భారత్ కు జపాన్ భారీ గిఫ్ట్…!

Japan’s Surprise Gift For India: వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తాజాగా జరిగిన భారత్-జపాన్ విదేశాంగ శాఖ ప్రతినిధుల సమావేశంలో ఓ కీలక విషయం తెలిసింది. రెండు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా జపాన్ భారత్ కు ఓ భారీ గిఫ్ట్ ఇవ్వనుంది. అది ఏంటి..? భారత్ కు జపాన్ ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉపయోగపడనుంది..? మోదీ విదేశీ విధానాల వల్లే ఇది సాధ్యమైందా..?

భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మకంగా ఎంతో బలమైన స్నేహం ఉంది. మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ బంధం మరింత బలపడింది. అటు మరిన్ని కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు నెలలో జపాన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రెండు దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జపాన్ వైస్-మినిస్టర్ ఫునకోషి తకేహిరో సమావేశమై పలు అంశాలపై చర్చించుకున్నారు. ఆగస్టులో జపాన్‌లో జరగనున్న వార్షిక ద్వైపాక్షిక సమావేశానికి మోదీ హాజరవుతారు. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో భేటీ కానున్నారు. అలాగే శింకన్‌సెన్ బుల్లెట్ ట్రైన్ ప్లాంట్ మోదీని సందర్శిస్తారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం క్వాడ్ సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు. Japan’s Surprise Gift For India.

అయితే భారత్ తో ఉన్న మైత్రికి గుర్తుగా జపాన్ మనకు ఓ భారీ గిఫ్ట్ ఆఫర్ చేసింది. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం జపాన్ భారత్‌కు రెండు E-10 శింకన్‌సెన్ ట్రైన్‌లను బహుమతిగా ఇవ్వనుంది. E-10 అనేది జపాన్ లోని బుల్లెట్ ట్రైన్లలో కొత్త వర్షన్. ఇవి త్వరలో జపాన్ లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ట్రైన్‌లు తాము జపాన్‌లో అందుబాటులోకి వచ్చే సమయంలోనే భారత్‌లో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇది రెండు దేశాల మధ్య ఒక అరుదైన సాంకేతిక భాగస్వామ్యంగా భావిస్తున్నారు. అలాగే, E-5, E-3 సిరీస్ ట్రైన్‌లను కూడా ట్రయల్స్ కోసం ఉచితంగా అందించే ప్రతిపాదన జపాన్ చేసింది.

508 కిలోమీటర్ల అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ రైలు కారిడార్ భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. దీనిని జపాన్ లోని శింకన్‌సెన్ రైలు టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ 0.1% వడ్డీతో రూ.88 వేల కోట్ల సాఫ్ట్ లోన్ అందిస్తోంది. 2016లో ప్రధాని మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా జపాన్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలాగే శింకన్‌సెన్ ట్రైన్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నారు. అహ్మదాబాద్-ముంబై మార్గం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం 7 గంటలు పడుతోన్న ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గతుంది. అయితే 2022లోనే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్ట్ అనేక కారణాలతో ఆలస్యమవుతోంది.

2017లో ప్రారంభమైన అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొదట 2022లో పూర్తవుతుందని భావించారు. కానీ ఇప్పుడు గుజరాత్ విభాగం 2027కి, మొత్తం కారిడార్ 2029 నాటికి పూర్తవుతుందని అంచనా. ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్రలో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత, పరిహారం విషయంలో సమస్యల కారణంగా భూసేకరణను ఆలస్యమైంది. దీనికి తోడు ముంబై సమీపంలోని మాంగ్రోవ్ అడవుల ప్రాంతంలో నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికివేయాల్సి రావడం, దీనిపై వచ్చిన చట్టపరమైన సవాళ్లు ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణమయ్యాయి. అయితే ప్రాజెక్టు పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో భూసేకరణ పూర్తయింది, 508 కిలోమీటర్లలో 298 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది. 21 కిలోమీటర్ల సొరంగం నిర్మాణం వేగవంతమైంది, ఇందులో 7 కిలోమీటర్లు సముద్రం కింద ఉంటుంది.

ఢిల్లీలో జరిగిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జపాన్ వైస్-మినిస్టర్ ఫునకోషి తకేహిరో సమావేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర కీలక అంశాలపైనా చర్చించారు. కీలక ఖనిజాల ఎగుమతి విషయంలో చైనా ఆంక్షల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో జపాన్ కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో భారత్, వియత్నాం వంటి దేశాల్లో లభించే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అభివృద్ధిపై సహకారం అందించుకోనున్నాయి. అలాగే భారత్‌లో జపాన్ పెట్టుబడులను పెంచడం, టెక్స్‌టైల్, టెలికాం, ఫిన్‌టెక్, డిజిటల్ లెర్నింగ్, సెమీకండక్టర్ సప్లై చైన్‌లపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై చర్చించారు. వారసత్వ పర్యాటకం, మల్టీ-సిటీ ట్రావెల్ ప్యాకేజీలు, బౌద్ధ పుణ్యక్షేత్రాల ప్రమోషన్ వంటి అంశాలు కూడా రెండు దేశాల ప్రతినిధుల సమావేశంలో చర్చకు వచ్చాయి.

Also Read: https://www.mega9tv.com/national/procter-gamble-appoints-shailesh-jejurikar-as-new-ceo-first-indian-ceo-of-187-year-old-american-company/