
Rajasthan deserts Dinosaur bones: రాజస్థాన్‌లో ఒక జురాసిక్ అద్భుతం బయటపడింది. జైసల్మేర్‌లోని ఓ గ్రామంలో 20 కోట్ల సంవత్సరాల నాటి డైనోసారి ఎముకలు కనుగొన్నారు. ఇలాంటివి కనుగొనడం భారత్‌లో తొలిసారి. చెరువు తవ్వుతుండగా ఈ అవశేషాలు కనిపించాయి. అయితే ఈ ప్రాంతంలో ఇంకా ఏం లభించాయి..? వీటిని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏం చేయనున్నారు..? ఈ అవశేషాలను ఎలా రక్షిస్తారు? డైనోసార్లు ఎందుకు అంతరించాయి?
రాజస్థాన్ లోని జైసల్మేర్‌లోని మేఘ అనే గ్రామంలో చెరువు తవ్వుతుండగా ఒక అద్భుతం బయటపడింది. 20 కోట్ల సంవత్సరాల నాటి ఫైటోసర్ ఎముకలు.. అంటే డైనోసార్ల సమయంలో మొసలిని పోలిన ఒక జురాసిక్ రెప్టైల్. ఇది నదీతీరాలు, అడవుల్లో జీవించేది. భారత్‌లో ఇలాంటి ఫాసిల్ దొరకడం ఇదే మొదటిసారి. 1.5 నుంచి 2 మీటర్ల అస్థిపంజరంతో పాటు ఒక గుడ్డు కూడా లభించింది. ఈ ఫాసిల్స్ రాజస్థాన్‌లో జురాసిక్ కాలంలోని పర్యావరణం గురించి కీలక సమాచారం ఇస్తాయని సీనియర్ జియాలజిస్ట్ నారాయణ్ దాస్ ఇనిఖియా తెలిపారు. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ అవశేషాలు డైనోసార్ యుగానికి చెందినవని ధృవీకరణ జరుగుతోంది.
భారత్‌లో డైనోసార్ ఆధారాలు ఎక్కడ లభించాయి.
భారత్‌లో డైనోసార్ ఆధారాలు మూడు ప్రధాన ప్రాంతాల్లో లభించాయి. మొదట, గుజరాత్‌లోని బాలాసినోర్.. ఇక్కడ డైనోసార్ అడుగుజాడలు, గుడ్డు ఒరలు, ఎముకలు కనుగొనబడ్డాయి. రెండోది మధ్యప్రదేశ్‌లోని నర్మదా లోయ. లమేటా ఫార్మేషన్లో టైటానోసార్ గుడ్లు పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయి. భాగ్ ప్రాంతంలో 256 ఫాసిలైజ్డ్ గుడ్లు లభించాయి. వీటిని స్థానిక గిరిజనులు దేవతలుగా పూజిస్తారు. మూడోది, రాజస్థాన్‌లోని బార్మెర్, జైసల్మేర్ ప్రాంతం. లాఠీ ఫార్మేషన్లో డైనోసార్ యుగానికి చెందిన అనేక ఫాసిల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ జైసల్మేర్ డిస్కవరీ భారత్‌లో అత్యంత ముఖ్యమైనది.

ప్రపంచవ్యాప్తంగా డైనోసార్ ఫాసిల్స్ అత్యధికంగా అమెరికాలో లభిస్తున్నాయి. ఉటాహ, మొంటనా, కొలరాడో ప్రపంచ ప్రసిద్ధ పాలియాంటాలజికల్ సైట్లు. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఈకలు గల డైనోసార్ ఫాసిల్స్, అర్జెంటీనాలో భారీ సౌరోపాడ్ల అవశేషాలు, మొరాకోలో స్పినోసారస్ ఫాసిల్స్ దొరికాయి. కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్స్‌లో టైరనోసారస్ రెక్స్ పూర్తి అస్థిపంజరాలు, ఆస్ట్రేలియాలో యూనిక్ డైనోసార్ జాతుల ఆధారాలు లభించాయి. అన్ని ఖండాల్లోనూ డైనోసార్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. Rajasthan deserts Dinosaur bones.
