
Codemo Connecting Democracy Survey: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ ముగ్గురు మంత్రులను రంగంలోకి దించింది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గెలుపు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ మద్దతు పార్టీలతో కలిసి గెలుపు కోసం ప్లాన్స్ చేసే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే ఒక ప్రముఖ సర్వే సంస్థ జూబ్లీ హిల్స్ బై పోల్ లో ఏ పార్టీకి గెలుపుకు ఛాన్స్ ఉందనే అంశాలను వెల్లడించింది. పబ్లిక్ మూడ్ పైన పలు విషయాలను ప్రస్తావించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హోరా హోరీ జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలుపు ఎవరిది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ముందస్తుగానే ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్ధిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అజాహరుద్దీన్ ను మండలికి పంపటంతో… మరో ఇద్దరు బీసీ అభ్యర్ధుల మధ్య పోటీ నెలకొంది. ఎంఐఎం పోటీ పైన స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేయటం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ నుంచి అభ్యర్ధి ఖరారు పైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ సైతం ఇక్కడ బీజేపీకి మద్దతుగా నిలవనుంది.
జూబ్లీహిల్స్ బై పోల్ పైన ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ అనే సంస్థ నిర్వహించిన సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ 42.8 శాతం ఓట్లతో ముందంజలో నిలువగా.. హస్తం, కమలం పార్టీలు రెండు, మూడుస్థానాలకు పరిమితం అయినట్లు విశ్లేషించింది. కోడ్మో సంస్థ గతంలో కాంగ్రెస్ రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తరపున సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఇటీవల కోడ్మో స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు రెండు వేలమంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9 శాతం మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50ఏండ్లుపైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. Codemo Connecting Democracy Survey.
గెలుపెవరిది నియోజకవర్గంలో 42.8 శాతం మంది ఓటర్లు రానున్న ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో వివరించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7 శాతం మంది జైకొట్టగా.. మరో 19.5 శాతం మంది బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లలో 46.5 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తామన్న వారిలో మహిళా ఓటర్లు 34.4 శాతం ఉన్నారని విశ్లేషించారు. 26-35 సంవత్సరా ల మధ్య ఉన్న ఓటర్లలో 45 శాతం బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్పగా, 26.1 శాతం కాంగ్రెస్కు వేస్తామన్నట్టు సర్వే నివేదిక పేర్కొన్నది. 36-50 ఏండ్ల మధ్య వారిలో బీఆర్ఎస్కు 44.7 శాతం ఆదరణ ఉంటే కాంగ్రెస్కు 33.8 శాతం ఉందని విశ్లేషించింది. కాగా, అభ్యర్ధుల ఖరారు.. ముఖ్య నేతల ప్రచారం.. పోటీలో ఎవరెవరు నిలుస్తారనే అంశాల ఆధారంగా చివరి నిమిషంలో పబ్లిక్ మూడ్ లో కొంత మార్పులు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.