ట్రంప్ టారిఫ్ బాదుడు..!

Trump Announces 25% tariffs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన టారిఫ్ వార్నింగులతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఆగస్టు 1తో ట్రంప్ నిర్ణయించిన రెసిప్రోకల్ టారిఫ్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత్ పై టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే.. భారత్ పై భారీగా టారిఫ్ లు విధించేశారు. అసలు భారత్‌పై ఎంత శాతం టారిఫ్ లు విధించారు? ఈ టారిఫ్ ల వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది..?

తన టారిఫ్ లతో ట్రంప్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. యుద్ధాలు కూడా తన టారిఫ్ లతో ఆపేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్ ల విధించేందుకు విధించిన గడువు ఆగస్టు 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే 25 శాతం టారిఫ్‌ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నట్టుగానే టారిఫ్ ల బాదుడు మొదలెట్టేశారు. భారత్ వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు.. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటని… ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయని చెప్పారు. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తోందని… ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోందని.. కానీ.. భారత్‌, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయని విమర్శించారు. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నామన్నారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటించారు.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. జూలై నెలలో ఐదవ రౌండ్ చర్చలు వాషింగ్టన్‌లో జరిగాయి, భారత్ చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం 20 శాతం కంటే తక్కువ టారిఫ్ రేటు కోసం ప్రయత్నించింది. వ్యవసాయం, డైరీ రంగాల్లో అమెరికా మార్కెట్ యాక్సెస్ కోరుతుండగా, భారత్ జన్యుపరంగా సవరించిన పంటలు, డైరీ దిగుమతులను వ్యతిరేకిస్తోంది. Trump Announces 25% tariffs on India.

ట్రంప్ 25% టారిఫ్‌లు విధించడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో భారత్-అమెరికా వాణిజ్యం సుమారు 130 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇందులో భారత్ 45.7 బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌ప్లస్‌ను కలిగి ఉంది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, స్టీల్ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ టారిఫ్‌ల వల్ల భారత ఎగుమతులకు 7 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. ఇది భారత్‌లో టెక్స్‌టైల్స్, జెమ్స్ వంటి లేబర్-ఇంటెన్సివ్ రంగాల్లో ఉపాధిని కూడా ప్రభావితం చేయవచ్చు. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ధరలు పెరిగి, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీలో భారత్ వెనుకబడే ప్రమాదం ఉంది.

ఆగస్టు 1 గడువుతో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌లను ప్రకటించిన తర్వాత, అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. భారత్ మరో రౌండ్ చర్చల కోసం భారత బృందం వాషింగ్టన్‌కు వెళ్లనుంది. ఇప్పుడు ట్రంప్ 25 శాతం సుంకాలు ప్రకటించినా.. చర్చలు ఫలిస్తే వాటిని తగ్గించే అవకాశం ఉంది.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా టారిఫ్‌లను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఏప్రిల్ 2025లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విదేశీ వాణిజ్యాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించి, రెసిప్రోకల్ టారిఫ్‌లను ప్రవేశపెట్టారు. విదేశాల అన్యాయమైన వాణిజ్య విధానాలు, అమెరికాలో మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ టారిఫ్‌ల ద్వారా అమెరికాలో విదేశాల యాక్సెస్‌ను పరిమితం చేసి.., దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి, ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ టారిఫ్‌లు అమెరికా వినియోగదారులకు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయని, గ్లోబల్ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తున్నాయని IMF వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

భారత్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన వాణిజ్య వ్యూహాలను అనుసరిస్తోంది. అమెరికా నుంచి సమస్యలు ఎదురైనా.. దానిని వేరే విధంగా భర్తీ చేసి పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. దీనిలో భాగంగా భారత్ తన ఎగుమతులను యూరోప్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు విస్తరించడం ద్వారా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అలాగే చైనా నుంచి వెళ్లిపోతున్న మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

Also Read: https://www.mega9tv.com/international/a-major-earthquake-in-russia-8-8-magnitude-recorded-as-japanese-vanga-baba-predicted-and-tsunami-warnings-issued-to-many-countries/