జూలై 14న భూమికి రానున్న శుభాంశు శుక్లా..!

Shubhamshu Shukla return to Earth: భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెండు వారాల పాటు సాగిన తన చారిత్రాత్మక ఆక్సియమ్-4 మిషన్‌ను పూర్తి చేసి, భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. జూలై 14 ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి శుక్లా భూమిపై అడుగుపెడతారు. అయితే శుక్లా తిరుగుప్రయాణం అంత సులభమేం కాదు.. దీనికి కారణం ఏంటి..? ఇప్పుడు సుక్లా వేసే ప్రతీ స్టెప్ .. రేపు భవిష్యత్ భారత అంతరిక్ష పరిశోధనలకు ఎందుకు కీలకం కానుంది.? అసలు ఇన్ని రోజులు ఐఎస్ఎస్ లో శుక్లా ఏం చేశారు..?

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఆక్సియమ్-4 మిషన్‌లో భాగంగా జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. శుక్లా, ఆయన సహచరులు జూలై 14న ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి భూమికి తిరిగి రానున్నారని నాసా తెలిపింది. ఈ తిరుగు ప్రయాణంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడా తీరంలో స్ప్లాష్‌డౌన్‌ను చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ సురక్షితంగా జరిగేలా నాసా, స్పేస్‌ఎక్స్, ఇస్రో సహా అంతర్జాతీయ భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తున్నాయి. శుక్లా, భారత్‌కు చెందిన రెండో అంతరిక్ష యాత్రికుడిగా, 41 ఏళ్ల తర్వాత ఐఎస్ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఎంత కష్టమో.. అక్కడి నుంచి సురక్షితంగా తిరిగి రావడం అంతకంటే ఎక్కువ కష్టం.

శుభాంశు శుక్లా, ఆక్సియమ్-4 సిబ్బంది సురక్షిత తిరుగు ప్రయాణం కోసం నాసా విస్తృతమైన చర్యలు చేపట్టింది. జూన్ 26న ఐఎస్ఎస్‌తో డాకింగ్ పూర్తయిన తర్వాత, సిబ్బంది సురక్షితంగా స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు నాసా హార్మోనీ మాడ్యూల్‌లో డాకింగ్ సీక్వెన్స్‌ను పర్యవేక్షించింది. జూలై 14న అన్‌డాకింగ్ కోసం, నాసా ఆర్బిటల్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. డ్రాగన్ అంతరిక్ష నౌక సీల్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా, సిబ్బంది భద్రతను నిర్ధారించేందుకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తోంది.

శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌లో 14 రోజుల పాటు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు, ఇందులో ఏడు ఇస్రో రూపొందించినవి ఉన్నాయి. బయోమెడికల్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ, వ్యవసాయం, న్యూరోసైన్స్, అధునాతన మెటీరియల్స్ రంగాలకు సంబంధించి ప్రయోగాలు చేశారు. ప్రముఖ ప్రయోగాల్లో స్ప్రౌట్స్ ప్రాజెక్ట్ ఉంది, ఇది అంతరిక్షంలో విత్తనాల మొలకెత్తడం, మొక్కల పెరుగుదలను అధ్యయనం చేస్తుంది. శుక్లా పెసరు, మెంతి విత్తనాలను నీరు పోసి, వాటి పెరుగుదలను రికార్డ్ చేశారు. మయోజెనిసిస్ ప్రయోగంలో, స్పేస్‌లో కండరాల క్షీణతను అధ్యయనం చేశారు, ఇది భవిష్యత్ దీర్ఘకాల అంతరిక్ష మిషన్లకు ఉపయోగపడుతుంది. అలాగే, స్పేస్ మైక్రో ఆల్గీ ప్రయోగంలో, ఆహారం, ఆక్సిజన్, బయోఫ్యూయల్ కోసం సూక్ష్మ ఆల్గీల పెరుగుదలను పరిశీలించారు. శుక్లా విద్యార్థులతో హామ్ రేడియో ద్వారా సంభాషించారు. జూన్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు, జూలై 6న ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌తో మాట్లాడారు. ఈ కార్యకలాపాలు భారత యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని రేకెత్తించాయి.

జూలై 14న ఐఎస్ఎస్ నుంచి బయలుదేరే ముందు, శుక్లా మిగిలిన ప్రయోగాలను పూర్తి చేస్తూ, సిబ్బందితో కలిసి తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతారు. అన్‌డాకింగ్ ప్రక్రియలో, డ్రాగన్ అంతరిక్ష నౌక స్టేషన్ నుంచి విడిపోయి, ఫ్లోరిడా తీరంలో దిగుతుంది. ఈ ప్రక్రియలో శుక్లా, మిషన్ పైలట్‌గా, సిబ్బంది సురక్షిత రీతిలో భూమికి చేరేలా సహకరిస్తారు. తిరిగి భూమికి చేరిన తర్వాత, శుక్లా ఈ మిషన్‌లో సేకరించిన డేటాను ఇస్రోకు అందజేస్తారు. ఇది 2027లో భారత్ చేపట్టే గగన్‌యాన్ మిషన్ కు ఎంతో ఉపయోగపడుతుంది. శుక్లా అనుభవం, భారత్ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. Shubhamshu Shukla return to Earth.

శుభాన్శు శుక్లా ఆక్సియమ్-4 మిషన్, భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక మైలురాయి. గగన్‌యాన్ మిషన్‌ భారత్ మొట్టమొదటి స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర. శుక్లా నిర్వహించిన ప్రయోగాలు, మైక్రోగ్రావిటీలో జీవ ప్రక్రియలు, స్పేస్ ఫార్మింగ్, ఆల్గీల పెరుగుదల వంటి అంశాలపై సమాచారాన్ని అందించాయి. ఇవి భవిష్యత్ దీర్ఘకాల మిషన్లకు ఉపయోగపడతాయి. ఈ మిషన్‌కు భారత ప్రభుత్వం సుమారు 548 కోట్ల రూపాయలు చెల్లించింది. శుక్లా అనుభవం ఇస్రోకు అంతరిక్షంలో ఎలా ఉండాలో శిక్షణ, సాంకేతికతలో కీలకమైన అనుభవం అందిస్తుంది.

శుభాంశు శుక్లా మిషన్ భారతదేశంలో హర్షాతిరేకాలను కలిగించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత వైమానిక దళం శుక్లాను ఎక్స్‌లో అభినందించారు. శుక్లా స్వస్థలమైన లక్నోలోని వందలాది విద్యార్థులు, ఆయన తల్లిదండ్రులు లాంచ్‌ను ఉత్సాహంగా వీక్షించారు. శుక్లా విద్యార్థులతో హామ్ రేడియో ద్వారా సంభాషించడం, ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం దేశవ్యాప్తంగా యువతలో స్ఫూర్తిని నింపింది. ఐఎస్ఎస్ నుంచి శుక్లా మాట్లాడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తే సరిహద్దులు కనిపించవు. భూమి ఏకమైనట్లు కనిపిస్తుంది అని చెప్పారు, ఇది ఐక్యత భావనను ప్రేరేపించింది.

Also Read: https://www.mega9tv.com/national/shubhanshu-shukla-enjoys-feast-on-space-station-ahead-of-homecoming/