
Jack Dorsey Bitchat: ట్విటర్ మాజీ సీఈవో అయిన జాక్ డోర్సే టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడమే కాక ఇప్పుడు సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్ ను.. అందులోనూ ఇంటర్నెట్ లేకుండా ఆఫ్ లైన్ లో పనిచేసేలా వినూత్నంగా ఒక సరికొత్త ఆవిష్కరణను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అదే బిట్ చాట్.. ఇంటర్నెట్ అవసరం లేకుండా మెసేజ్లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే..
బిట్ చాట్ అనేది బ్లూటూత్ తో పనిచేసే పీర్-టు-పీర్ సిస్టమ్. సర్వర్లతో అసలు దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్ లో ఉంటే చాలు. ఈ యాప్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటే కేవలం బ్లూటూత్ ఆన్ చేసి మెసేజీలు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ అవాంతరాలు, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో.. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలున్న చోట దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టు మెసేజ్ కి మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు. కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. బ్లూటూత్ తో పనిచేసే ఈ యాప్ రిసివర్ సమీపంలో లేకున్నా మెసేజ్ వెళ్తుంది. ఈ మెథడ్ ను మెష్ రూటింగ్ అంటారు. అలానే ఈ యాప్ లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి పర్సనల్ యూజర్ వివరాలు ఇవ్వాల్సినవసరం లేదు. Jack Dorsey Bitchat.
ఇది పీర్ టు పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్ వర్క్ లోని యూజర్ టు యూజర్ ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇందులోని గ్రూప్ చాట్స్ ను రూమ్స్ అంటారు. ఇవి పాస్వర్డ్ తో సేఫ్ గా ఉంటాయి. హ్యాష్ ట్యాగ్ లతో పేర్లు, పాస్వర్డ్ లతో సెక్యూర్ చేయవచ్చు. యాప్ ను ఇన్స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు. తర్వాత బై డిఫాల్ట్ గా మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా ఈజీగా చాట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ లో టెస్ట్ ఫ్లైట్ మోడ్ లో ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.