
Radhika Yadav Murder Case: ఆడవారు ఏ విషయంలోనూ మగవారిని మించిపోకూడదా..? అసలు మగవారి సంపాదనపైనే ఆడవారు బతకాలా..? అలాకాకుండా ఆడవారి సంపాదనపై మగవారు బతికితే తప్పేంముంది..? పితృస్వామ్య సమాజం మహిళల ఆర్థిక ఆధిక్యాన్ని ఎందుకు తట్టుకోలేకపోతోంది..? గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య కేసులో మగ ఆధిపత్య ధోరణి ఉందని ఎందుకు అనిపిస్తోంది..? మహిళలు స్వతంత్రంగా జీవిస్తే మగవారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు..? రాధిక యాదవ్ హత్య ఏం తెలియజేస్తోంది..?
రాధిక యాదవ్, 25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి, హర్యానాలో డబుల్స్‌లో ఐదో ర్యాంక్‌లో ఉంది. నవంబర్ 2024లో ఆమె ఐటీఎఫ్ మహిళల డబుల్స్ ర్యాంకింగ్‌లో 113వ స్థానాన్ని సాధించింది, ఇది ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్. మంచి భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయి జీవితం తండ్రి చేతిలోనే బలైంది. అతి కిరాతకంగా కూతురిని రాధిక యాదవ్ తండ్రి కాల్చి చంపేశాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మొదట క్షణికావేశంలో చేసిన హత్య అని భావించినా .. తర్వాత ఇది మాగాధిపత్య సమాజం ప్రేరేపతి హత్యగా భావిస్తున్నారు.
ఈ హత్య గురించి తెలుసుకోవాలంటే ముందు రాధిక గురించి తెలుసుకోవాలి.. అమె గురుగ్రామ్‌లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 2018లో కామర్స్‌లో 12వ తరగతి పూర్తి చేసింది. చిన్న వయస్సు నుంచే టెన్నిస్‌లో ఆసక్తి చూపింది. ప్రముఖ ఆటగాళ్లతో ఆమె టోర్నమెంట్లలో పోటీపడింది. ఇండోర్, కౌలాలంపూర్‌లో ఈ ఏడాది ఆమె క్వాలిఫైయింగ్ ఈవెంట్లలో పాల్గొంది. రెండేళ్ల క్రితం భుజం గాయం కారణంగా ఆమె ఆట నుంచి తాత్కాలికంగా విరమించి, గురుగ్రామ్‌లో టెన్నిస్ అకాడమీని ప్రారంభించి, యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చింది. రాధిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసేది, ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. జూలై 10న గురుగ్రామ్‌లోని తన ఇంట్లో రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు.
పోలీసుల కథనం ప్రకారం, రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం వల్ల తండ్రి-కూతురు మధ్య వివాదం నడుస్తోంది. దీపక్ యాదవ్, తన కూతురు ఆదాయంతో జీవిస్తున్నాడని వజీరాబాద్ లో స్థానికులు అతడిని ఎగతాలి చేసేవారు. అమ్మాయి సంపాదనతో ఎలా ఉంటావు అని వెక్కిరించేశారు. ఈ అవమానం దీపక్ ఈగోను హర్ట్ చేసింది. రాధిక తన అకాడమీ ద్వారా సంవత్సరానికి రూ.15 లక్షల ఆదాయాన్ని దీపక్ పొందేవాడు, అయినప్పటికీ రాధిక అకాడమీని మూసివేయాలని ఒత్తిడి చేశాడు. రాధిక మాత్రం తన తండ్రి తన కెరీర్‌కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేశాడని, యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఆ డబ్బును తిరిగి సంపాదిస్తానని చెప్పేది. దీంతో తండ్రి రాధికపై కోపం పెంచుకున్నాడు. ఓ పక్క ఊర్లో అవమానం… దీనికి తోడు రాధిక ఇన్ స్టా గ్రామ్ రీల్స్ అతడికి మరింత కోపం తెప్పించాయి. దీనికి తోడు ఇటీవల రాధిక.. ఇనామ్ ఉల్ హక్‌తో కలిసి నటించిన కర్వాన్ అనే సంగీత వీడియోపై కూడా దీపక్ మండిపోయాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలని ఒత్తిడి చేశాడు. దీనికి అమె అంగీకరించలేదు. దీంతో హత్యకు పథకం రచించాడు. Radhika Yadav Murder Case.
