భారత్ VS పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా?

India vs Pakistan Match: ఆసియా కప్ 2025 లో భాగంగా రేపు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌తో అయినా వ్యూయర్ షిప్ వస్తుందని ఆర్గనైజర్లు భావిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ‘బాయ్‌కాట్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవాలి అంటూ టీమిండియాకు భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా, భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దెబ్బతిన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అభిమానులు, విశ్లేషకులు ఈ బహిష్కరణ డిమాండ్‌ను బలంగా ముందుకు తెస్తున్నారు. కొందరు ఈ మ్యాచ్ ఆడటం ద్వారా రెండు దేశాల మధ్య సామరస్యం పెరుగుతుందని వాదిస్తుండగా, మరికొందరు రాజకీయ కారణాల వల్ల ఇటువంటి మ్యాచ్‌లు ఆడటం సమంజసం కాదని భావిస్తున్నారు. గతంలో 2019లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా ఇలాంటి బహిష్కరణ డిమాండ్‌లు వచ్చాయి, కానీ ఆ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగింది.

ఇక ఈ విషయంపై బీసీసీఐ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. తాము కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటామని పేర్కొంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లొద్దు అంటే వెళ్లలేదని.. కానీ, ఇప్పుడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆడుతున్నట్లు పేర్కొంది. తామేమి పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదని కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ మ్యాచ్‌ల చుట్టూ ఉన్న వివాదం భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు చూపిన ప్రతిస్పందనతో ముడిపడి ఉంది. పాకిస్థాన్ ఆటగాళ్లలో అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అశ్రఫ్ వంటి వారు భారత సైన్యాన్ని, భారతదేశాన్ని సామాజిక మాధ్యమాలలో అవమానకరమైన పోస్ట్‌ల ద్వారా ఎగతాళి చేశారు.

ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఆగడం అనుమానమే. ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడు పోలేదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌ను యథావిధిగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బీసీసీఐ కూడా తాము కేంద్రం చెప్పినట్లే చేస్తున్నామంటూ పేర్కొంది. ప్రేక్షకులు లేకపోయినా ఈ మ్యాచ్ జరగడం ఖాయంగానే అనిపిస్తుంది.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లను దంచి కొట్టాలి. అలా ఇలా కాదు.. కొడితే బౌలింగ్ చేయడం మర్చిపోవాలి. ఆ ఇద్దరిని కొడితే పాకిస్తాన్‌లో వాగుతున్న అఫ్రిది గూబ గుయ్యిమనాలి. అలా కొట్టాలి.

పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌ను స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల క్యాంపులను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా భావోద్వేగంతో కూడుకున్న ఆపరేషన్. ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన స్త్రీ మూర్తుల కన్నీటి బొట్టులను తుడిచేందుకు చేసిన ఆపరేషన్. అయితే పాకిస్తాన్‌ క్రికెట్ జట్టులో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఆపరేషన్‌ సింధూర్‌ను అవమానించారు. అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న పాకిస్తాన్ జట్టులో ఉన్న అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అశ్రఫ్‌లు భారత సైన్యాన్ని, భారతదేశాన్ని సామాజిక మాధ్యమాలలో అవమానకరమైన పోస్ట్‌ల ద్వారా ఎగతాళి చేశారు. ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కూడా భారత్‌పై విషం కక్కుతూ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.

ఏ దేశమైనా ఇటువంటి చర్యలను సహించదు,భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, భారత ఆటగాళ్లు తమ దేశాన్ని బహిరంగంగా అవమానించిన ఆ ఆటగాళ్లతోనే మైదానంలో తలపడాల్సి రావడాన్ని భారత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. India vs Pakistan Match.

అయినప్పటికీ పాకిస్తాన్‌తో ఆడాల్సి వస్తుంది కాబట్టి. మ్యాచ్‌లో అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అశ్రఫ్‌లను ఒక రేంజ్‌లో దంచి కొట్టాలి. వారి బౌలింగ్‌ను చీల్చి చెండాడాలి. వీరిద్దరిపై మైదానంలో ప్రతీకారం తీర్చుకుంటే.. పాకిస్తాన్‌లో ఉన్న అఫ్రిది గూబ గుయ్యిమనాలా భారత్ ఆడగాళ్లు ఉండాల్సిందే.