ఢీ అంటే ఢీ..!

Pocharam vs Eanugu Ravinder Reddy: ఓవైపు సమన్వయ యాత్ర మరోవైపు వర్గ పోరు.. ఇన్చార్జి మంత్రి సీతక్క సాక్షిగా రెండువర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోచారం చేరిక నుండి బాన్సువాడలో వర్గపోరు మొదలైందట. పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్న చందంగా రాజకీయం నడుస్తోందట.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రోడ్డెక్కింది. ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు బాహాబాహీకి దిగేదాకా పోతోందట. గతంలో వర్నిలో రెండు వర్గాలు కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదవ్వడం జరిగింది. ఆరు నెల్ల క్రితం పోచారం ఓ సమావేశంలో ఏనుగు రవీందర్ పై మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. అందుకు ఏనుగు బదులిచ్చిన తీరు పోచారానికి షాక్ నిచ్చింది. రవీందర్ రెడ్డి బాన్సువాడలో ఎందుకు ఉంటున్నారన్న పోచారం, అతను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదంటూ తనకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన రవీందర్ రెడ్డి, వాళ్లిద్దరూ చెప్పింది నిజమైతే దేవుడి ముందు ప్రమాణం చేయాలంటూ ఎదురు దాడికి దిగారు. అంతేకాదు, తాను బాన్సువాడలోనే ఉంటానని, అవసరమైతే ఎక్కడైనా తేల్చుకుందామంటూ తేల్చేశారు.

ఇక వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్న సమయంలోనే నామినేటెడ్ పోస్టుల లొల్లి మొదలైంది. ఎవరికి వారే తమ అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించటానికి నానాయాగీ చేశారట. ఆ తర్వాత చందూర్ మండల కేంద్రంలో సమీకృత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి అనుచరులను రాకుండా పోచారం వర్గం అడ్డుపడింది. మంత్రి సీతక్క ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ విషయం పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు సరికదా, కనీసం ఇద్దరినీ పిలిచి మాట్లాడలేదన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జనహిత పాదయాత్ర సమయంలో కూడా పార్టీ పెద్దల సాక్షిగా ఏనుగు, పోచారం వర్గాల మధ్య పోరు ఏమాత్రం ఆగలేదట.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస రెడ్డి వచ్చినప్పటి నుంచీ ఈ వర్గపోరుకు బీజం పడిందట.పార్టీలో చేరిన రోజే బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జీ ఏనుగు రవీందర్ వర్గం పోచారంపై మాటల దాడి చేసింది. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి ఇక పోచారంపై సమరానికి సై అన్నారట నాటి నుంచి మొన్నటి చందూర్ మండల సమీకృత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నాటికి కొనసాగుతూనే ఉంది. పాలన వ్యవహారాల్లోనూ ఇద్దరు తమ పంతం నెగ్గించుకునేందుకు వెనకాడడం లేదు. రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరి మధ్య మొదలైన పోటీ, ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందట. Pocharam vs Eanugu Ravinder Reddy.

కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే స్థానిక నేతలతో రాజీ చేసుకున్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే ఏనుగు రవీందర్ రెడ్డితో మాత్రం ఢీ అంటే ఢీ అన్న చందంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందట. అంతేకాదు, జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా పోచారం చేరిక మీద పెదవి విరిచారట. మొత్తానికి బాన్సువాడ కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/telangana/jagadish-reddy-nalgonda-district-separate-politics-is-being-promoted-in-each-constituency/