బంగారు గనులు!

Gold Mines in India: భారతదేశానికి బంగారం జాక్‌పాట్… బంగారం ధర రాకెట్ వేగంతో పెరుగుతున్న టైంలో ఆ నగరంలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది.! దీంతో భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా? అనే ఆతృత మొదలైంది ప్రజల్లో. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇటు పెద్ద ఎత్తున బంగారు గనుల వేటలో శాస్త్రవేత్తలు పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, కర్ణాటక తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ బంగారు గనులు బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహాల్లో బంగారం కూడా ఒకటి. మరి అలాంటి బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కెజియఫ్ సినిమాలో మాదిరిగా రియల్ బంగారపు గనులు మనదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని తవ్వి తీసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మార్చి 31, 2025 నాటికి, భారతదేశం యొక్క మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు. ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక నుండి వచ్చాయి. మన దేశంలో ఐదు ప్రధాన బంగారు గనులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం బంగారు గనులను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

హట్టి గోల్డ్ మైన్: హట్టి గోల్డ్ మైన్ అనేది కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న ఒక అందుబాటులో ఉన్న బంగారు గని. దీనిని కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన హట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ గని దేశం మొత్తం బంగారు ఉత్పత్తిలో ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ గని నుండి ఏటా దాదాపు 1.8 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. ఈ బంగారు గని 2,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.

కోలార్ బంగారు గని: రెండవ అతిపెద్ద బంగారు గని కోలార్ బంగారు గని (KGF). కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్ణాటకలోని కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హరప్పా మొహెంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచీ బంగారాన్ని వెలికితీసేవారు. వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి ఆ అద్భుతమైన గనులు. రాన్రానూ బంగారం తరిగిపోయింది. చివరకు దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువవ్వడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. ఇక 1880లలో బ్రిటిష్ వారు ఈ గని నుండి దాదాపు 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేశారు.

హెగ్గడదేవన్‌కోట్ బంగారు గని: ఇది కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న బంగారు గనుల ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు లేవు. భవిష్యత్తులో మైనింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. దీని కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిసింది. చిత్తూరు బంగారు గనులు. ఈ గనులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇది రామగిరి బంగారు గనులతో కనెక్ట్ అయ్యి ఉన్న ఒక చిన్న మైనింగ్ ప్రాంతం. అయితే, ప్రస్తుతం ఇక్కడ మైనింగ్ యాక్టివిటీస్ జరగడం లేదు.

ఇక అసలు విషయంలోకెళితే.. ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారు ప్రాజెక్టు భారతదేశంలోనే తొలి బంగారు గనుల ప్రాజెక్టుగా ప్రైవేట్ రంగంలో రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును జియో మైసోర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో ఈ గోల్డ్ మైనింగ్ ఉంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ వివరాల విషయానికొస్తే.. సుమారుగా 1,477 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించబడింది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ , నార్త్, సౌత్ ఇలా నాలుగు దిక్కులలో ఈ గనుల బ్లాక్ లను కనుగొన్నారు. అంతేకాదు 8 నుండి 15 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. మొత్తం ఇక్కడ సుమారుగా 11.2 టన్నుల బంగారం నిలువలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ డెక్కన్ గోల్డ్ మైన్స్ 40% వాటా కలిగి ఉండగా.. త్రివేణి ఎర్త్ మూవర్స్ మిగిలిన 60% వాటా కలిగినట్లు సమాచారం.

ఇకపోతే ఈ బంగారు గనిని ఎలా కనుగొన్నారు? ఎప్పుడు కనుగొన్నారు.? పర్మిషన్ ఎలా లభించింది? తదితర విషయాల విషయానికొస్తే.. 2006లో ఈ గనుల లీజు కోసం జియో మైసోర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2008లో మైనింగ్ ప్లాన్ ను ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆమోదించగా.. 2010లో పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం 33 వేల మీటర్ల డ్రిల్లింగ్, ఐపీ సర్వేలు, మాగ్నెటిక్ సర్వేలు ఇలా అనేక అన్వేషణలను ఆ సంస్థ నిర్వహించడం మొదలుపెట్టింది. అలా మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపు 2043వ సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టుకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుండి 2043వ సంవత్సరం వరకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. Gold Mines in India.

ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిలో మొదట 400 కిలోల టార్గెట్ గా పెట్టుకున్న ఈ సంస్థ ఇప్పుడు 750 కిలోల బంగారం వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ ప్రారంభంతో డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు 14% పెరిగాయి. ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రాజెక్టు ప్రారంభ సంవత్సరంలో రూ.350 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ గోల్డ్ మైన్ చాలామందికి నిరుద్యోగ సమస్యను తీర్చడమే కాకుండా ఆ ప్రాంత డెవలప్మెంట్ కి మరింత దోహాదపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇది ప్రారంభమైతే బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.