ట్రంప్, పుతిన్ మీటింగ్ అలాస్కాలోనే ఎందుకు జరుగుతోంది..?

Trump Putin Meeting Alaska: చీమలు దూరని చిట్టడివి.. కాకులు దూరని కారడివి.. అలాంటి అడవిలోకి వెళ్లడం ఎంత కష్టం. స్టోరీ అంటూ కథలు చెబుతున్నారేంటి అనుకోవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ జరిగే ప్రాంతాన్ని ఇలానే అనొచ్చేమో. ఎందుకంటే పుతిన్ పై అనేక దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. వాటిని తప్పించుకుని.. ఓ సురక్షిత ప్రాంతంలో సమావేశం జరగాలంటే అమెరికాలోని అలాస్కానే సేఫ్ అని భావించారు. పైగా అలాస్కాతో రష్యాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అసలు అలాస్కానే ట్రంప్, పుతిన్ మీటింగ్ కు కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి..? పుతిన్ ప్రయాణాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు. ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో జరగనున్న సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. నాటో దేశాల గగనతలంలో పుతిన్ విమానానికి అనుమతి లేకపోవడంతో, వీరిద్దరి మీటింగ్ కోసం అలాస్కాను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అలాస్కాలోని యాంకరేజ్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కోసం అలాస్కాను సెలెక్ట్ చేసుకోవడం వెనుక రష్యా, అలాగే అమెరికా రాజకీయ, చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు రష్యా భాగమైన అలాస్కాను 1867లో అమెరికాకు అమ్మేశారు. ఈ చారిత్రక నేపథ్యం ఈ మీటింగ్‌కు సింబాలిక్ ప్రాముఖ్యతను ఇస్తోంది. అలాస్కా రష్యాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉండడం, అమెరికా-రష్యా మధ్య ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ సమావేశం ద్వారా ట్రంప్, పుతిన్ ఉక్రెయిన్ సంక్షోభం, గ్లోబల్ రాజకీయాలపై చర్చించనున్నారని అంచనా.

నాటో దేశాలు పుతిన్ విమానానికి తమ గగనతలం నుంచి ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో, రష్యా అధ్యక్షుడు అలాస్కాకు చేరుకోవడానికి ప్రత్యేక వాయు మార్గాన్ని ఎంచుకున్నారు. బెరింగ్ స్ట్రెయిట్ ద్వారా నేరుగా అలాస్కాకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, భద్రతా కారణాలతో పుతిన్ చార్టర్డ్ విమానం ఆర్కిటిక్ రూట్ ద్వారా ప్రయాణించనుంది. ఈ మార్గం రష్యా తూర్పు ప్రాంతమైన చుకోట్కా నుంచి అలాస్కా వైపు సురక్షితమైన మిలిటరీ కారిడార్‌ను కలిగి ఉంటుంది. అందుకే పుతిన్ నాటో దేశాల పై నుంచి కాకుండా ఈ మార్గంలో రానున్నారు. అలాస్కాలోనే అమెరికా కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. ఉత్తర అమెరికాను ముప్పు నుంచి హెచ్చరించే వార్నింగ్స్ సిస్టమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా మోహరించింది. ఈ యాంకరేజ్ లోని ఎల్మెండోర్ఫ్ -రిచర్డ్సన్ సైనిక స్థావరంలో దాదాపు 32 వేల మంది ఉన్నారు. దీనిని సందర్శించిన తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.

అసలు అలాస్కాకు రష్యాకు సంబంధం ఏంటి..?
18వ శతాబ్దం వరకు అలాస్కా రషియన్ అమెరికాగా రష్యా నియంత్రణలో ఉండేది. రష్యా అప్పట్లో ఇక్కడ సముద్ర వనరులను ఉపయోగించుకునేది. అయితే, 19వ శతాబ్దం నాటికి రష్యాకు ఆర్థిక ఇబ్బందులు, ఈ ప్రాంతాన్ని నిర్వహించడంలో సమస్యలు ఎదురయ్యాయి. 1867లో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం సీవర్డ్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని, అలాస్కాను కొనుగోలు చేశారు. ఈ డీల్ పై అప్పట్లో విమర్శలు వచ్చినా ఆ తర్వాత అమెరికాకు ఇది ఎంతో లాభాలను తెచ్చిపెట్టింది. బంగారు గనులు, చమురు, మత్స్య సంపద కారణంగా అమెరికాకు ఇది లాభదాయక ఒప్పందంగా మారింది. 1959లో అలాస్కా అమెరికా 49వ రాష్ట్రంగా అధికారికంగా గుర్తింపబడింది.

అలాస్కా, రష్యా మధ్య దూరం బెరింగ్ జలసంధి వద్ద చాలా తక్కువ. ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య దూరం 88 కి.మీ. మాత్రమే ఉంటుంది. రష్యాకు చెందిన బిగ్ డయోమీడ్ దీవి, అమెరికాకు చెందిన లిటిల్ డయోమీడ్ దీవి మధ్య కేవలం 3.8 కిలోమీటర్ల దూరం ఉంది, ఇది రెండు దేశాల మధ్య అతి సమీప ప్రాంతం. దీని కారణంగా అలాస్కా రష్యా-అమెరికా సంబంధాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భౌగోళిక కారణాల వల్ల ఈ సమావేశానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ముఖ్యంగా ఈ సమావేశంలో అలాస్కా ప్రస్తావనను పుతిన్ తీసుకు వస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావిస్తున్నారు. ఎందుకంటే రష్యా భూభాగమైన అలాస్కాను అమెరికాకు ఇచ్చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా డిమాండ్ చేస్తోంది. దీనికి లింక్ పెడుతూ అలాస్కా ప్రస్తావన తెస్తారని భావిస్తున్నారు.

ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి ఆహ్వానం లేకపోవడంతో ఉక్రెయిన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ భవిష్యత్తుపై చర్చలు జరపడం అన్యాయం అని జెలెన్స్కీ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ఈ మీటింగ్ ఉక్రెయిన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే ఉక్రెయిన్ ఈ సమావేశాన్ని ప్రమాదకరమైన చర్యగా చూస్తోంది. యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు కూడా ఈ మీటింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. జెలెన్స్కీ శాంతి కోసం రాజీపడే ఒప్పందాల కంటే, శాశ్వత శాంతే లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ సమావేశం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భద్రతపై ప్రభావం చూపవచ్చని వారి ఆందోళన వ్యక్తమవుతోంది. Trump Putin Meeting Alaska.

ఉక్రెయిన్ రియాక్షన్ ఎలా ఉన్నా ఈ సమావేశం అమెరికా, రష్యా మధ్య సంబంధాల్లో ఓ మైలు రాయి కానుంది. అంతంత మాత్రంగా ఉన్న అమెరికా, రష్యా సంబంధాలు ఈ సమావేశం తర్వాత బలపడనున్నాయని అంటున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో ట్రంప్ తన మొదటి టర్మ్ లో మంచి సంబంధాలు నెలకొల్పారు. ఆ సమావేశం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో ఇప్పుడు పుతిన్, ట్రంప్ సమావేశం కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ సమావేశం చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ పట్టు వదలని విక్రమార్కుడిలా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కొసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల మధ్య తన వల్లే యుద్ధాలు ఆగాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు రష్యాతో ఒప్పందం కుదిరితే ఇది నిజంగా ట్రంప్ కృషే అవుతుంది. అప్పుడు తనకు ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి వస్తుందని భావిస్తున్నారు ట్రంప్. అందుకే ఈ డీల్ ఎలాగైనా కుదర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/new-difficulties-for-americans-concern-in-the-us-demanding-trumps-resignation/