
Government bans fake OTT apps: సినిమాలకు సెన్సార్ ఉంది.. కానీ ఓటీటీలకు ఏ సెన్సార్ లేదు. దీంతో అవి విచ్చలవిడిగా వ్యవహరిస్తూ రెచ్చిపోతున్నాయి. కేవలం ఆదాయమే ధ్యేయంగా సమాజంపై ఎలాంటి దుష్ఫ్రభావం పడుతుందనే ఆలోచన లేకుండా బూతు కంటెంట్ ను పెడుతూ కోట్లు సంపాదిస్తున్నాయి. అయితే అలాంటి బూతు ఓటీటీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. దేశవ్యాప్తంగా 25 OTT యాప్‌లు, వాటి సంబంధిత వెబ్సైట్లను నిషేధించింది. ఈ చర్య వెనుక అసలు కారణాలు ఏమిటి? ఏ యాప్‌లను నిషేధించారు? అడల్ట్ కంటెంట్ వల్ల సమాజంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయి? బాలీవుడ్‌తో ఈ యాప్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? సెన్సార్షిప్ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ఈ నిషేధం వల్ల అడల్ట్ కంటెంట్‌ను పూర్తిగా నియంత్రించగలమా?
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని 25 OTT యాప్‌లు, వాటి వెబ్సైట్లు భారతదేశంలో నిషేధించబడ్డాయి. ఈ జాబితాలో ALTT, ఉల్లు, బిగ్ షాట్స్, దేశీ ఫ్లీక్స్, నవరసా లైట్ వంటివి ఉన్నాయి. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్లాక్ చేశారు. ఒక వేళ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పుడు కూడా వీటిని అందుబాటులో ఉంచితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. Government bans fake OTT apps.
అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ ను ప్రమోట్ చేయడమే ఈ OTT యాప్‌లపై నిషేధం విధించడానికి ప్రధాన కారణం. గత రెండేళ్లలో, వినియోగదారులు, మహిళా హక్కుల సంస్థలు, బాలల రక్షణ సంస్థల నుండి వీటిపై వేలాది ఫిర్యాదులు అందాయి. ఈ యాప్‌లు అడాల్ట్ వీడియోలు, కుటుంబ సంబంధాలను అవమానించే సన్నివేశాలు, మైనర్లను తప్పుంగా చూపించే అనుచిత కంటెంట్‌ను ప్రసారం చేశాయి. భారత్ లోని చట్టాలను ఉల్లంఘించి ఈ కంటెంట్ ను ఓటీటీల్లో అందుబాటులో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ యాప్‌లు అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించినట్లు నటించి, కొత్త డొమైన్లు లేదా పేర్లతో మళ్లీ అప్లోడ్ చేశాయి. ఈ చర్యలు చట్టవిరుద్ధమే కాక, సామాజిక విలువలకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
అడల్ట్ కంటెంట్ ప్రసారం చేసే ఈ OTT యాప్‌ల వల్ల సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడుతున్నాయి. ముఖ్యంగా యువత, యుక్తవయసు వారి మానసిక ఆరోగ్యంపై ఈ అడాల్ట్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం, ఇటువంటి కంటెంట్ అడిక్షన్‌కు దారితీసి, అవాస్తవ లైంగిక అంచనాలను సృష్టిస్తుంది. మహిళలను అవమానకరంగా చూపించే కంటెంట్ లింగ వివక్షతను పెంచుతుంది. స్త్రీలపై గౌరవం తగ్గిస్తుంది. కుటుంబ సంబంధాలను అగౌరవపరిచే సన్నివేశాలు సామాజిక విలువలను దెబ్బతీస్తున్నాయి. అంటే ఈ వీడియోలు చూసి కుటుంబ విలువలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్ని వీడియోలలో మైనర్లను తప్పుగా చూపించడం బాలల హక్కుల ఉల్లంఘనలకు వస్తుంది. ఇలా చూపించడం వల్ల వారిపై లైంగిక దాడులు జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, అడల్ట్ కంటెంట్‌కు సులభ యాక్సెస్ లైంగిక నేరాలను ప్రోత్సహించే అవకాశం ఉంది. ఈ కంటెంట్‌ను ఎటువంటి నియంత్రణ లేకుండా అందుబాటులో ఉంచడం సమాజంలో అస్థిరతను సృష్టిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నిషేధిత OTT యాప్‌ల వెనుక పలు ప్రముఖ వ్యక్తులు, సంస్థలు ఉన్నాయని అంటున్నారు. బాలీవుడ్ నిర్మాత ఎక్తా కపూర్, శోభా కపూర్ కు చెందిన బాలాజీ టెలీఫిలిమ్స్ ALTT అనే యాప్‌ను మెయింటెన్ చేస్తోంది. టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా బలమైన నెట్వర్క్ కలిగిన ఈ సంస్థ, OTT రంగంలోకి శృంగార కంటెంట్‌తో ప్రవేశించింది. ఇక విభూ అగర్వాల్ స్థాపించిన ఉల్లు యాప్, మహిళలు కుటుంబ సంబంధాలపై శృంగార కథనాలతో పాపులర్ అయింది. అలాగే చిన్న OTT ప్లాట్‌ఫారమ్‌ల వెనుక డిజిటల్ కంటెంట్ వ్యాపారవేత్తలు, టీవీ నిర్మాతలు కొంతమంది స్థానిక ఇంటర్నెట్ ఎంట్రప్రెనర్లు ఉన్నారు. అంతేకాకుండా OTT రంగం బాలీవుడ్‌తో గట్టి సంబంధం కలిగి ఉంది. జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, రాధికా ఆప్టే వంటి నటులు OTT వెబ్ సిరీస్‌ల ద్వారా స్టార్డమ్ సాధించారు. అలాగే, బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ యాప్‌లతో ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం నెట్‌వర్క్‌లు ఏర్పరచుకున్నారు. కొన్ని యాప్‌లు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. అలాగే విమర్శలకు కారణమవుతున్నాయి.
OTTల నియంత్రణ ఎందుకు కష్టంగా మారింది..?
OTT ప్లాట్‌ఫారమ్‌లకు సినిమాలు, టీవీ షోల్లా సెన్సార్ బోర్డులాంటి వ్యవస్థ లేదు. ఐటీ రూల్స్ 2021 ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లు స్వీయ నియంత్రణ పాటించి, DPCGC రూల్స్ పాటించాలి. అయితే, ఈ బూతు OTT యాప్‌లు ఈ నియమాలను పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా, సమాజ విలువలను గాలికి వదిలేస్తున్నాయి. ఎటువంటి కథ లేదా థీమ్ లేకుండా, కేవలం శృంగార దృశ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నాయి. సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్, మైనర్లను చూపించే సన్నివేశాలు కూడా అప్లోడ్ చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను అసలు ఏ మాత్రం పాటించడం లేదు. ఒక వేళ హెచ్చరిస్తే తర్వాత కంటెంట్‌ను తాత్కాలికంగా తొలగించి, కొత్త డొమైన్లలో మళ్లీ అప్లోడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్వీయ నియంత్రణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయం లేదు. ఈ లోపాల వల్ల అడల్ట్ కంటెంట్ నియంత్రణ కష్టతరమవుతోంది.
ఈ నిషేధం వల్ల అడల్ట్ కంటెంట్ పై నియంత్రణ సాధ్యమేనా?
ప్రస్తుత 25 OTT యాప్‌లను బ్లాక్ చేయడం ద్వారా అడల్ట్ కంటెంట్‌ను కొంతవరకు నియంత్రించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ISPలు ఈ యాప్‌లను పూర్తిగా బ్లాక్ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల అడల్ట్ కంటెంట్ ఆన్ లైన్ లో తగ్గే అవకాశం ఉంది. అయితే, గత అనుభవాల ఆధారంగా, కొన్ని సంస్థలు కొత్త డొమైన్లు, యాప్ పేర్లతో మళ్లీ కంటెంట్‌ను అప్లోడ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్ద OTT ప్లాట్‌ఫారమ్‌లు లాంటి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ లాంటివి సెల్ఫ్ రెగ్యులేషన్ కౌన్సిల్ లో ఉండి, నియమాలను పాటిస్తాయి. కానీ చిన్న యాప్‌లు ఈ వ్యవస్థలో భాగం కాకపోవడం వల్ల నియంత్రణ కష్టంగా మారింది. నిపుణులు డిజిటల్ కంటెంట్ కోసం కేంద్రీకృత సెన్సార్ బోర్డు, దీర్ఘకాలిక నియంత్రణ విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే, ప్రజల్లో అవగాహన పెంచడం, టెక్ కంపెనీలతో సహకరించడం ద్వారా ఈ సమస్యను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని వారు అంటున్నారు.