
Nizamabad Ministerial Post: అనుకోని సంఘటనలతో ఒక్కోసారి అదృష్టం కలిసిరావచ్చు. రాజకీయాల్లో అయితే ఎప్పుడు ఎవరికి ఏ పదవి వరిస్తుందో అర్థంకాదు. కాలం కలిసొస్తే పదవులు పరిగెత్తుకొస్తాయి. కొందరికి చేయి దాకా వచ్చి జారిపోతాయి. అలానే గత ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం షబ్బీర్ అలీకి ఉంది అనుకోకుండా బిఆర్ఎస్ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో ధీటుగా అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో తన స్థానాన్ని షబ్బీర్ అలీ త్యాగం చేసి, హుటాహుటిన నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో గెలిస్తే మంత్రి వర్గంలో మొదటి ప్రాధాన్యతతో చోటు దక్కేది. కానీ స్థానం మారడంతో షబ్బీర్ అలీ ఓటమి పాలయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్ళీ షబ్బీర్ అలీకి అదృష్టం కలిసి వచ్చింది
మంత్రి వర్గంలో ముస్లీం మైనార్టీ కోటలో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఈసారి ఒక్క ముస్లీం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందకపోవడంతో భర్తీ చేయడానికి ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిణామాలు షబ్బీర్ అలీకి కలిసొచ్చే విధంగా కనిపిస్తున్నాయి.
కల్వకుంట్ల కుటుంబ తగాదాలు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కలిసొస్తున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ లో పోలింగ్ జరగగా, 2022 జనవరి 5 న కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్ల మూడు నెలల పదవీకాలం ఉంది. రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షబ్బీర్ అలీ పూర్తి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడే ఉప ఎన్నిక జరగడం సాధ్యం కానప్పటికీ కొద్ది రోజుల తర్వాత అయినా షబ్బీర్ అలీకే అవకాశాలకు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది
ఇప్పటికే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అయితే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, మంత్రిగా పని చేసిన షబ్బీర్ లకే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం లేదు. షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా గెలిస్తే, మంత్రివర్గంలో తీసుకుంటే జిల్లాకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. జిల్లాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని ప్రతిపక్షాలను నోరు మూయించే అవకాశం ఉంటుంది
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాలంటే ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండాలి. ప్రస్తుతం ఈ పదవులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ నెలలో ప్రాదేశిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలు భర్తీ అవుతాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు 811 ఉన్నాయి. ఇందులో ఎంపీటీసీ జెడ్పిటిసి ఓటర్లు 596 గా ఉంది. ఇక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి 215 ఉన్నాయి. మొదటగా ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఎన్నిక జరగాలంటే తప్పనిసరిగా 75 శాతం ఓట్లు ఉండాలి. ఈ లెక్కన 608 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పిటిసి కలుపుకుంటే 596 మాత్రమే అవుతారు. ఈ ఓట్లు సరిపోవు. అంటే తప్పనిసరిగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాతనే ఉపఎన్నికకు ఆస్కారం ఉంటుంది. ప్రాదేశిక ఎన్నికల తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనే చర్చ జరుగుతుంది. తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం పట్టే పరిస్థితి ఉంది. Nizamabad Ministerial Post.
అయినప్పటికీ మరో రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. కల్వకుంట్ల కవిత రాజీనామా తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.