నల్గొండ డీసీసీ అధ్యక్షుడు అతనేనా?

Nalgonda District DCC President: ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యమ క్రేజ్ ఉంది. డిసిసి అధ్యక్ష పదవి వస్తే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లే అన్న ఫీలింగ్ లో ఉన్నారు అక్కడి నేతలు. పీఠం కోసం టిపిసిసి ఉపాధ్యక్ష పదవిని వదులుకున్న నేతలు కూడా ఉన్నారు. ఆశావాహులు తమ గాడ్ ఫాదర్స్ ద్వారా పైరవీ లు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా. డిసిసి ప్రెసిడెంట్ రేసులో ఉన్నది ఎవరు.

తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీలో నల్గొండ డిసిసి వేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. రాష్ట్రంలోనే పెద్ద జిల్లా… పైగా రాజకీయ ఉద్దండలున్న జిల్లా కావడంతో డిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కు యమ క్రేజ్ ఉంది. రానున్నస్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని టీపిసిసి నిర్ణయించింది. డిసిసిలకు ఈ అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. అంతేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశావహల పేర్లను పరిగణలోకి తీసుకునే బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అప్పగించాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎలక్షన్సులో బీ ఫారాలు ఇచ్చేది డిసిసి అధ్యక్షులే. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది.

పార్టీలో ఎదగాలంటే డిసిసి అధ్యక్ష పీఠమే సరైన పదన్న అభిప్రాయం ఉండటంతో, నల్గొండ జిల్లా హస్తం పార్టీలోని కీలక నేతలు ఆ పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారు పైరవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిసిసి అధ్యక్ష పదవి వస్తే జాక్పాట్ కొట్టినట్టే అన్నంత ఫీలింగ్ కొందరు నేతల్లో కనిపిస్తోంది. దీంతో టీపిసిసిలో స్థానం కల్పించినా వద్దని తెగేసి చెబుతున్నారట.

కుందూరు జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్ ప్రస్తుతం నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వరుసగా రెండు పర్యాయాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో విధేయతతో పాటు జానారెడ్డికి నమ్మకస్తుడిగా ఉండటంతో ఎమ్మెల్యే కోట ఎమఎల్సీగా శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. ఒకరికి ఒక పదవి అన్న సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. దీంతో నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా శంకర్ నాయక్ స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారన్న ప్రచారంతో ఆశావాహుల్లో ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. Nalgonda District DCC President.

నల్గొండ డిసిసి అధ్యక్ష పదవిని రెండు పర్యాయాలు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఈసారి సోషల్ ఈక్వేషన్స్ మార్చాలని అధిష్టానం ఆలోచిస్తోంది. రెడ్డి కమ్యూనిటీకి ఇస్తే నల్గొండ మాజీ జడ్పిటీసి, ప్రస్తుత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి తక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు. ఇక టిపిసిసి ఉపాధ్యక్ష పదవి వచ్చినప్పటికీ మోహన్ రెడ్డి మాత్రం డిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ పైనే కన్నేశారట. ఇటీవల జరిగిన నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ పరిశీలకుడు నసీర్ అహ్మద్ కలిసి పార్టీకి చేసిన సేవలను వివరించారు.

ఇక బీసీలకు ఇస్తే టీపిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నేత పేరు వినిపిస్తోంది. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కైలాష్, మునుగోడు నియోజక వర్గానికి చెందిన వ్యక్తి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టిక్కెట్ ఆశించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి సీటు కోసం ప్రయత్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో నల్గొండ డిసిసి పీఠాన్ని బీసీలకు కేటాయిస్తే, కైలేష్ నేతకే ఎక్కువ అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాలో గణనీయంగా ఉన్న ఎస్సీలకు కేటాయించాల్సి వస్తే ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కొండేటి మల్లయ్య పేరు వినిపిస్తోంది. అయితే టీపిసిసి ఉపాధ్యక్ష పదవిని ఇవ్వటంతో డిసీసీ ఇస్తారా అన్న సందేహాలు లేకపోలేదు. మొత్తానికి నల్గొండ డిసిసి అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/telangana/the-people-of-sangareddy-are-waiting-for-jagga-reddy-known-as-mass-leader-to-come-to-them/