12 లైన్స్ రోడ్.!

Telangana 12 lines Road: బీఆర్ఎస్ పార్టీ, నేతలు ఏదైతే వేస్ట్ అని విమర్శిస్తారో.. దాన్నే చేసి చూపించాలని పంతం పడతారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫ్యూచర్ సిటీ అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శిస్తూనే ఉన్నారు. ఊహల పల్లకీ అంటున్నారు. ఐతే.. సీఎం రేవంత్ మాత్రం.. ఎప్పటికప్పుడు దాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు 12 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక అలైన్‌మెంట్‌ను తెలంగాణ సర్కార్ సమర్పించింది. ఈ హైవే అమరావతి మార్గంలో సాగుతుంది. రెండు రాష్ట్రాల్లో 5 జిల్లాలు, 100 గ్రామాల్ని కవర్ చేస్తూ సాగుతుంది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే మాత్రం.. ఇది చాలా పెద్ద హైవే అవుతుంది. ఏకంగా 12 లేన్లంటే మాటలు కాదు.

అయితే ఈ హైవే పొడవు సుమారు 297 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 118 కిలోమీటర్లు, ఏపీలో 180 కిలోమీటర్లు ఉండొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ మధ్య హైవే ఉన్నా.. అది చిన్నది, పైగా అందులో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. ఈ కొత్త హైవే వస్తే.. హైదరాబాద్-విజయవాడ మధ్య దూరం బాగా తగ్గుతుంది. ఈ హైవే.. తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ ఉపయోగపడేలా పైకి కనిపిస్తున్నా… సీఎం రేవంత్ ప్లాన్ వేరే ఉంది. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ సిటీగా మార్చాలంటే.. దానికి పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. అలా ఉంటే.. అక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలు.. తమ ఉత్పత్తుల్ని.. వేగంగా బందరు పోర్టుకి తరలించి.. అక్కడి నుంచి సముద్ర మార్గాల్లో ఇతర దేశాలకు పంపగలవు. ఇలా సీఎం రేవంత్ భారీ ప్లాన్ వేశారు.

అంచనాల ప్రకారం ఈ హైవే తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సాగుతుంది. ఏపీలో కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సాగుతుంది. ఈ హైవే వస్తుందంటే.. ఏపీ సర్కార్ ఏమాత్రం అడ్డుకోదు. ఎందుకంటే ఈ హైవే నిర్మాణంతో ఏపీకి చాలా లాభాలుంటాయి కాబట్టి. అందులోనూ కూటమి సర్కార్ ఏపీలో ఉంది కాబట్టి.. దీన్ని ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం కోరినా కోరవచ్చు. అందులోనూ సీఎం రేవంత్, సీఎం చంద్రబాబు మధ్య సఖ్యత ఉంది కాబట్టి.. కేంద్రం దీన్ని ఆమోదించడం పెద్ద విషయమేమీ కాదు. గ్రీన్ సిగ్నల్ వస్తే.. వెంటనే DPR రెడీ చేయించే పనిని తెలంగాణ సర్కార్ చూసుకుంటుంది. Telangana 12 lines Road.

దీన్ని కేంద్రం ఆమోదించినా… డీపీఆర్, ప్లాన్ రెడీ చెయ్యడం, భూ సేకరణ, హైవే నిర్మాణం ఇవన్నీ వెంటనే అయ్యేవి కావు. అంటే.. 2028 నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పటికల్లా ఈ హైవేకి సంబంధించి కనీసం కొంతైనా రూపురేఖలు తేవగలిగితే.. లేదా.. ఇది ఒకటి నిర్మింపజేస్తున్నాం అని ప్రజలకు చెప్పగలిగితే.. అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందనే నమ్మకం ప్రజలకు కలగగలదు. కానీ.. అలా ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోతే మాత్రం అది బీఆర్ఎస్‌కి ప్లస్ అవ్వగలదు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ఓ కల మాత్రమే అంటున్న బీఆర్ఎస్.. ఈ హైవే కూడా ఉత్తుత్తి ప్రకటనే అని ప్రచారం చేసే ఛాన్స్ పొందగలదు.