భారత్ ను భయపెడుతోన్న సూపర్ బగ్స్..?!

Superbugs Scaring India: భారతదేశం సూపర్‌బగ్స్ సమస్య ఎక్కువ అవుతోంది. యాంటీబయోటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్‌కు లొంగని ఈ సూక్ష్మజీవులు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతున్నాయి. 2019లో సుమారు 3 లక్షల మరణాలు ఈ సూపర్‌బగ్స్ కారణంగా సంభవించాయి అంటే ఇవి ఎంత ప్రమాదకరమో అర్థం అవుతుంది. అసలు ఈ సూపర్ బగ్స్ అంటే ఏంటి..? ఇవి ఎందుకు మరణాలకు కారణవుతున్నాయి..? ఇవి ఎక్కడ ఉంటాయి..? వీటి వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం..? మనం చేసే తప్పులే ఈ సూపర్ బగ్స్ పెరుగుదలకు కారణమా..?

భారతదేశంలో సూపర్‌బగ్స్ అంటే యాంటీబయోటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్‌ మందులకు లొంగని సూక్ష్మజీవులు. వీటి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. బయోలాజికల్, సామాజిక అంశాలు వీటి పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రతీ రోగానికి అవసరం ఉన్నా లేకపోయిన యాంటీబయోటిక్ మందులను అతిగా, తప్పుగా వాడటం వల్ల మనలో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. చాలా మంది డాక్టర్లు త్వరగా రోగాన్ని నయం చేయడానికి యాంటీబయోటిక్ మందులను రాయడం వాటిని సక్రమంగా వాడకపోవడం ఈ సమస్యకు కారణంగా మారింది. ఇక రెండవది, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో లోపాలు. డయాగ్నస్టిక్ టెస్టులకు ప్రాధాన్యత తక్కువగా ఉండటం, ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల వైద్యులు టెస్టులు చేయకుండా యాంటీబయోటిక్స్ రాయడం వల్ల సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. ఇక మూడవది, సామాజిక అంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్-మెడికేషన్ సర్వసాధారణం, రోగులకు ముందు షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తున్నారు. ఇక నాల్గవది.. అతి ముఖ్యమైంది.. వ్యవసాయ రంగంలో యాంటీబయోటిక్స్ ఉపయోగం. పశుసంవర్ధకంలో ఎదుగుదల కోసం, రోగ నివారణ కోసం యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల రెసిస్టెన్స్ గల బ్యాక్టీరియా నేల, నీరు, ఆహారంలో వ్యాపిస్తున్నాయి. అలాగే స్వచ్ఛమైన నీరు, సానిటేషన్, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.

అసలు సూపర్‌బగ్స్ ఎన్ని రకాలు..?
సూపర్‌బగ్స్ అనేవి బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు వంటి సూక్ష్మజీవులు. ఇవి యాంటీబయోటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్‌కు లొంగకుండా వాటికవే రెసిస్టెన్స్ అభివృద్ధి చేసుకుంటాయి. భారత్‌లో ఎ.కోలై, క్లెబ్సియెల్లా న్యూమోనియా వంటి బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ 70%కి పైగా ఉంది. ఈ రెసిస్టెన్స్ వల్ల మందులు పనిచేయక 70% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెసిస్టెన్స్ వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స చేయడం కష్టమవుతోంది, దీని వల్ల ఆస్పత్రి ఖర్చులతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు దాదాపు 100% రెసిస్టెన్స్ చూపుతున్నాయి. ఇవి 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మరణాలు, 49.5 లక్షల మరణాలకు పరోక్షంగా కారణమయ్యాయి. 2050 నాటికి ఏటా 1 కోటి మరణాలు సంభవించవచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

యాంటీబయోటిక్స్ సగంలో ఆపడం వల్ల ప్రమాదాలు ఏంటి..?
యాంటీబయోటిక్స్ సగంలో ఆపడం సూపర్‌బగ్స్ పెరగడానికి కారణం అవుతుంది. ఎవరికైనా వైరల్ ఫీవర్ వస్తే.. డాక్టర్ యాంటిబయాటిక్ మందులు రాస్తారు. పూర్తి కోర్సు అవ్వకుండానే మూడు రోజులకు జ్వరం తగ్గిపోయిందని.. ముందులు వేసుకోవడం మానేస్తారు కొందరు. దీని వల్ల శరీరంలో మిగిలిన వైరస్ రోగనిరోధక శక్తిని పెంచుకుని.. అంతకుముందు వేసుకున్న మందు పనిచేయకుండా చేస్తుంది. అందుకే డాక్టర్లు రాసిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి.. అలాగని డాక్టర్లు అవసరం లేని యాంటి బయోటిక్స్ రాయడం కూడా ప్రమాదమే. Superbugs Scaring India.

