ఆ జిల్లాలో ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ పరిస్థితి గందరగోళం.?!

Dr. Nagam Varshit Reddy: ఆ జిల్లాలో ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. సీనియర్ లీడర్ల అంతర్గత కలహాలు, పదవుల మీద ఉన్న శ్రద్ద, పార్టీ భవిష్యత్తు మీద లేదన్న టాక్ క్యాడర్ నుండి బలంగా వినపడుతోంది. జిల్లా అధ్యక్షుణ్ణి సైతం లెక్క చేయకుండా పార్టీ లైన్ దాటి సొంత రాజకీయాలు చేస్తుండడం ఆ పార్టీ పెద్దలకు తల నొప్పిగా మారిందట. ఇంతకీ ఆ జిల్లా ఏది. పార్టీ లైన్ దాటిందెవరు. వాచ్ దిస్ స్టోరీ.

భారతీయ జనతా పార్టీకి యువత ఓటు బ్యాంకుతో కొంత పట్టున్న జిల్లాల్లో నల్గొండ జిల్లా ఒకటి. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి సీనియర్ నేతల మద్దతు సన్నగిల్లడం పార్టీ వర్గాల్లో గుసగుసలకు దారితీస్తోంది. ఒకప్పుడు ఆయనకు అండగా నిలబడిన స్థానిక సీనియర్ నేతలు బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్, పిల్లి రామరాజు, పొతెపాక సాంబయ్య వంటి కొందరు కీలక నేతలు ఇప్పుడు నాగంకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయట. అంతా తానే అన్నట్టుగా జిల్లా అధ్యక్షుడు వ్యవహరించడం ఒకటైతే, తనపై నమ్మకంతో ఉన్న శ్రేణులకు సరైన సహకారం అందించకపోవడం రెండోది. ముఖ్యంగా పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారికి సముచిత పదవులు దక్కకపోవడం, నాగంకు రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై ఒక సీనియర్ బీజేపీ నేత బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో జిల్లా బీజేపీలో అంతర్గత విబేధాలకు మరింత ఆజ్యం పోసిందని కార్యకర్తలు భావిస్తున్నారట. Dr. Nagam Varshit Reddy.

కిషన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారట నాగం వర్షిత్ రెడ్డి. ఆ తర్వాత ఈటల రాజేందర్, రాజాసింగ్ వంటి నేతల సపోర్ట్ బాగా ఉండేది. ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం జరగడంతో నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా నేతలు వెన్నంటి ఉండేవారు. అయితే సీన్ రివర్స్ అవ్వడంతో ఇప్పుడు ఆయనకు దూరం జరుగుతున్నారట. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం దిశగా చర్యలు మొదలుపెట్టారు. దీంతో జిల్లాలో కొత్త నేతలకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వర్షిత్ రెడ్డి వెంట తిరిగే కంటే రామచంద్రరావు గుడ్ లుక్సులో పడటం బెటరన్న ఫీలింగులో నల్లగొండ జిల్లా బీజేపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో జిల్లా బీజేపీలోని కొందరు నేతలపై రాష్ట్ర పార్టీ పెద్దలు దృష్టి పెట్టారట. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగే నేతల జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీ జిల్లా స్తాయిలో పదవి అనుభవిస్తూనే, మరోవైపు అధికార పార్టీతో ఉంటూ, సొంత పార్టీని దెబ్బతీస్తున్న వారి లెక్కలు కూడా తేల్చాలని అధిష్టానం డిసైడ్ అయింది. అయితే నల్లగొండ జిల్లా నేతల తీరుపై మాత్రం అధిష్టానం తలలు పట్టుకుంటోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే, జిల్లా పార్టీ నేతలు ఇప్పుడు మూడు గ్రూపులుగా చీలిపోయారన్న ప్రచారమే పార్టీ పెద్దలను చిరాకు పరుస్తోంది. పార్టీ నేతల తీరు రాబోయే స్తానిక సంస్తల ఎన్నికల్లో కేడర్ నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్న భయం పార్టీ పెద్దలను వెంటాడుతోందట.

ఇప్పుడు నల్లగొండ జిల్లా విషయంలో తెలంగాణ బీజేపీ పెద్దలకు రెండు ఆంశాలే కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. యువతనే తన బలంగా ఎంచుకుని జనంలోకి పోతున్న నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించడం ఒకటైతే, జిల్లాలోని పార్టీ సీనియర్లను సెట్ చేసి, మరో నేతను జిల్లా పదవికి ఎంపిక చేయడం రెండోది. అయితే ఈ రెండు అంశాల్లో ఏది బెడిసికొట్టినా అది జిల్లా పార్టీ మొత్తం మీద ప్రభావం చూపడం ఖాయమన్న భావనలో పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నల్లగొండ బీజేపీలో వర్గపోరు ఎప్పుడు పోతుందా, జిల్లాలో కాషాయ పార్టీకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయన్న దానిపై కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/telangana/mynampally-hanumantha-rao-decisions-are-going-to-be-a-plus-for-the-brs-party-in-the-constituency/