విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?

Plane Crash AAIB Report: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. జూన్‌ 12న లండన్‌ కు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే కూలిపోయి 260 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది..ఇంతకీ ఈ నివేదికలో ఏముంది..? ప్రమాదం ఎలా జరిగింది..? ఎయిర్ ఇండియా ఎలా స్పందించింది..? తప్పు ఎవరిది..?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ గాట్విక్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ171, టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బీజే మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా 260 మంది మరణించగా, ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గాలిలోకి ఎగిరిన మూడు సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని.., దీని వల్ల ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి, రెండు ఇంజన్లు ఆగిపోయాయని నివేదిక పేర్కొంది. విమానం 650 అడుగుల ఎత్తుకు చేరినప్పటికీ, ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఎత్తు కోల్పోయి కూలిపోయింది. ఎయిర్‌ ఇండియా విమానం బీజే మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనంపై కూలిపోవడంతో అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో భవనంలో ఉన్న 19 మంది మరణించారు, 67 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌ కళాశాల విద్యార్థులు, స్థానికులు ఈ ఘటనను గుండెల్ని కలచివేసే అనుభవంగా వర్ణించారు.

ఏఏఐబీ నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు కటాఫ్‌ స్థితికి మారాయి. ఈ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణలో గందరగోళం నెలకొన్నట్లు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో రికార్డైంది. ఒక పైలట్‌ స్విచ్‌లను తాను మార్చలేదని చెప్పగా, మరొకరు దానికి సమాధానం ఇవ్వలేదు. ఈ సంఘటన వల్ల ఇంజన్లు ఆగిపోయి, విమానం గాలిలో స్థిరత్వం కోల్పోయి కూలిపోయింది. ఈ సంఘటన విమానంలో సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే అంశంపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక సూచిస్తోంది. కాక్‌పిట్‌ రికార్డింగ్స్‌లో ఒక పైలట్‌ ఇది నేను చేయలేదు అని చెప్పినట్లు రికార్డైంది. అయితే స్వీచ్ ఫైలెట్ ఆపకపోతే ఎవరు చేశారు..? దీనిపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. Plane Crash AAIB Report.

ఏఏఐబీ 15 పేజీల ప్రాథమిక నివేదికలో విమానం కూలిపోవడానికి ఇంధన నియంత్రణ స్విచ్‌ల మార్పు, రెండు ఇంజన్ల ఆగిపోవడం ప్రధాన కారణాలుగా తేలింది. విమానం టేకాఫ్‌ సమయంలో రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ మార్పు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది, ఇది అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. అయితే, స్విచ్‌లు ఎందుకు కదిలాయి, ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే విషయంపై స్పష్టత రాలేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై స్పందిస్తూ, ఇది కేవలం తొలి నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఏఏఐబీ అంతర్జాతీయ ప్రోటోకాల్‌లను పాటిస్తూ, దర్యాప్తు చేస్తోంది. తుది నివేదిక వచ్చిన తర్వాతే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలం అని ఆయన అన్నారు. పైలట్లపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, భారత విమానయాన రంగంలో అత్యంత నైపుణ్యం గల సిబ్బంది ఉన్నారని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. విమానయాన శాఖ ఏఏఐబీకి అన్ని విధాల సహకారం అందిస్తోందని, ఈ ఘటనపై పూర్తి నివేదిక కోసం వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు.

అటు ఎయిర్‌ ఇండియా ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, బాధితులకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. అటు బోయింగ్‌ సంస్థ కూడా దర్యాప్తుకు సహకరిస్తూ, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి 40 ఏళ్ల బ్రిటిష్-ఇండియన్‌ వ్యక్తి విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌ అద్భుతంగా బయటపడ్డాడు. 11ఏ సీటులో ఉన్న రమేశ్‌, ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి. దర్యాప్తులో భాగంగా రమేశ్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అయితే ప్రమాదం జరిగి నెల రోజులు గడిచినా ఆ భయం నుంచి విశ్వాస్ కుమార్ ఇంకా బయటపడలేదు. రాత్రి పూట సడన్ గా నిద్ర లేవడం.. విచిత్రంగా ప్రవర్తించడంతో అతడిని సైకాలజిస్టులకు చూపిస్తున్నారు. అటు ఈ ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఏఏఐబీ పూర్తి నివేదిక రాబోయే త్వరలో విడుదల కానుంది, ఇది సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలపై మరింత స్పష్టత ఇవ్వనుంది. ఈ ప్రమాదం విమానాల విషయంలో మరింత కఠిన నిబంధనల అవసరాన్ని తెలియజేస్తోంది.

Also Read: http://mega9tv.com/national/superbugs-that-are-scaring-india-what-exactly-are-superbugs-how-do-superbugs-actually-arise/