
Operation Mahadev: జమ్మూ కశ్మీర్లో భారత సైన్యం మరోసారి తన సత్తా చాటింది. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి, లష్కర్-ఎ-తొయిబా దగ్గర శిక్షణ పొందని కీలక ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను ఆపరేషన్ మహాదేవ్లో హతమార్చింది. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మట్టుబెట్టబడ్డారు. అయితే ఉగ్రవాదులు చేసిన చిన్న తప్పు వారు భద్రతా బలగాలు చిక్కేలా చేసింది..? ఓ చైనా తయారీ వస్తువు వాడటమే వారు దొరికిపోవడానికి కారణమైంది..? ఇంతకీ వారు ఎలా దొరికపోయారు..?. ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? అసలు సులేమాన్ షా ఎవరు?
2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం బైసరాన్ వ్యాలీలో జరిగిన దారుణ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. 26 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానిక పోనీవాలా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా, లష్కర్-ఎ-తొయిబా దగ్గర శిక్షణ పొందిన కీలక ఉగ్రవాది, గత మూడు నెలలుగా భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అతడు పాకిస్థాన్ ఆర్మీలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో మాజీ కమాండోగా శిక్షణ పొంది, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ LeTలో చేరినట్లు గుర్తించారు. పహల్గాం దాడి తర్వాత జమ్మూకశ్మీర్ లో వీరి గురించి ముమ్మరంగా తనిఖీలు చేశారు. అయితే వీరు చేసిన చిన్న తప్పు భద్రతా బలగాలకు దొరికిపోయేలా చేసింది.
జూలై 27 అర్ధరాత్రి 2 గంటల సమయంలో, భద్రతా దళాలకు ఒక కీలక సమాచారం అందింది. చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ82 యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. ఈ సెట్‌ను పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఈ సిగ్నల్ డాచిగామ్ నేషనల్ పార్క్‌లోని మహాదేవ్ పర్వత ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించారు. 13,000 అడుగుల ఎత్తులో, మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం కశ్మీరీ హిందువులకు శ్రావణ మాసంలో పవిత్రమైనది. ఈ సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు వెంటనే ఆపరేషన్‌కు సన్నద్ధమయ్యాయి. గత 14 రోజులుగా ఈ ఉగ్రవాదుల కదలికలను ఎలక్ట్రానిక్, ఫిజికల్ సర్వైలెన్స్ ద్వారా గమనిస్తున్న దళాలు, ఈ సిగ్నల్‌తో వారి ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించాయి.
జూలై 28 ఉదయం 8 గంటలకు, భద్రతా దళాలు డాచిగామ్ అడవుల్లో డ్రోన్ సర్వైలెన్స్‌ను ప్రారంభించాయి. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని అంచనా వేశాయి. ఉదయం 9:30 గంటలకు, 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు కదిలారు. ఈ ప్రాంతం దట్టమైన చెట్లు, రాతి కొండలతో నిండి ఉండటం వల్ల ఆపరేషన్ అత్యంత సవాలుగా మారింది. ఉదయం 10 గంటలకు, డ్రోన్లు ఉగ్రవాదుల కదలికలను స్పష్టంగా గుర్తించాయి. వారు తాత్కాలిక టెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సమాచారంతో పారా కమాండోలు స్టెల్త్ మోడ్‌లో ఉగ్రవాదుల క్యాంప్ సమీపానికి చేరుకున్నారు. 11 గంటలకు, వారు ఉగ్రవాదులకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొజిషన్‌కు చేరుకున్నారు.
పారా కమాండోలు ఎటువంటి ఆలస్యం లేకుండా ఉగ్రవాదులపై దాడి చేశారు. ఉగ్రవాదులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఆకస్మిక దాడి జరగడంతో వారికి ఎదురుదాడి చేసే అవకాశమే లభించలేదు. ముగ్గురు ఉగ్రవాదులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఒక ఉగ్రవాది పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని కూడా కమాండోలు వెంటాడి హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా, అతడితో పాటు ఇద్దరు ఇతర ఉగ్రవాదులు – అబూ హమ్జా అలియాస్ హారిస్, యాసిర్ – హతమయ్యారు. ఈ ముగ్గురూ పాకిస్థానీ జాతీయులని, లష్కర్-ఎ-తొయిబా దాని ఆఫ్షూట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారని గుర్తించారు. Operation Mahadev.
ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో అమెరికా తయారీ ఎం-4 కార్బైన్ రైఫిల్, రెండు ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, చైనా తయారీ టీ82 ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్లు ఉన్నాయి. ఈ ఆయుధాల ఆధారంగా, ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. సులేమాన్ షా 2024 అక్టోబర్‌లో జరిగిన సోన్మార్గ్ జడ్-మోర్హ్ టన్నెల్ దాడిలో కూడా పాల్గొన్నాడని, ఆ దాడిలో ఏడుగురు నిర్మాణ కార్మికులు, ఒక వైద్యుడు మరణించారని గుర్తించారు.
సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా పాకిస్థాన్ ఆర్మీలో SSG కమాండోగా శిక్షణ పొందిన వ్యక్తి. 2022లో లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా కశ్మీర్లోకి చొరబడిన అతడు, లష్కర్-ఎ-తొయిబా శిక్షణా కేంద్రమైన మురిద్కేలో ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. పహల్గాం దాడిలో హిందువులను లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబాల ముందే కాల్పులు జరిపాడు. ఈ దాడికి TRF సంస్థ బాధ్యత వహించింది. సులేమాన్‌పై రూ.20 లక్షల రివార్డ్ ఉంచిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, అతడి కదలికలను గుర్తించడానికి స్థానిక నోమాడ్‌ల సహాయం తీసుకున్నారు. అతడు తన రూపాన్ని మార్చుకోవడానికి బరువు తగ్గినట్లు కూడా గుర్తించారు. అయినప్పటికీ, భారత సైన్యం నిఘా వలయం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు.
ఆపరేషన్ మహాదేవ్ పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేసింది. ఈ ఆపరేషన్‌కు మహాదేవ్ హిల్స్, జబర్వాన్ రిడ్జ్‌ల మధ్య జరిగినందున ఈ పేరు పెట్టారు. ఈ ఎన్కౌంటర్లో భారత సైన్యం పారా కమాండోలు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సమన్వయం అభినందనీయం. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులకు కశ్మీర్లో ఆశ్రయం లేదని మరోసారి నిరూపించింది.