జూలై 10 .. ఉదయం 10:30 గంటల సమయంలో రాధిక తన తల్లి మంజు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వంటగదిలో ప్రత్యేకమైన వంటకం సిద్ధం చేస్తుండగా, దీపక్ యాదవ్ ఆమెపై లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆటోప్సీ నివేదిక ప్రకారం, నాలుగు బుల్లెట్లు రాధిక వీపులో, ఒక బుల్లెట్ భుజంలో తగిలాయి. దీపక్ తన కొడుకును బయటకు పంపి, రాధికతో ఒంటరిగా ఉన్న సమయంలో పథకం ప్రకారం కాల్పులు జరపాడు. గన్‌షాట్ శబ్దం విన్న రాధిక మామ కులదీప్ యాదవ్, అతని కొడుకు పియూష్ యాదవ్ వెంటనే పై అంతస్తుకు చేరుకొని, రాధికను ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీపక్ యాదవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, హత్యలో ఉపయోగించిన రివాల్వర్, ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు
గురుగ్రామ్ పోలీసులు ఈ కేసులో దీపక్ యాదవ్‌ను ఒక రోజు పోలీసు కస్టడీకి, ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దీపక్ తన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు, తన గ్రామంలో ఎదురైన అవమానాలు, సామాజిక ఒత్తిడి కారణంగా గత 15 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపానని, డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పాడు. రాధిక తల్లి మంజు యాదవ్, హత్య సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ, జ్వరంతో గదిలో విశ్రాంతి తీసుకుంటున్నానని, గన్‌షాట్ శబ్దాలు విన్నానని, కానీ హత్య గురించి ఏమీ తెలియదని పోలీసులకు చెప్పింది. పోలీసులు తల్లి మంజు యాదవ్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు, ఆమెకు హత్య గురించి ముందస్తు సమాచారం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పరువు హత్య, ప్రేమ వ్యవహారాలు లేవని పోలీసులు తెలిపారు. కేవలం ప్రధానంగా టెన్నిస్ అకాడమీ, సామాజికంగా అవమానంతోనే తండ్రి ఈ హత్య చేశాడని తేల్చారు. రాధికను షార్ట్స్ ధరించడం, అబ్బాయిలతో మాట్లాడడం, స్వతంత్రంగా జీవించడం వల్ల ఆమె తండ్రి ఆమెను ఎప్పుడూ తిట్టేవాడని, ఆమె జీవితాన్ని నరకంగా మార్చాడని రాధిక స్నేహితురాలు ఒకరు ఆరోపించారు.
అయితే రాధికా యాదవ్ హత్యను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ హత్యను ఖండిస్తూ, రాధిక యాదవ్ తన సొంత కాళ్లపై జీవించాలని అనుకోవడం వల్లే ఆమె తండ్రి ఆమెను చంపాడు. ఇది నేరం మాత్రమే కాదు, మహిళల స్వాతంత్య్రానికి, సాంప్రదాయ నిబంధనలను సవాలు చేసే వారికి సమాజం నుంచి ఎదురుతోన్న అణచివేత. మహిళా క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని.. వారికి ఆంక్షలు విధించకూడదని ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా అన్నారు. రాధిక హత్యపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మహిళా క్రీడాకారులకు ఎదురవుతోన్న అవమానాలు.. అణచివేతలపై ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు.
ముఖ్యంగా రాధిక యాదవ్ హత్య కేసు సమాజంలో లింగ సమానత్వం, మహిళల స్వాతంత్ర్యం, సాంస్కృతిక నిబంధనలపై తీవ్ర చర్చను రేకెత్తించింది. ఈ కేసు పితృస్వామ్య మనస్తత్వం, ఈగో వల్ల పరిణామాలను రాధిక యాదవ్ హత్య కేసు భారత క్రీడా, సామాజిక చరిత్రలో ఒక విషాదకర ఘటనగా నిలిచింది. గురుగ్రామ్ పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు, దీపక్ యాదవ్ మానసిక ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.