
Warangal MLA Nannapuneni Narender: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు అదృష్టవంతుడుగా పేరుంది. కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయ్యి ఆ తర్వాత పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు, దూకుడు రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడు. కానీ అదంతా ఒకప్పటి మాట.. ఒక దశలో అతని దూకుడు ముందు హేమా హేమీలు కూడా తట్టుకోలేక ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. సీన్ కట్ చేస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన ఆయన, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో లేకుండా పోయారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా, లేరా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎవరా నేత. ఎంటా కహానీ. లెట్స్ వాచ్.
ఆయన పేరు నన్నపునేని నరేందర్. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఘనవిజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నరేందర్ గ్రేటర్ వరంగల్ పట్టు సాధించారు. పలు పార్టీల నేతలను బిఆరెస్ లో చేర్పించి పార్టీని బలోపేతం చేశారు. సాధారణంగా వరంగల్ తూర్పు రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. నన్నపునేని గెలిచాక చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ప్రత్యరులకు ఊహించని షాకిస్తూ ముందుకు వెళ్ళారు. నరేందర్ దూకుడు ముందు కాకలు తేరిన నాయకులు కూడా తలవంచక తప్పలేదు. అయితే అప్పట్లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు శాపంగా మారాయట.
నరేందర్ ఎమ్మెల్యేగా గెలిచాక వరంగల్ లో భూ కబ్జాలు పెరిగాయని, నరేందర్ అండతో కింది స్తాయి బిఆరెస్ కార్పొరేటర్లు, నాయకులు సెటిల్మెంట్లు చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా నరేందర్ మొండిగా ముందుకెళ్లడంతో ప్రజల్లో నరేందర్ పై అనతికాలంలోనే వ్యతిరేకత వచ్చింది. ఒకానొక సందర్భంలో నరేందర్ కనిపిస్తే చాలు డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేసేవారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అంటూ నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ సాగింది. కానీ పార్టీ అధిష్టానం మరోసారి నరేందర్ వైపు మొగ్గుచూపి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చింది. అయితే ఓవైపు కాంగ్రెస్ వేవ్, మరోవైపు కొండా దంపతుల రాజకీయ చతురత ముందు నరేందర్ తేలి పోయారు. ఇక తన రాజకీయ గురువు కుమారస్వామికి కూడా నరేందర్ వెన్నుపోటు పొడిచాడనే విమర్శలు, సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు కుమారస్వామి కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం కూడా నరేందర్ ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నరేందర్ సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నపుడు నరేందర్ వ్యవహరించిన తీరు వల్ల ఇబ్బంది పడ్డ వ్యాపారస్తులు, కార్పొరేటర్లు కొండా సురేఖకు మద్దతుగా వెళ్ళడంతో నరేందర్ డైలమాలో పడ్డారట. అన్న అన్న అంటూ వెంట తిరిగిన వారే ఇప్పుడు దూరం అవ్వడాన్ని ఆయన తట్టుకోలేక పోతున్నారన్న నియోజకవర్గంలో వినిపిస్తోంది. నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అజంజాహి మిల్లుకు సంబంధించిన స్థలాన్ని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారికి అప్పజెప్పిన వ్యవహారం కూడా ఇప్పుడు తలనొప్పిగా మారిందట. నరేందర్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో వరంగల్ బస్ స్టేషన్ పనులు, కలెక్టరేట్ పనులు ప్రారంభమైనా, ఇప్పటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Warangal MLA Nannapuneni Narender.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే నరేందర్ అదేమి పట్టనట్టు ఉండడం, నియోజకర్గ సమస్యపై కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించకపోవడం పట్ల బిఆరెస్ నేతలు సైతం అసంతృప్తి గా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఒకవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే నరేందర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారట. ఎప్పుడో అడపా దడపా వస్తూ పోతున్నారే తప్ప ఒక ప్రణాళిక లేకుండా నరేందర్ వెళ్తున్నారని సీనియర్ బిఆరెస్ కార్యకర్తల్లో చర్చ నడుస్తోందట. గత ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారంటూ కొండా సురేఖ మీద ఆరోపణలు చేశారు నరేందర్. దీంతో మళ్లీ ఆయన ఫాంలోకి వచ్చారని అందరూ భావించారట. అయితే మళ్లీ ఆయన మౌనంగా ఉండటంతో కార్యకర్తలకు అర్థం కాని పరిస్తితి ఏర్పడిందట.
మొన్నటిదాట నరేందర్ వెంట నడిచిన కార్పొరేటర్లు, ముఖ్య అనుచరులు సైతం బిఆర్ఎస్ వీడుతున్న నరేందర్ వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, వరుస వివాదాలు చుట్టు ముట్టి ఇరకాటం ఉండడాన్ని అవకాశంగా మలచుకోవడంలో నరేందర్ విఫలం అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం కార్యకర్తల సమస్యలు వినడానికి కూడా నరేందర్ ఆసక్తి చూపడం లేదని సీనియర్ బిఆరెస్ నేతల మధ్య చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు దూకుడుకు మారుపేరుగా ఉన్న నరేందర్ ఇప్పుడు సైలెంట్ ఉండడం పట్ల సొంతపార్టీ కార్యకర్తలను అయోమయంలోకి నెట్టిందట. మరో ఏడాది కాలంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నరేందర్ సైలెన్స్ ఇప్పుడు బిఆరెస్ కు సమస్యగా మారిందట. ఆయన వ్యూహాత్మక మౌనమా పాటిస్తున్నారా, లేక కేసుల భయంతో వెనక్కి తగ్గారా అన్న చర్చ కూడా ఇప్పుడు వరంగల్ తూర్పులో వినిపిస్తున్న టాక్.