పాక్ బండారం..!

Operation Sindoor: అబ్బే.. ఆపరేషన్‌ సిందూర్‌తో భూభాగంలో వేటికి డ్యామేజ్‌ కాలేదు. పైగా ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్‌తో కౌంటర్‌ ఆపరేషన్‌ చేసి భారత యుద్ధ విమానాలను నేలకూల్చాం.. ఇదీ ఇప్పటికీ పాకిస్థాన్‌ చెబుతున్న మాట. కళ్లెదుట ఉగ్రస్థావరాలు, సైనిక శిబిరాలు నేలమట్టం అయిన ఆధారాలు కనిపిస్తున్నా కూడా పాక్‌ ఈ వాదన నుంచి పక్కకు పోవడం లేదు. ఈ క్రమంలో పాక్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కొన్ని రోజుల క్రితం జైషే మహమ్మద్ కమాండర్ భారత సైన్యం దాడుల గురించి నిజాలు వెల్లడించగా, తాజాగా లష్కరే తోయిబా వంతు వచ్చింది. భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందని లష్కరే కమాండర్ ఖాసిం స్వయంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒప్పుకోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయంగా ఇరకాటంలో పడింది.

ఈ ఏడాది మే 7న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన ఘటనకు ప్రతీకారంగా, భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపింది. ఇందులో భాగంగానే మురిద్కేలోని లష్కరే ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. అయితే, ఆ భవనాన్ని ఉగ్రవాద సంస్థ ఇకపై ఉపయోగించడం లేదని పాకిస్థాన్ బుకాయించే ప్రయత్నం చేసింది.

ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోలో, లష్కరే కమాండర్ ఖాసిం పాకిస్థాన్‌లోని మురిద్కేలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిలబడి మాట్లాడాడు. “భారత్ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై తాను నిలబడి ఉన్నాను…దీని పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నాడు. దేవుడి దయతో, ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తాం” అని పేర్కొన్నాడు. గతంలో ఈ స్థావరంలో ఎందరో ముజాహిదీన్లు, తలబాలు శిక్షణ పొంది విజయం సాధించారని కూడా ఖాసిం అంగీకరించాడు.

ఇక మరో వీడియోలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మాట్లాడుతూ మురిద్కే స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం నిధులు సమకూరుస్తున్నాయని చెప్పడం గమనార్హం. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ లష్కరే తన ప్రధాన కార్యాలయాన్ని రహస్యంగా పునర్నిర్మిస్తోందని భారత నిఘా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న కశ్మీర్ సాలిడారిటీ డే ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. Operation Sindoor.

గతంలో జైషే మహమ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ కూడా ఇలాగే ఒక వీడియోలో మాట్లాడుతూ బహావల్‌పూర్‌పై జరిగిన దాడుల్లో జేఈఎం చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ‘ఛిన్నాభిన్నమైంది’ అని అంగీకరించాడు. ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన వారి అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వయంగా జనరల్స్‌ను పంపారని కూడా అతను తెలిపాడు. ఇలా ఉగ్రవాదులే స్వయంగా నిజాలు బయటపెడుతుండటంతో, ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ వైఖరి మరోసారి బహిర్గతమైంది.