బాబోయ్..అమీబా.!

Brain Eating Amoeba: అదో సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. చెవికి వినిపించదు. అసలు దాని ఉనికే మనిషికి తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన శరీరంలోకి దూరి, మన మెదడులోకి ప్రవేశించి..కొంచెం కొంచెంగా మన బ్రెయిన్‌ను తినేస్తుంది. కొన్నిరోజుల్లోనే మనల్ని చంపేస్తుంది. అంతటి డేంజర్ క్రిమి..ఇప్పుడు మన దేశాన్ని భయపెడుతోంది. అదే అమీబా. ఇప్పుడది కేరళను వణికిస్తోంది.

ఈ ప్రపంచంలో చాలా వ్యాధులకు మందులు లేవు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అమీబా వ్యాధికి కూడా వ్యాక్సిన్, మందులు లేవు. మెదడును తింటున్న అమీబా వల్ల ప్రైమరీ అమోబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కేరళలో విస్తరిస్తోంది. సెప్టెంబర్ 18 నాటికి, ఆ రాష్ట్రంలో 69 మందికి ఈ వ్యాధి సోకగా.. ఇప్పటికే 19 మంది మరణించారు. తాజాగా మూడు మరణాలు నమోదయ్యాయి. మూడు నెలల శిశువు నుంచి 52 ఏళ్ల వ్యక్తి దాకా ప్రాణాలను బలిగొంది. తాజాగా త్రిస్సూర్‌లోని చావక్కాడ్‌కు చెందిన రహీం. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కోజికోడ్ MCHలో అమీబిక్ మెనింగో బారినపడి ప్రస్తుతం మరో తొమ్మిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు నిర్ధారించారు.

ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ చాలా అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 500 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్క కేరళలోనే 120 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఈ సంవత్సరం 70 కేసులు నమోదయ్యాయి. కలుషితమైన మంచినీటిని పీల్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. దీనివల్ల అమీబా సైనస్‌ల ద్వారా మెదడుకు ప్రయాణించి కణజాలాన్ని నాశనం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.

ఈ అమీబా.. మెదడులోకి వెళ్లి.. బ్రెయిన్‌ని తినేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజున ప్రాణం పోతుంది. ఈ అమీబా.. చెరువులు, నీటి కాలువలు, స్విమ్మింగ్ పూల్స్‌లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ పెరిగినప్పుడు ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. కేరళలో మొదటి మరణం 2016లో అలప్పుజలో నమోదైంది. అంతకు ముందు 1971లో భారతదేశంలో మొదటి కేసు రికార్డు అయ్యింది. 2023 నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటికే 69 కేసులొచ్చాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల ఇలా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ అమీబా మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు. ఇది ఆహారం ద్వారా వ్యాపించదు. నీటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కలుషిత నీరు లేదా నిల్వ ఉన్న నీటిలో స్విమ్మింగ్, స్నానం చేసినప్పుడు.. ఈ అమీబా బాడీలో చేరుతుంది. తర్వాత అల్వియరీ నరాల ఆధారంగా మెదడును చేరుతుంది. అక్కడి జీవకణాలను నాశనం చేస్తుంది. ఇటీవలి కేసుల్లో ఇంట్లో స్నానాలు చేసే వారికి కూడా ఈ అమీబా సోకుతోంది. నీరు కలుషితంగా ఉండటం వల్ల ఇలా జరుగుతోంది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. కానీ ఇన్ సిలికో వ్యాక్సిన్ డిజైన్ పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్సకు మిల్టెఫోసిన్, అంఫోటెరిసిన్ బి వంటి మందులు ఉపయోగిస్తున్నారు. ఇవి పూర్తిగా నిరోధిస్తాయనే గ్యారెంటీ లేదు.

ఈ అమీబా బాడీలో చేరిన 2 నుంచి 15 రోజుల తర్వాత… మొదటి రోజుల్లో తలనొప్పి, జ్వరం, వాంతులు, బొబ్బలు, కళ్లు ఎర్రగా మారడం, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. తర్వాత మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, మూర్ఛలు, మాటలు తడబడటం వంటి తీవ్ర లక్షణాలు వస్తాయి. ఇవి కనిపించిన తర్వాత 5 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 97% శాతంగా ఉంది. కేరళలో 24% శాతంగా మరణాలున్నాయి. త్వరగా గుర్తించడం, చికిత్సలు చేయడం వల్ల మరణాలను ఆపుతున్నారు. సీఎస్‌ఎఫ్ పరీక్షలు, మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా వ్యక్తిలో ఈ అమీబా వ్యాప్తిని గుర్తించవచ్చు.

