కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నేతల పరిస్తితి.?!

Kothagudem Congress leaders: అక్కడ ఆ పార్టీకి నేతలు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఆఫీసులు కూడ పెట్టుకుని కార్యక్రమాలు చేశారు. అది ఎన్నికల ముందు మాట. ఆనాడు గంపెడు మంది సీటు కోసం ట్రై చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు వేరే పార్టీకి వెళ్లింది. దీంతో నేతలు అంతా చెల్లాచెదురయ్యారు. సొంత పార్టీ కార్యాలయాలు ఎత్తివేశారు. ఇదీ కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్తితి.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే ఇక్కడ అడపా దడపా పార్టీ ఓడిపోయినా, అంతా స్వయంకృతాపరాధం మాత్రమే. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు వచ్చిందంటే చాలు ఇక్కడ హస్తం పార్టీ టిక్కెట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. మొన్నటి ఎన్నికల్లో కూడ అదే జరిగింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐకి సీటు దక్కించుకుంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ సిపిఐని గెలిపించింది. ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు సీపీఐ పావులు కదుపుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఆధిపత్యం కొనసాగేలా సిపిఐ పావులు కదుపుతుందట. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఎన్నిలక ముందు హడావుడి చేసిన నేతలు, ఇప్పుడు తలోదిక్కు వెళ్లి పోవడంతో, ఏం చేయాలో దిక్కుతోచడం లేదట.

ఎన్నికల ముందు కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ కోసం నలుగురు పొటీ పడ్డారు. ఈ నలుగురూ సొంతంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో మాజీ ఎంఎల్సీ పోట్ల నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు భట్టి విక్రమార్క కూడ మద్దతు ఇచ్చారు. కానీ టిక్కెట రాలేదు. అయినప్పటికి ఇప్పుడు కార్పొరేషన్ పదవిని ఆశిస్తన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మోతుకూరి ధర్మారావు, నాగ సీతారాములు, యడవెళ్లి కృష్ణ కూడా ఎన్నికల సమయంలో టిక్కెట్ ఆశించినవారే. సొంతంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, పార్టీ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లిన వారే. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఎవరిదారి వారిదన్నట్లు ఉన్నారు. సొంత ఆఫీసులు కూడా మూసేశారు.

ఇప్పుడు కొత్తగూడెంలో కేవలం డిసిసి కార్యాలయం మాత్రమే అందరికీ దిక్కు అయింది. ఎన్నికల ముందు డిసిసి కార్యాలయంతో పాటుగా నాలుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు జనంతో కళకళ లాడాయి. డీసీసీ ఆఫీసుకు ఎవ్వరు, ఎప్పుడు వస్తారో అర్ధం కాని పరిస్థితి ఉంది. అడపాదడపా మాత్రమే అందరు డిసిసి కార్యాలయానికి వస్తున్నారట. కొసమెరుపు ఏంటంటే, ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం ముందు , బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపిస్తే నలుగురు నాలుగు టెంట్లు వేసి నిరసనలకు దిగేవారు. కానీ ఇప్పుడు ఆ జోష్ ఏమాత్రం కనిపించడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. Kothagudem Congress leaders.

Also Read: https://www.mega9tv.com/telangana/kavitha-realize-what-was-causing-her-political-and-family-problems-according-to-architecture/