
Driverless Busses in Hyderabad: మన దేశంలో డ్రైవర్ లెస్ వాహనాలు లేవని అనుకుంటారు. కానీ హైదరాబాద్‌లోనే ఉన్నాయండో. అవును ఇది నిజం. అవి ఇక్కడే రెడీ అవుతున్నాయి. డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేశాయి. అయితే ప్రజలకింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో ఈ బస్సులను వినియోగిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం టెక్నాలజీని ఉపయోగించి ఈ డ్రైవర్ రహిత బస్సులను తయారు చేశారు. ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఇవి ఐఐటీ క్యాంపస్‌లో రోజువారీ సేవలు అందిస్తున్నాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ లెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది.
ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ లేకుండా నడుస్తాయి. రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ , అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌లతో నడుస్తున్నాయి. ఇవి అడ్డంకులను గుర్తించడం, సురక్షిత దూరాన్ని నిర్వహించడం , స్పీడ్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. 90 శాతం సంతృప్తి రేటింగ్‌తో సానుకూల స్పందనను పొందాయి. ఈ డ్రైవర్ లెస్ బస్సుల షటిల్ సర్వీస్ రోజుకు ఆరు సార్లు నడుస్తుంది. ఉదయం మూడు సార్లు, మధ్యాహ్నం మూడు సార్లు, క్యాంపస్ లోపల విద్యార్థులు , సిబ్బందిని డ్రాప్ చేస్తుంది. ఈ రెండు బస్సులు ఇప్పటికే 15,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. ఈ ప్రాజెక్టు టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 9 సాధించింది, అంటే ఇది నిజ-ప్రపంచ పరిస్థితుల్లో పరీక్షలు విజయంతంగా పూర్తి చేసిందన్నమాట
ప్రస్తుతం ఈ బస్సులు క్యాంపస్ పరిధిలో మాత్రమే నడుస్తున్నాయి, కానీ విమానాశ్రయాలు, పెద్ద విద్యా సంస్థలు, పరిశ్రమల సైట్‌ల వంటి నియంత్రిత వాతావరణాల్లో ఈ బస్సులను ఉపయోగించే అవకాశాలను అన్వేషిస్తున్నారు. భారత రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి TiHAN డేటా సేకరణ, పరీక్షలను కొనసాగిస్తోంది. Driverless Busses in Hyderabad.
సుమారు 90 శాతం మంది ప్రయాణికులు ఈ నూతన విధానంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని టీహన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాంపస్ పరిధిలో నడుస్తున్న ఈ బస్సులు, భవిష్యత్తులో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.