కేరళలో ఈ అమీబా 2016 నుంచి వ్యాప్తి చెందుతోంది, కానీ 2023-2025లో భయానకంగా పెరిగింది. కోజికోడ్, మలప్పురం, తిరువనంతపురం జిల్లాల్లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇటీవలి కేసుల్లో 17 ఏళ్ల బాలుడు, మూడు నెలల శిశువు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వాటర్ ఈజ్ లైఫ్’ ప్రచారం చేపట్టింది. హరితా కేరళం మిషన్ కింద పబ్లిక్ వాటర్ సోర్సెస్‌లో క్లోరినేషన్ చేస్తోంది. జల్ జీవన్ మిషన్, ఏఎమ్‌ఆర్‌యూటి ప్రాజెక్టుల ద్వారా క్లీన్ వాటర్ అందుబాటులోకి తెచ్చారు. ఇంకా స్కూళ్లు, కమ్యూనిటీల్లో అవేర్‌నెస్ డ్రైవ్‌లు జరుగుతున్నాయి.

అయితే ఈ వ్యాధి అరుదైనది అయినప్పటికీ, త్వరిత నిర్ధారణతో బ్రెయిన్ డ్యామేజ్‌ని తగ్గించవచ్చు. కేరళలో మెరుగైన సర్వైవల్ రేటు.. ప్రపంచవ్యాప్తంగా మోడల్ అవుతోంది. పబ్లిక్ హెల్త్ కన్సర్న్‌గా గుర్తించి, గ్లోబల్ సర్వైలెన్స్ అవసరమని నిపుణులు కోరుతున్నారు. వాతావరణ మార్పులు, పాల్యూషన్ వల్ల భవిష్యత్తులో మరిన్ని కేసులు రావచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం మరిన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు చేపడుతున్నారు.

మొత్తం ఐదు దశల్లో మనిషి మెదడులోకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ప్రవేశిస్తుంది.ఈ వ్యాది మొదటి దశ.. సిస్ట్..అంటే నిద్రాణ దశ. వెచ్చని కొలనులు, స్విమ్మింగ్ పూల్‌లాంటి వాటిల్లో వృద్ధి చెందుతుంది. ఈ దశలో తిత్తి రూపంలో అంటే ఓసంచిగా ఉంటుంది. సిస్ట్ దశలో అమీబా గట్టి రక్షణ గోడను ఏర్పరచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. రెండో దశ ట్రోఫోజోయిట్. ఇది అమీబా సంక్రమణ దశ అంటారు. అంటే ఆహారం తీసుకునే దశ. వెచ్చని తాజా నీటి వాతావరణంలో సరస్సులు, నదులు, కొలనుల్లో అమీబా స్వేచ్ఛగా అమీబా కుదులుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులను తిని జీవిస్తుంది. మానవులలో సంక్రమణకు కారణమయ్యే దశ ఇదే. ఈ దశలో అమీబా విభజన ద్వారా పునరుత్పత్తి చేస్తుంది. Brain Eating Amoeba.

ఇక మూడో దశ ఫ్లాజెల్లేట్…అంటే ఈత కొట్టే దశ. పర్యావరణంలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు లేదా నీటి పరిస్థితులు మారినప్పుడు అమీబా ఈ దశకు రూపాంతరం చెందుతుంది. ఈ దశలో అమీబాకు రెండు ఫ్లాజెల్లా.. చలనానికి సహాయపడే తోకలాంటి నిర్మాణాలు) ఏర్పడతాయి, దీనితో నీటిలో స్వేచ్చగా ఈత కొడుతుంటుంది. ఈ దశ తాత్కాలికమైనది, అనుకూల పరిస్థితులు తిరిగి లభిస్తే ట్రోఫోజోయిట్ దశకు తిరిగి మారుతుంది. నాలుగో స్టేజ్‌ మనిషి మెదడులోకి అమీబా ప్రవేశించే ప్రక్రియ. అంటే చెరువులు, ఈతకొలనులు, అమీబా ఉన్న ప్లేసులో మనిషి ఈతకొట్టడం, నీటిలో మునిగితే ముక్కులో నుంచి అమీబా మన మెదడులోకి వెళ్తుంది. ఇక ఐదో స్టేజ్‌ మనిషి మెదడులోకి ప్రవేశించి మన నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతాడు. ఇంతటి డేంజర్ ఫంగస్ మనలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. శుబ్రంగా లేని ఈతకొలనుల్లో అస్సలు దిగకూడదు. ఒక వేళ దిగినా తల మాత్రం ముంచకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సో.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటున్నారు వైద్యులు.