డైనోసార్ ఫాసిల్స్ ఎలా భద్ర పరుస్తారు..?
డైనోసార్ ఎముకలను రక్షించడం అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. మొదట తవ్వకం జరిగే చోట GPS కోఆర్డినేట్స్ నమోదు చేస్తారు, చుట్టూ ఉన్న రాతి పొరలను డాక్యుమెంట్ చేస్తారు. ఎముకలను ప్లాస్టర్ జాకెట్స్లో చుట్టి సురక్షితంగా రవాణా చేస్తారు. లాబొరేటరీలో ఆసిడ్ ప్రిపరేషన్, మెకానికల్ క్లీనింగ్ ద్వారా ఎముకల నిజమైన ఆకృతిని బయటపెడతారు. CT స్కానింగ్, 3D మోడలింగ్‌తో లోపలి నిర్మాణాలను అధ్యయనం చేస్తారు. ఉష్ణోగ్రత, తేమ నియంత్రిత మ్యూజియం వాతావరణంలో దీర్ఘకాలం భద్రపరుస్తారు. సిలిసిఫికేషన్, పైరిటైజేషన్ వంటి సహజ ప్రక్రియలు ఫాసిల్స్ రాళ్లలా మారడానికి సహాయపడతాయి.
డైనోసార్ల అంతరించిపోవడానికి కారణం ఏంటి..?
6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఓ భారీ గ్రహసకలం ఢీకొనడం వల్ల భారీ వాతావరణ మార్పులు వచ్చాయి. ధూళి, శిథిలాలు వాతావరణంలోకి వెళ్లి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. దీనివల్ల ఫోటోసింథసిస్ ఆగిపోయి, ఆహార గొలుసు కుప్పకూలింది. భారత్‌లోని డెక్కన్ ట్రాప్స్‌లో అగ్నిపర్వత కార్యకలాపాలు విషపూరిత వాయువులను విడుదల చేశాయి. సముద్ర ఆమ్లీకరణ, ప్రపంచ ఉష్ణోగ్రత మార్పుల వల్ల పెద్ద డైనోసార్లు బతకలేకపోయాయి. చిన్న క్షీరదాలు, పక్షులు మాత్రం బతికి, పరిణామం కొనసాగించాయి.
భారత్‌లో డైనోసార్ పరిశోధన అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. మధ్యప్రదేశ్‌లోని భాగ్ డైనోసార్ ఫాసిల్ నేషనల్ పార్క్ UNESCO గ్లోబల్ జియోపార్క్ ట్యాగ్ కోసం పోటీపడుతోంది. ఫిజిక్స్ టీచర్ విశాల్ వర్మా ఒంటరిగా 100కు పైగా ఫాసిలైజ్డ్ డైనోసార్ గుడ్లను రక్షిస్తున్నాడు. బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ వివరణాత్మక పరిశోధనలు చేస్తోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలిసి సిస్టమాటిక్ తవ్వకాలు చేపడుతున్నాయి. ఈ పరిశోధనలు భారత్‌ను డైనోసార్ అధ్యయనంలో ముందు వరుసలో నిలుపుతున్నాయి.
ఈ జైసల్మేర్ డిస్కవరీ భారత్‌లోని పాలియాంటాలజీని మార్చేస్తోంది. పశ్చిమ భారత్‌లో జురాసిక్ కాలంలో పూర్తి ఇకోసిస్టమ్ ఉండేదని ఈ ఫాసిల్స్ నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఎడారిగా కనిపించే రాజస్థాన్ ఒకప్పుడు సమృద్ధమైన అడవులు, నదులతో నిండి ఉండేదని ఆధారాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పరిశోధన సహకారాలు పెరుగుతున్నాయి, ఫాసిల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతోంది. కార్బన్ డేటింగ్ ఫలితాలు వచ్చాక ఈ డిస్కవరీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q