ఎమ్మెల్యేల వివరణ…!!

Congress MLA’s Oath Taking: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం ఆదేశాల తరువాత స్పీకర్ తన కార్యాచరణ వేగవంతం చేసారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారు తాజాగా స్పీకర్ నోటీసులకు తమ సమాధానం ఇచ్చారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయం గా ఉత్కంఠ పెంచుతోంది.

పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని ఈ మేరకు సభాపతి నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ పంపించారు. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని..బీఆర్​ఎస్​కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. పైగా అది కాంగ్రెస్‌ పార్టీ కండువా కాదని అని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వీరి సమాధానాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

తాము పార్టీ మారలేదని, బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్​ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. స్పీకర్‌ కార్యాలయం నుంచి తాఖీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం.

తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్‌ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది. ప్రధానంగా తాము పార్టీ మారలేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నామని పైగా అది కాంగ్రెస్‌ పార్టీ కండువా కాదని అని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన వివరణలో తానూ ఇప్పటికీ బీఆర్​ఎస్​ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని మా ఇంట్లో, కార్యాలయంలోనూ కేసీఆర్‌ ఫొటో ఉంటుందని తెలిపినట్లు సమాచారం. తన ట్విటర్‌ హ్యాండిల్‌లోనూ బీఆర్​ఎస్​ అనే ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లుగా కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశానని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి తాను పార్టీ మారలేదని చెప్పానని సంబంధిత ఫిర్యాదు కాపీని, కేటీఆర్‌ను కలిసిన ఫొటోను జతపర్చుతూ స్పీకర్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలను ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పంపారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వివరణను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌ల వివరణలను డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌ల వివరణలను జగదీశ్‌రెడ్డికి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్యల సమాధానాలను చింతా ప్రభాకర్‌కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందేటట్లుగా స్పీకర్‌ ఏర్పాట్లు చేశారు.

సుప్రీంకోర్టుకు తాము సమాధానం ఇవ్వాల్సి ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోకుండా మూడు రోజుల్లోగా వీటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ సూచించారు. కడియం శ్రీహరి నుంచి వివరణ వచ్చాక కేపీ వివేకానందకు, దానం నాగేందర్‌ నుంచి వచ్చే సమాధానాన్ని పాడి కౌశిక్‌రెడ్డికి స్పీకర్‌ పంపే అవకాశం ఉంది. Congress MLA’s Oath Taking.

పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలిచ్చిన వివరణలను బీఆర్​ఎస్​ లీగల్‌ సెల్‌ పరిశీలనకు పంపింది. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫొటోలు, వీడియోలు, పత్రికా కథనాలు ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. స్పీకర్‌ నిర్దేశించిన గడువులోగా ఈ 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాలను వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్​ఎస్​ వర్గాలు తెలిపాయి. సభాపతి నుంచి లేఖలు అందడంతో 13వ తేదీలోగా తమ అభ్యంతరాలను పంపేందుకు బీఆర్​ఎస్​ పార్టీ సన్నద్ధమవుతోంది.