ట్రంప్ టారిఫ్ లతో అమెరికాకే నష్టమా..?

Trump tariff News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీగా టారిఫ్‌లు విధించడం ద్వారా ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు, కానీ ఈ నిర్ణయం అమెరికాకే భారీ మూల్యం చెల్లించేలా చేస్తోంది. ట్రంప్ టారిఫ్‌లు అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, తయారీ సంస్థలపై భారీ ధరల భారాన్ని మోపనున్నాయి. ట్రంప్ భారత్‌ను శిక్షించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే బూమరాంగ్‌గా మారనుందా..? ట్రంప్ తన తలపై తానే చెయ్యి పెట్టుకున్నాడా..?దీనిపై విశ్లేషకులు ఏం అంటున్నారు..?

భారత్ పై టారిఫ్ లు విధించి .. ఇరుకున పెట్టానని ట్రంప్ భావిస్తున్నా ఇది.. అమెరికా ప్రజలకే పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు. 50% టారిఫ్‌ల వల్ల అమెరికా వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా రోజువారీ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆటో పార్ట్స్, ఐటీ హార్డ్‌వేర్, టెక్స్‌టైల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్ వంటివి అమెరికా తయారీ, రిటైల్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అమెరికాలో టారిఫ్ లతో వస్తువుల దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల వ్యాపార సంస్థలు ఆ ఖర్చును వినియోగదారులపై మోపుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ అదనపు భారం ఫెడరల్ రిజర్వ్‌కు తలనొప్పిగా మారుతుందని అంటున్నారు.

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అమెరికాలో భారం కానున్నాయా..?
అమెరికాకు ఆరోగ్య సంరక్షణ ఖర్చుల పెరుగుదల అతిపెద్ద భారం కానుంది. భారత్ ప్రపంచవ్యాప్తంగా 40 శాతం జనరిక్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది, ఇవి అమెరికా మార్కెట్‌లో కీలకం. ప్రస్తుతం ఫార్మా రంగానికి ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ మినహాయింపు ఎత్తివేయవచ్చనే భయం ఉంది. ఒకవేళ మినహాయింపు ఎత్తివేస్తే, వినియోగదారుల ఔషధ ధరలు, ఇన్సూరెన్స్ చెల్లింపులు, మెడికేర్ ఖర్చులు, ఆసుపత్రుల సేకరణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

పెరిగిన టారిఫ్‌లు అమెరికా వ్యాపారాల సఫ్లై చైన్ కు బ్రేకులు వేయనుంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియంట్స్ , స్పెషాలిటీ కెమికల్స్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వంటివి అమెరికా కంపెనీలకు కీలకం. 50% టారిఫ్‌ల వల్ల ఈ సరఫరా గొలుసుల్లో అనిశ్చితి, ఆలస్యం, ఖర్చు పెరుగుదల, లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఈ టారిఫ్‌లు అమెరికా GDPపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికా GDP 40-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చు. ఇన్‌పుట్ ఖర్చుల ద్రవ్యోల్బణం, పాస్-త్రూ ఎఫెక్ట్స్, బలహీనమైన డాలర్ వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరుగుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. జులై లో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ 1% పెరిగింది, సర్వీసెస్, ప్రాసెస్డ్ గూడ్స్, టారిఫ్‌లు ఎక్కువగా ఉన్న దిగుమతి వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. కంపెనీలు ఈ ఖర్చులను వినియోగదారులపై మోపడం మొదలుపెట్టారు. దీనివల్ల రోజువారీ వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి.

ఉద్యోగాలు, తయారీ రంగాలపై ప్రభావం ఏంటి..?
ఈ టారిఫ్‌లు అమెరికా ఉద్యోగాలు, తయారీ రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ద్రవ్యోల్బణ ట్రాజెక్టరీ పెరుగుతుందని అంటున్నారు. అమెరికాలో 2% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం దాటకూడదు.. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ సాధారణ వృద్ధి రేటును సాధించలేదు. ట్రంప్ మొదటి పర్యాయ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కేవలం 1.4% వృద్ధి సాధించింది, ఇప్పుడు అదే మందగమనం ఎదుర్కొనే అవకాశం ఉంది. టారిఫ్‌ల వల్ల తయారీ రంగంలో ఖర్చులు పెరగడం, ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి, ఇది ఉద్యోగ నష్టాలకు దారితీయవచ్చు. Trump tariff News.

ఈ టారిఫ్‌లు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి దీర్ఘకాలిక నష్టం కలిగించనున్నాయి. ఇటీవలి దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య 212 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సంబంధం బలపడింది. భారత్ ఇటీవలి వరకు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. కానీ ఈ టారిఫ్‌లు ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు, భారత్ తయారీ హబ్ ఆకాంక్షలకు గణనీయమైన దెబ్బ కొడతాయి. చైనాతో పోలిస్తే భారత్ ఎగుమతులలో ఉన్న పోటీతత్వం తగ్గుతుంది, ఇది వాషింగ్టన్-న్యూఢిల్లీ సంబంధాలకు తీవ్రమైన ఆటంకం కలిగిస్తుంది. ఈ టారిఫ్‌లు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q