దాసరి వినయ్ భాస్కర్ పరిస్తితి ఏంటి?

Dasari Vinay Bhaskar: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత ఆయన. సమైక్య పాలనలో తెలంగాణ ఆకాంక్షను అసెంబ్లీ సాక్షిగా వినిపించిన నేత. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన ఆయన, ఇప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారట.

దాస్యం వినయ్ భాస్కర్. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి వరుస విజయాలు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమకారులకు పెద్ద దిక్కుగా మారారు. జిల్లాలో విద్యార్ధి నేతలను ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక తెలంగాణ గడ్డపై పుట్టిన మహనీయుల సాక్షిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఒకానొక సమయంలో వినయ్ భాస్కర్ ను ఓడించాలంటే ఇతర పార్టీల్లో అభ్యర్ధులు లేక ఇతర నియోజకవర్గాల నుండి నేతలను పోటీలో దింపేవారంటే ఆయన ఎంతలా ప్రజల్లో మమేకం అయ్యారో అర్థం అవుతుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూశారు వినయ్ భాస్కర్.

2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజులపాటు సైలెంట్ గా ఉన్న వినయ్ భాస్కర్ ఆ మధ్య జరిగిన నయీంనగర్ నాలా నిర్మాణంలో క్రెడిట్ తనకే దక్కుతుందంటూ హంగామా చేశారు. ఆ తర్వాత కూడా అడపా దడపా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. బిఆరెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం తనవంతు కృషి చేసినా కూడా హనుమకొండ జిల్లా వరకు మాత్రమే పరిమితం అయ్యారు. ఐతే గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి బిఆరెస్లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే అగ్రనాయకులతో పరిచయాలు పెంచుకుని పలు సమస్యలపై తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన రాకేష్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన అగ్రనాయకుల దృష్టిని ఆకర్షించారు. గ్రూప్ వన్ బాధితుల పక్షాన గళమెత్తిన రాకేష్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు, యూరియా కొరత, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై సెటైర్లు వేస్తూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అండతో బిఆరెస్ లో చేరిన రాకేష్ రెడ్డి ఓ వైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సైలెంటుగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు రాష్ట్ర నేతలు కేటీఆర్,హరీష్ రావు అండతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగాడని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడుతూ అధిష్టానం మన్ననలు పొందుతుంటే వినయ్ భాస్కర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా కేవలం నియోజకవర్గానికే పరిమితం అయ్యారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎప్పుడూ వచ్చామా అని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఓ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు పార్టీలో చేరి రెండేళ్లు కూడా పూర్తికాకముందే అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు కు అత్యంత సన్నిహితంగా మెదులుతున్నారట వినయ్ భాస్కర్. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తరచుగా పర్యటిస్తూ కార్యకర్తల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారట .రాకేష్ రెడ్డి బీజేపీలో ఉన్న సమయంలో వినయ్ భాస్కర్ మీద పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అదే పార్టీలో చేరి వినయ్ భాస్కర్ కు ఏకు లా వచ్చి మేకు లా తయారయ్యాడని బిఆరెస్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. రాకేష్ రెడ్డితో భవిష్యత్తులో ముప్పు తప్పదని భావించిన వినయ్ భాస్కర్, తన అనుచరులు చేయి దాటిపోకుండా జాగ్రత్త పడుతుంటే రాకేష్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక క్యాడర్ ను నిర్మించుకొని ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు అండతో దూసుకెళ్తున్న రాకేష్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్న వినయ్ భాస్కర్ కు తన అన్న కొడుకు అభినవ్ భాస్కర్ రూపంలో కూడా ముప్పు పొంచి ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. Dasari Vinay Bhaskar.

గత గ్రేటర్ ఎన్నికల్లో తన అనుచరులకు బీజేపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్న రాకేష్ రెడ్డి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరోవైపు అభినవ్ భాస్కర్ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికల కోసం లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉండగా వినయ్ భాస్కర్ మాత్రం కేవలం నియోజకవర్గంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారట. ఓ వైపు రాకేష్ రెడ్డి మరో వైపు అన్న కొడుకు అభినవ్ భాస్కర్ ను ఎలా నిలువరించాలా అని వినయ్ భాస్కర్ లోలోపల మదన పడుతున్నారట. గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తన సొంత డివిజన్ ను అభివృద్ధి చేసుకోలేదని విమర్శలు కూడా వినయ్ భాస్కర్ ఎదుర్కొంటున్నాడు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వినయ్ భాస్కర్ భవిష్యత్ ఎలా అని ఆలోచనలో పడ్డారని ఇన్ సైడ్ టాక్.