
Preliminary report on Air India plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక నివేదికలో పైలట్ల తప్పు ఉందని చెప్పడంతో ఇది దుమారాన్ని రేపింది. ముఖ్యంగా కాకిపిట్ వాయిస్ రికార్డర్ లో మాటల ప్రకారం అసలు ఇంధన స్విచ్ లు ఆఫ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదిక చెబుతోంది. అయితే దీనిని ఎవరు ఆఫ్ చేశారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే దర్యాప్తును తప్పుదోవ పట్టించి.. మొత్తం తప్పును పైలెట్లపై నెట్టే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.. ఇలాంటి నేపథ్యంలో అసలు నివేదికలో ఎలాంటి కీలక అంశాలను ప్రస్తావించారు.. ? ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్లు ఏం మాట్లాడుకున్నారు..? ఇది నిజంగా మానవ తప్పిందామా..? లేక టెక్నికల్ సమస్యా..?
తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లోని మాటలను లెక్కలోకి తీసుకుని.. కొందరు పైలెట్ల తప్పేనే విమర్శలు చేస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే కూలిపోయింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలి, 241 మంది ప్రయాణికులు, 19 మంది కాలేజీలో ఉన్నవారు మరణించారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికాడు. ఈ ప్రమాదం భారత్‌లో గత 40 ఏళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. అమెరికా, యూకే బృందాలు ఈ దర్యాప్తునకు సాయం చేస్తున్నాయి.
ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే రెండు ఇంజిన్ల ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ స్థితికి మారాయి, దీంతో ఇంజిన్లకు ఇంధనం అందక ఆగిపోయాయి. ఈ స్విచ్‌లు సాధారణంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆఫ్ చేస్తారు, టేకాఫ్ సమయంలో కాదు. ఈ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ అయ్యాయనే దానిపై పైలట్లు ఒకరినొకరు నిందించుకున్నట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఉంది. దీంతో పైలట్లు ఉద్దేశపూర్వకంగానో, అనుకోకుండానో స్విచ్‌లు ఆఫ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, ఈ ఆరోపణలకు ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవని, దర్యాప్తు జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. Preliminary report on Air India plane crash.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లో రికార్డైన సంభాషణ ఈ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి కీలకంగా మారింది. విమానం గాలిలోకి లేచిన కొద్ది సెకన్లలో ఒక పైలట్ మరో పైలట్‌ని, ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశావ్? అని అడిగాడు. దానికి రెండో పైలట్, నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ ఏ పైలట్ చెప్పాడో, ఎవరు స్విచ్‌లు తాకారో స్పష్టంగా తెలియలేదు. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. అయితే కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌లో ఉన్న గొంతులు ఎవరివో ఇంకా గుర్తించలేదు.
ఇంధన స్విచ్‌లు ఆఫ్ అవడం ఈ ప్రమాదంలో అతి కీలకమైన అంశం. ఈ స్విచ్‌లు లాకింగ్ మెకానిజంతో పనిచేస్తాయి. చేయి తగిలి అనుకోకుండా ఆఫ్ కాకుండా ఉండేందుకు రెండు దశల్లో పనిచేసేలా వీటిని ఏర్పాటు చేస్తారు. అంటే పైకి లాగి, తర్వాత స్విచ్ మార్చితేనే ఇవి పనిచేస్తాయి. నిపుణుల ప్రకారం, ఒకే సమయంలో రెండు స్విచ్‌లను ఆఫ్ చేయడం దాదాపు అసాధ్యం, ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేయాల్సి ఉంటుంది. ఈ విమానంలో స్విచ్‌లు 2019, 2023లో మార్చారు. కానీ లాకింగ్ సమస్య లేదని నివేదిక చెబుతోంది. ఈ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ అయ్యాయి, పైలట్లు చేశారా, లేక సాంకేతిక లోపమా అనేది తేలలేదు.
అయితే ప్రాథమిక నివేదిక పైలెట్ల తప్పు ఉన్నట్టు చెబుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ మండిపడుతోంది. అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అసోసియేషన్ వ్యతిరేకించింది. ఈ నివేదిక పైలట్లను నిందిస్తోందని, దర్యాప్తు పూర్తి కాకముందే వారిని బాధ్యులుగా చూపడం సరికాదని FIP అధ్యక్షుడు చరణ్‌వీర్ సింగ్ రంధావా అన్నారు. స్విచ్‌లు వాటికవే మారాయని, ఇది ఎలక్ట్రానిక్ లేదా సాఫ్ట్‌వేర్ లోపం కావచ్చని వారంటున్నారు. దర్యాప్తులో పారదర్శకత లేదని, సరైన అర్హతలు ఉన్న వ్యక్తులు దర్యాప్తు బృందంలో లేరని ఆరోపించారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఎవరు మాట్లాడారో స్పష్టంగా గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఇది పైలట్లపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ ఇండియా కూడా ఇదే విధమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తప్పులను తప్పించుకునేందుకు పైలెట్లపై నిందమోపుతున్నారని విమర్శిస్తున్నారు.
పైలట్ల తప్పిదం కాకుండా.. ఇతర అంశాలు కూడా ప్రమాదానికి కారణం కావొచ్చనే మాట వినిపిస్తోంది. పక్షలు ఢీకొట్టడం, ఇంధన కాలుష్యం, సాంకేతిక లోపాలు, ఫ్లాప్స్ సరిగా ఎక్స్‌టెండ్ కాకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కానీ, విమానాన్ని పక్షలు ఢీకొన్న ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలో ఈ విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఒక వేళ పక్షలు ఢీకొంటే.. ఇంజిన్ల నుంచి పొగ వచ్చేది.. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. ఇక ఇంధనం కూడా సరిగ్గా ఉందని నివేదిక చెబుతోంది. విమానం ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ కాలేదని, ఫ్లాప్స్ టేకాఫ్ స్థితిలోనే ఉన్నాయని డేటా చూపిస్తోంది. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం కావొచ్చనే సందేహం కూడా కలుగుతోంది. అయితే తుది నివేదిక వస్తేనే ఈ ప్రమాదంపై సరైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈ ప్రమాదంలో 260 మంది మరణించడంతో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప, విమానంలోని అందరూ మరణించారు. అతడు కూడా ప్రస్తుతం ఆ పీడకల నుంచి బయటపడలేకపోతున్నాడు. మానసిక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. అటు బాధిత కుటుంబాలు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ పూర్తి ట్రాన్స్‌క్రిప్ట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.