యాంటీబయోటిక్స్ పూర్తి కోర్సు తీసుకోకపోతే, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాకుండా, మనుగడ సాగించే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అభివృద్ధి చేసుకుంటాయి. అర్ధాంతరంగా యాంటీబయోటిక్స్ ఆపడం వల్ల ఇన్ఫెక్షన్ తిరిగి వస్తుంది, రోగి ఆస్పత్రిలో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది, ఖర్చు, మరణ ప్రమాదం పెరుగుతుంది. భారత్‌లో, రోగులు తరచూ లక్షణాలు తగ్గగానే యాంటీబయోటిక్స్ ఆపేస్తారు, ఇది రెసిస్టెన్స్ వ్యాప్తికి ప్రధాన కారణం.

సూపర్‌బగ్స్ సమస్య ప్రపంచంలోనే భారత్ లోనే అత్యధికం. 2019లో 3 లక్షల మరణాలు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కారణంగా సంభవించాయి. నవజాత శిశువుల్లో 60,000 మరణాలు రెసిస్టెన్స్ గల నియోనాటల్ ఇన్ఫెక్షన్ల వల్ల జరిగాయి. ఆస్పత్రుల్లో, ముఖ్యంగా ఐసీయూలలో, ఈ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి. నవజాత శిశువులు, వృద్ధులకు ఇవి ప్రమాదకరం. నదులు, నీటి వనరులలో కూడా సూపర్ బగ్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా సూపర్‌బగ్స్ సమస్య భారత్‌లో అదృశ్య మహమ్మారిగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి ఏటా ఒక కోటి మరణాలు సంభవించవచ్చని, ఆర్థికంగా ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య ఖర్చు, 3.4 ట్రిలియన్ డాలర్ల జీడీపీ నష్టం జరగవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. భారత్‌లో ఈ సమస్యను అరికట్టకపోతే, సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా చికిత్స చేయలేని స్థితికి చేరుకోవచ్చు. కొత్త యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్స్ అభివృద్ధి, వ్యాక్సిన్ల అభివృద్ధి, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, ప్రజా అవగాహన కార్యక్రమాలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి కీలకం. భారత్‌లో స్థానికంగా పరిష్కారం, అంతర్జాతీయ సహకారం ద్వారా ఈ సమస్యను నియంత్రించే అవకాశం ఉంది.

సూపర్‌బగ్స్ సమస్యను అరికట్టేందుకు భారత్, అంతర్జాతీయ సంస్థలు పలు చర్యలు చేపడుతున్నాయి. భారత్‌లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ 2017లో ప్రారంభమైంది, ఇది యాంటీబయోటిక్స్ వాడకంపై కఠిన నిబంధనలు, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, ప్రజా అవగాహనను లక్ష్యంగా పెట్టుకుంది. డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను బలోపేతం చేయడం, ఇన్ఫెక్షన్ డిసీజ్ వైద్యుల సంఖ్యను పెంచడం, ఆస్పత్రి ఇన్ఫెక్షన్లను తగ్గించడం వంటి సిఫార్సులు చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్లకు ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఆమోదం తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్ ధరలను తగ్గించడం, పేదలకు అందుబాటులోకి తేవడం కోసం గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ పనిచేస్తోంది. ప్రజలు యాంటీబయోటిక్స్‌ను వైద్య సలహా లేకుండా వాడకుండా, పూర్తి కోర్సు తీసుకోవడం, పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

Also Read: https://www.mega9tv.com/national/shubhamshu-shukla-who-will-return-to-earth-on-july-14-is-returning-from-the-iss-difficult/