
Mass Leader Jagga Reddy: ఆ నియోజకవర్గంలోని ఓ మాస్ లీడర్ చరిష్మా మాయమవుతోందా. అన్నా అని పిలిస్తే చాలు, తానున్నానంటూ ముందుకొచ్చే ఆయన, ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన, నియోజకవర్గాన్ని వదిలేశారా. ఇంతకీ ఎవరా నేత. ఏంటా కథ. చూద్దాం.
అన్న నడిచొస్తే మాస్… అన్న నించుంటే మాస్… అన్న లుక్కేస్తే మాస్… ఈ పాట సంగారెడ్డి నేత జగ్గారెడ్డికి చక్కగా సరిపోతుంది. సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి అంటే ఓ బ్రాండ్. మాస్ లీడర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డికి సంగారెడ్డిలో అభిమానులు అధికం. వాళ్లే ఆయన్ని మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారు. Mass Leader Jagga Reddy.
సంగారెడ్డి ప్రజలంటే జగ్గారెడ్డి కూడా అభిమానమే. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారు. కానీ గత ఎన్నికల్లో ఆయనను ఓడించారన్న బాధ ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతోందట. బిఆర్ఎస్ ప్రభుత్వంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి జనం, కాంగ్రెస్ హవా నడుస్తున్న తరుణంలో ఓడించడాన్ని ఇప్పటికీ జగ్గారెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారట. ఈసారి గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని భావించిన జగ్గారెడ్డి ఆశలకు నియోజకవర్గ ఓటర్లు గండి కొట్టారన్న బాధ జగ్గారెడ్డిని కల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తన హవా నడుస్తుంటే, అధికారికంగా తనకు ఏ పోస్టు లేకపోవడంతో జగ్గన్న అసంతృప్తితో ఉన్నారట.
2023 ఎన్నికల్లో ఓడిన తర్వాత తాను సంగారెడ్డికి రానంటూ అప్పట్లో అలక పూనారు జగ్గన్న. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి, కేవలం పార్టీ క్యాడర్ కి మాత్రమే అందుబాటులో ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా మాస్ పబ్లిక్ కి , ఓటర్లకి అందుబాటులో ఉండడం లేదట. దీంతో జగ్గారెడ్డిని అభిమానించే వారితోపాటు నియోజకవర్గ ఓటర్లు ఆయన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్లో ఆదరణ, అభిమానం ఏమాత్రం తగ్గకుండా చూసుకున్న జగ్గారెడ్డి, తన పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారట. అడపాదడపా మీడియాలో కనిపించడం మినహా నియోజకవర్గంలో కనిపించడం లేదన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. ఏ పండుగైనా సంగారెడ్డిలో హవా నడిపించే జగ్గారెడ్డి ఇటీవల ఆ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. మాస్ మహారాజ్ గా పేరున్న జగ్గారెడ్డి ఎప్పుడు తమ దగ్గరకు వస్తారని సంగారెడ్డి జనం ఎదురు చూస్తున్నారట.