
Rahul Gandhi EVM: ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తునే ఉన్నారు. ఓట్ల చోరికి సంబంధించి త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ రీసెంట్ గా రాహుల్ వ్యాఖ్యానించారు. దానిని నిజం చేస్తూ.. రాహుల్ భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల సంఘంతో పాటు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ పై సూటిగా ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు మరింత పదును పెట్టారు. కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించబడినట్లు రాహుల్ ఆరోపించారు. ఈ తొలగింపులు నకిలీ లాగిన్‌లు, నకిలీ ఫోన్ నంబర్లతో రాష్ట్రం వెలుపల నుండి సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రతి ఎన్నికలోనూ కొంతమంది వ్యక్తులు.. దేశవ్యాప్తంగా లక్షలాది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి ఓటు వేసే వారి పేర్లను ఒక క్రమ పద్ధతిగా తీసివేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీని గురించి తన 100% ఆధారాలు ఉన్నాయి’ అని రాహుల్ అన్నారు.
కర్నాటకలోని కాలబుర్గి జిల్లాలో ఉన్న అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,018 ఓట్లు డిలీట్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాఫ్ట్‌వేర్ మానిప్యులేషన్, ఫేక్ అప్లికేషన్లతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. ‘ఒక బూత్ లెవల్ అధికారి తన మామగారి ఓటు తొలగించబడిందని గమనించింది. పరిశీలించగా తన పొరుగువాడి లాగిన్ నుండి అది జరిగిందన్నారు. ఇలా ఈ కుంభకోణం బయటపడింది’ అని ఆయన వివరించారు.
ఇక మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. ‘కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు పంపింది. ఓటర్ల తొలగింపు ఫారమ్‌లను నింపిన పరికరాల IP అడ్రస్‌లు, OTP ట్రైల్స్ వంటి సమాచారం కోరింది. కానీ ఎన్నికల సంఘం వాటిని ఇవ్వలేదు. ఇస్తే ఈ ఆపరేషన్ మూలాలు ఎక్కడున్నాయో బయటపడుతుందని భయం. జ్ఞానేష్ కుమార్ ఈ నేరస్థులను రక్షిస్తున్నాడనే పక్కా ఆధారం ఇది’ అని ఆయన అన్నారు. ‘జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిని రక్షించడం ఆపాలి. ఎన్నికల సంఘం ఈ డేటాను వారం రోజుల్లో బయటపెట్టాలి. లేకపోతే ఆయన వారిని కాపాడుతున్నారణ నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. వారంలో కర్ణాటక సీఐడీ అధికారులు.. దీనికి సంబంధించి ఆధారాలు అందజేయాలి’ అని రాహుల్ గాంధీ సూచించారు.
ఆలంద్ నియోజకవర్గంలోని ఒక బూత్ స్థాయి అధికారి.. తన కుటుంబ సభ్యుల ఓటు తొలగించబడిందని గుర్తించడంతో.. ఈ ఓట్ల చోరీ మోసం వెలుగులోకి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. అనంతరం దానిపై విచారణ జరపగా.. దాని వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర ఉందని తెలిసినట్లు చెప్పారు. ఈ ఓట్ల చోరీపై గత 18 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక సీఐడీ.. 18 లేఖలు రాసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు.
ఇక రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఓట్ల తొలగింపు అనేది ఆన్‌లైన్‌లో జరిగేది కాదని.. దానిపై ఒక ఎఫ్ఐఆర్‌ను కూడా ఈసీ స్వయంగా నమోదు చేసిందని వెల్లడించాయి. 2018లో ఆలంద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచిందని.. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు ఈసీ గుర్తు చేసింది. రాహుల్ చేసిన ఆరోపణలు తప్పు అని పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. మరోవైపు.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓడిపోయిందని.. అందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కోర్టుల నుంచి చీవాట్లు తినడం రాహుల్ గాంధీకి అలవాటైందని ఎద్దేవా చేశారు. Rahul Gandhi EVM.

ఇక మరోవైపు రాహుల్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ దుయ్యబట్టింది. ‘‘రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదని…. 2014 నుంచి మోదీజీ సాధిస్తున్న విజయాలన్నీ నిజం కాదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలకు, ఓటర్లకు అవమానం . ఆయన బాంబు గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఆ బాంబ్ ఇలాగే ఉంటుందా..? వాళ్లు ఓటమిని చవిచూస్తున్నారు. ఈ సమయంలో వారు చేయాల్సింది దానిని అంగీకరించడం. కష్టపడి మీ స్థాయికి వస్తామనేలా వారి మాటలు ఉండాలని హితవు పలికారు.