హైదరాబాద్‌లో బీచ్.!

Hyderabad Kothwalguda Beach: సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్‌కో లేదా ఏ ఆర్ కే బీచ్ కో వెళ్లనక్కర్లేదు. ఆ బీచే స్వయానా హైదరాబాద్ కు రాబోతోంది. అచ్చంగా సముద్రం, తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మించనున్నారు. ఇది మ్యాన్ మేడ్ బీచ్ గా రికార్డు నెలకొల్పబోతోంది. అవును ఇది నిజం…ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో అద్భుతమైన వాతావరణం ఉంటుంది. చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రకరకాల సంస్కృతులకు నిలయం. అంతా బాగానే ఉన్నా.. సముద్రం లేదు అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. ఈ కారణంగా.. చాలా మంది వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి ఏపీలోని సూర్య లంక బీచ్‌కి వెళ్తున్నారు. ఇవన్నీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సముద్ర తీరం లేని లోటును భర్తీ చేసేందుకు కాకతీయ రాజులు చెరువులను సముద్రాలుగా నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు.

ఇది జరిగే పనేనా అని కొంతమందికి అనిపించవచ్చు. ఇది సాధ్యమే. ప్రపంచంలో చాలా దేశాలు.. కృత్రిమ బీచ్‌లు ఏర్పాటు చేశాయి. అలలు కూడా వచ్చేలా చేశాయి. మరి ఎక్కడెక్కడో చేయగలిగినప్పుడు.. తెలంగాణలో ఎందుకు చెయ్యలేరు? చెయ్యగలరు. కాకపోతే.. ఇలాంటి ప్రాజెక్టులు అంత వేగంగా పూర్తవ్వవు. దాంతో క్రమంగా ఆసక్తి తగ్గిపోయి, ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉందని తెలుస్తోంది. రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ కృత్రిమ బీచ్‌ను ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా నిర్మించనుంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొత్వాల్ గూడలో పర్యావరణ అనుకూల పరిస్థితులు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతం ఎంపికైంది.

ఇప్పుడు రాష్ట్ర పర్యాటక శాఖ… హైదరాబాద్ శివారులో అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించి, దాని చుట్టూ బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కొత్వాల్ గూడ దగ్గర 35 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.225 కోట్ల పెట్టుబడితో పనులు డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.

ఈ బీచ్ చుట్టూ స్టార్ హోటళ్లు, పార్కులు, జలక్రీడలు, జాగింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ జోన్‌లు, అలంకార ఫౌంటైన్‌లు, వేవ్ పూల్, సెయిలింగ్ క్లబ్‌లు, ఫ్లోటింగ్ విల్లాస్, ఫుడ్ కోర్టులు, థియేటర్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, బంగీ జంప్, స్కేట్ బోర్డ్, పిల్లల కోసం ఆధునిక ఆటస్థలాలు, సాహస కార్యకలాపాలు, శీతాకాల క్రీడల వేదికలు కూడా నిర్మించే ప్రణాళిక ఉంది.

రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దీనిపై కొన్ని వివరాలు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.225 కోట్లుగా అంచనా వేసినప్పటికీ, అంతర్జాతీయ సంస్థలు ఇంకా అధిక పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కృత్రిమ బీచ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా రూపొందుతుందనీ, హైదరాబాద్‌ను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, అడ్వెంచర్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఫ్లోటింగ్ విల్లాలు, స్టార్-కేటగిరీ హోటళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. Hyderabad Kothwalguda Beach.

అంటే.. ఇది జస్ట్ బీచ్ మాత్రమే కాదు. అన్ని రకాల ఎంజాయ్‌మెంట్లకూ కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటుంది. వీకెండ్ రాగానే.. ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసేలా ఈ ప్లాన్ ఉంది. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తామంటోంది. ఇది జరగాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే…

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q