
India-US trade deal: ఇండియాతో వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందే ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు, వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు దిల్లీకి వచ్చారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. ఈ ఒప్పందాలూ ప్రతీకార సుంకాల మూలంగా మన రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రం ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది.. అసలు..తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
ఇండియా-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ రంగం ప్రధానంగా చర్చల్లో నిలుస్తోంది. వ్యవసాయ దిగుమతులపై భారత్ పన్నులు తగ్గించాలని అగ్రరాజ్యం కోరుతోంది. అందుకు ఇండియా ఒప్పుకోవడం లేదు. వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి రాకపోవడం, రష్యా నుంచి ఇండియా చమురు కొంటోందన్న అక్కసుతో ట్రంప్ ఇప్పటికే మన సరకులపై రెండు దఫాల్లో 50శాతం సుంకాలు విధించారు. గతంలో అమెరికాకు ఇండియా 570 కోట్ల డాలర్ల విలువైన సాగు ఉత్పత్తులు ఎగుమతి చేసింది. అక్కడి నుంచి 190 కోట్ల డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అమెరికా నుంచి దిగుమతులతో పోలిస్తే మన ఎగుమతులే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇండియా ఎగుమతి చేసే చేపలు, మాంసం, రొయ్యలు, ఇతర శుద్ధిచేసిన సముద్ర ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సుంకాలు పెంచడం వల్ల అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరిగి అవి పోటీలో వెనకబడతాయి.
ఇక భారతీయ విపణిలోకి ప్రవేశం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నించడం వెనక మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అగ్రరాజ్య అధిక రాయితీలతో డిమాండ్‌కు మించి ఎక్కువగా పంట ఉత్పత్తి చేస్తున్న అక్కడి రైతులు ఆదాయం కోసం ఎగుమతులపై ఆధారపడుతున్నారు. అమెరికా రైతులు 20-25శాతం ఆదాయాన్ని ఎగుమతుల ద్వారానే ఆర్జిస్తారు. ఒకవేళ ఎగుమతులు పడిపోతే ధరలు పతనమవుతాయి. ఉదాహరణకు అమెరికా సోయాబీన్ దిగుమతులను చైనా తగ్గించిన తరవాత, అగ్రరాజ్యంలో ధర 25శాతం దాకా పడిపోయింది. ప్రస్తుతం చైనా సోయాబీన్, మాంసం అవసరాలను బ్రెజిల్ తీరుస్తోంది. గోధుమ వాణిజ్యంలో అగ్రరాజ్యానికి రష్యా గట్టి పోటీ ఇస్తోంది. ఆసియాకి పాడి ఉత్పత్తులను ఐరోపా సంఘం (ఈయూ) దేశాలు, ఆస్ట్రేలియా పెద్దమొత్తంలో ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచ గోధుమ వాణిజ్యంలో అమెరికా వాటా 1980లో 30శాతం ఉంటే, 2024-25 నాటికి 12శాతం తగ్గిపోయింది.
సోయాబీన్ విషయంలో అగ్రరాజ్య ఎగుమతులు 50శాతం దాకా తగ్గాయి. దాంతో ధరల విషయంలో అమెరికా నిర్ణయాత్మక శక్తి సన్నగిల్లింది. ఈ క్రమంలో గతంలో బైడెన్, నేడు ట్రంప్‌నకు రైతుల నుంచి నిరసనలు తప్పలేదు. ఎగుమతులను పునరుద్ధరించాలని వారిపై ఫోర్స్ పెరిగింది. ఎగుమతులు క్షీణించడం వల్ల అమెరికాకి ఏటా 1,100 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. దీంతో ట్రంప్ టారిఫ్ యుద్ధం వల్ల సోయాబీన్ రైతులే 300 కోట్ల డాలర్ల మేర కోల్పోవాల్సి వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు సన్నగిల్లడం వల్ల అమెరికా గ్రామీణ ఆర్థికం దెబ్బతింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం గతంలో అగ్రరాజ్యంపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు దాని ప్రత్యర్థుల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అమెరికాలోని వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో జాబ్స్ పోయాయి. వీటి మూలంగా రాజకీయంగా నష్టం తప్పదన్న భావనతోనే భారతీయ విపణిలో పాగా వేయాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు.
మన దేశంలో 70 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారం. ఇప్పటికే సాగు గిట్టుబాటు కాక రైతులు విలవిల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు, మాంసం, ధాన్యం, పప్పులు వంటి వాటి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తే తక్కువ ధరకే అవి మన విపణిని ముంచెత్తుతాయి. దానివల్ల గ్రామీణుల ఆదాయాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. నివేదికల ప్రకారం అమెరికాలో సగటు రైతుకు రూ.26 లక్షల విలువైన ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ఇక మనదేశంలో చాలామంది చిన్న సన్నకారు రైతులే. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర పథకాలపై వారు ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ సరకులకు గేట్లు బార్లా తెరవడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం చేస్తుంది.
అమెరికాతో వాణిజ్య చర్చల్లో మన ఆహార భద్రత, రైతుల ఆదాయాలకు భరోసా కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలి. మొక్కజొన్న, సోయాబీన్, పత్తికి ఇండియాలో గిరాకీ పెరుగుతోంది. వాటి సాగును పెంచేలా మన రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. వాటి ఉత్పాదకత ఇనుమడించేలా పరిశోధనలకు ఊతమివ్వాలి. ట్రంప్ సుంకాల దాడి నేపథ్యంలో వీలైనంత ఎక్కువ దేశాలకు ఎగుమతులు జరపాల్సి ఉంటుంది. ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియాలలో కొత్త మార్కెట్లను అన్వేషించాల్సిందే.
ముఖ్యంగా ముడి పంటలు కాకుండా శుద్ధిచేసిన ఆహార ఎగుమతులపై ఎక్కువగా దృష్టి సారిస్తే మార్కెట్ అవకాశాలు విస్తృతమవుతాయి. ఎగుమతులు పెరిగితే మన రైతుల ఆదాయాలు అధికమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వాలు మౌలిక వసతులు, నీటి పారుదల వ్యవస్థ వంటి వాటికి తగినంత నిధులు ఖర్చు చేయాలి. సాగులో సాంకేతికత వృద్ధికి అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించాలి. యాంత్రీకరణను పెంచడంతో పాటు కోతల తరవాత పంట నష్టాన్ని నివారించాలి. రవాణా, నిల్వ వసతులను మెరుగుపరచుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు మన ఎగుమతులు నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సహకార, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా మేలిమి సాగు పద్ధతులపై అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. India-US trade deal.
సమావేశం అనంతరం విదేశ వ్యవహారాలశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఇరుదేశాలకు మేలు చేసేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదర్చుకునేందుకు చర్యలు చేపట్టాలని భారత్, అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు. ఈవారంలో ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని స్పష్టం చేశారు.. అమెరికా ముఖ్య ప్రతినిధి బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని బృందం ఇక్కడకు వచ్చి జరిపిన చర్చలు సానుకూలంగా ఉన్నందున, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలోనే అమెరికా వెళ్లి చర్చలను మరింత వేగవంతం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సో తదుపరి చర్చలు ఎప్పుడు జరుగుతాయి..ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.