ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం పార్లమెంట్ లో ఏం చెప్పింది..?

Operation Sindoor Debate in Lok sabha: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పూర్తిస్థాయి వాస్తవాలు ఏంటి..? ఆపరేషన్ సిందూర్ ఎలా నిర్వహించారు..? భారత్ కు ఈ ఆపరేషన్ లో ఎలాంటి నష్టం కలిగింది..? మన యుద్ధ విమానాలు నిజంగా కూలిపోయాయా..? ఇవి గత కొద్ది రోజులుగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వేస్తున్న ప్రశ్నలు. ఆపరేషన్ సిందూర్.. అలాగే పహల్గాం ఉగ్రదాడి గురించి పార్లమెంట్ లో చర్చ నిర్వహించాలని.. నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది.. దీనిపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి రగడ నడుస్తూనే ఉంది. చివరికి కేంద్ర ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.. అసలు ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్రం ఏం చెప్పింది..? గతంలో పాక్ విషయంలో వాజ్ పేయి ఏం చేశారు..? కేంద్రం ప్రకటకు విపక్షాలు సంతృప్తి చెందాయా..?

పహల్గాం ఉగ్రవాది ఇటీవలి కాలంలో భారత్ లో సంచలనం సృష్టించిన అత్యంత దారుణమైన ఘటన.. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ప్రకృతి అందాలను చూద్దామని వెళ్లిన పర్యాటకులను అత్యంత దారుణంగా .. ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. చాలా మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇది ఉగ్రవాదుల ఏరివేత విషయంలో భారత్ ఎలా గట్టిగా నిలబడుతుందో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. దీని తర్వాత పాకిస్థాన్ భారత్ పై దాడులకు ప్రయత్నించింది. ఆ దాడులను కూడా భారత్ ఎదుర్కొంది. భారత అత్యాధునిక ఆయుధాలు పాకిస్థాన్ గడగడ లాడించాయి. చివరికి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలులోకి వచ్చింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి భారత్ లోని విపక్షాలకు అనేక సందేహాలు.. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది..? భారత్ సైన్యం ఎలా తలపడింది..? వంటి ఎన్నో ప్రశ్నలు. దీనికి పార్లమెంట్ లోనే సమాధానం చెప్పాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఎట్టకేలకు కేంద్రం దీనిపై చర్చించేందుకు అంగీకరించింది.

ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అనిఅన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయన్నారు రాజ్ నాథ్. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారని… మన సైనికులు ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్‌ పూర్తి చేశామన్నారు. సిందూర్‌ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని.. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన సైన్యానికి అభినందనలు అని అన్నారు. Operation Sindoor Debate in Lok sabha.

అలాగే ఆపరేషన్ సిందూర్ ఎలా జరిగింది.. పాకిస్థాన్ ఏం చేసింది.. భారత్ ఎలా పాక్ దాడులను తిప్పి కొట్టిందో కూడా రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ సైన్యం మనపై దాడికి దిగిందన్నారు. దాయాది దాడులను సమర్థంగా తిప్పికొట్టామని… మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారని తెలిపారు. పాకిస్థాన్‌లోని మిసైల్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ ధ్వంసమైందని.. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు.. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని… ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారని.. ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు.. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయన్నారు. సరిహద్దులు దాటి వెళ్లడం.. ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం కాదని.. అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమన్నారు.

మనం చేసిన దాడులతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ వేదికగా తెలిపారు. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్‌ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్‌ చేశారన్నారు. మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపిస్తోందన్నారు. భుజ్‌, ఉధంపూర్‌ స్థావరాలకు వెళ్లి మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశామన్నారు. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని.. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామన్నారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని… 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదని విపక్షాల విషయంలో మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలని కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. దేశ భద్రత విషయంలో విపక్షాలు కాస్త ఆలోచించి వ్యవహరించాలని విమర్శించారు.

ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో కూడా రాజ్ నాథ్ వివరించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలన్నారు. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయన్నారు. మన సైనికుల చర్యను వాజ్‌పేయీ ప్రశంసించారని… 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్‌ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. పాకిస్థాన్‌తో భారత్‌ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్‌పేయీ చెప్పారున్నారు. స్నేహ హస్తం చాచడమే భారత్‌ గొప్పతనమన్నారు.. ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్‌ మర్నాడు సూర్యోదయం చూసేది కాదన్నారు. శాంతి కోరడం భారత్‌ రక్తంలోనే ఉందని.. మనం యుద్ధాలు కోరుకోమన్నారు.

Also Read: https://www.mega9tv.com/international/thailand-and-cambodia-agree-to-ceasefire-after-deadly-five-day-border-clashes/