సృష్టిస్తే గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఈ వీసా ద్వారా 5 సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇతర వీసాల్లో కుటుంబ స్పాన్సర్‌షిప్, ఉపాధి ఆధారిత వీసాలు ఉన్నాయి. EB-5 ప్రక్రియ సంక్లిష్టమైనది, స్క్రూటినీ, ఉద్యోగాలు సృష్టించాలి. ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి? ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది 2025లో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుమారు రూ. 44 కోట్లు పెట్టుబడి ఆధారిత శాశ్వత నివాస వీసా. ఇది EB-5 వీసాను భర్తీ చేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది, కానీ ఉద్యోగ సృష్టి అని పని లేకుండా డబ్బు ఉంటే చాలు దీనిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది గ్రీన్ కార్డ్‌తో పాటు పౌరసత్వానికి లైన్ క్లియర్ చేస్తుంది. అయితే ఇది ఇంకా అమలులోకి రాలేదు, దీనికి చట్టపరమైన ఆమోదం అవసరం. ఈ ప్రతిపాదనపై విమర్శలు ఉన్నాయి, ఎందుకంటే ఇది సంపన్నులకు ఇమ్మిగ్రేషన్‌ను సులభతరం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

యూకేలో శాశ్వత నివాస వీసాలు ఎన్ని రకాలు..?
యూకేలో శాశ్వత నివాసం కోసం టైర్ 1 ఇన్వెస్టర్ వీసా గతంలో ఉండేది. కానీ 2022లో భద్రతా కారణాల దృష్ట్యా రద్దయింది. ప్రస్తుతం, ఇన్నోవేటర్ వీసా, స్టార్టప్ వీసా, గ్లోబల్ టాలెంట్ వీసా ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇన్నోవేటర్ వీసాకు సుమారు రూ. 54 లక్షలు పెట్టుబడి, వ్యాపార ఆలోచన అవసరం. 5 సంవత్సరాల తర్వాత ILR లభిస్తుంది, ఆ తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయవచ్చు. యూకేలో పన్ను విధానం కఠినంగా ఉంటుంది, గ్లోబల్ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస వీసాలు ఎలా ఉన్నాయి..?
ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రముఖమైనది. ఇందులో ఇన్వెస్టర్ స్ట్రీమ్ కింద సుమారు రూ. 14 కోట్లు పెట్టుబడి పెట్టాలి. 4 సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసం లభిస్తుంది. స్కిల్‌డ్ మైగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది, ఇలాంటి వీసాలను నైపుణ్యం ఆధారంగా పాయింట్‌ల సిస్టమ్‌ను అనుసరించి ఇస్తారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం 4 సంవత్సరాల నివాసం తర్వాత దరఖాస్తు చేయవచ్చు.

Also Read: https://www.mega9tv.com/international/texas-floods-guadalupe-river-overflows-worst-scene-in-100-years-over-100-dead/