కడియం మాట మీద నిలబడతారా..?

Kadiyam Srihari: ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కల నేత.ఈ పార్టీలో ఉన్నా కూడా పదవులు ఆయన వెంట వెళ్ళేవి.గత ఎన్నికల్లో ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పడం ద్వారా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ఏంటో అని ఆందోళనలో ఉన్నారట….ఇంతకీ ఎవరా నేత లెట్స్ వాచ్….

కడియం శ్రీహరి అతనో మాజీ ఉప ముఖ్య మంత్రి సీనియర్ నేత…ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ అరంగ్రేటం చేసిన కడియం శ్రీహరి వరంగల్ మేయర్ గా, కుడా చైర్మెన్ గా,పని చేసి ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా..,చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగారు.2013 లో మారిన రాజకీయ పరిణామాలతో బిఆరెస్ లో చేరి ఎంపీగా గెలిచాడు.ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.గత సార్వత్రిక ఎన్నికల్లో తాటికొండ రాజయ్య ను కాదని బిఆరెస్ అధిష్టానం కడియం శ్రీహరి కి స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వడంతో ఎలాగైనా గెలవాలనుకున్న కడియం శ్రీహరి ఇదే నా చివరి ఎన్నిక అని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ వేవ్ ను కూడా తట్టుకొని విజయం సాధించారు.మొదట్లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి తిట్టిన కాంగ్రెస్ లోనే చేరి కూతురు కావ్య కు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాడు.

పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో కడియం చేరడాన్ని సీరియస్ గా తీసుకున్న బిఆరెస్ అధిష్టానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఫిరాయింపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం తో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.స్టేషన్ ఘనపూర్ కు ఉపఎన్నిక తప్పదని ఊహాగానాలు వస్తున్న వేళ కడియం పరిస్తితి ఏంటని ఇప్పుడు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.ఉప ఎన్నిక వస్తుందా… ఎన్నిక వస్తె పార్టీ కష్టకాలం లో కూడా జెండా మోసిన సింగపురం ఇందిరా ను కాదని కడియం కు టికెట్ కేటాయిస్తుందా..?ఇదే నా చివరి ఎన్నిక అని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసిన కడియం శ్రీహరి మాట మీద నిలబడతారా లేక ఎప్పటిలాగే తన రాజకీయం తాను చేస్తూ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా..కడియం కు.ఇందిరా సహకరిస్తుందా…? గత ఎన్నికల్లో శ్రీహరి వల్ల టికెట్ కోల్పోయిన తాటికొండ రాజయ్య శ్రీహరి ని గెలవనిస్తారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కడియం శ్రీహరి బిఆరెస్ నుండి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది.మంత్రి పదవి కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలసి లాబీయింగ్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు,గతంలో ఓ మహిళా సర్పంచ్ తాటికొండ రాజయ్య పై చేసిన లైంగిక ఆరోపణల వెనక కూడా కడియం ఉన్నారని,పదవుల కోసం శ్రీహరి ఏదైనా చేస్తారని విమర్శల నేపధ్యంలో కడియం ఎలా ముందుకు వెళ్తారని ఆసక్తిగా మారింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం,యూరియా దొరకక రైతులు ఆందోళనలు చేయడం, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై బిఆరెస్ బలంగా పోరాటం చేయడం చూస్తుంటే కడియం కు కష్టాలు తప్పవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ పార్టీ జెండా మోసిన సింగపురం ఇందిరా వర్గం నేతలను కడియం పక్కన పెట్టడం, కడియం వర్గం నేతలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఇందిరా వర్గం నేతలు బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు,పార్టీ కార్యక్రమాలకు కూడా ఇందిరా వర్గం నేతలను దూరం పెడుతున్నారని జీర్ణించుకోలేక పోతున్న నేతలు ఉప ఎన్నిక వస్తె కడియం కు సహకరించడం కష్టమే.మరోవైపు శ్రీహరి ,రాజయ్య మధ్య ఎప్పటినుండో ఆధిపత్య పోరు సాగుతుంది.తన ఉప ముఖ్యమంత్రి పదవి పోవడం,తన ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డ కడియం పై రివెంజ్ కోసం రాజయ్య ఎప్పటినుండో వేచి చూస్తున్నాడు.ఉప ఎన్నిక వస్తె రాజయ్య చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని రాజయ్య ను,ఇందిరా ను తట్టుకొని గెలవడం కడియం కు కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Kadiyam Srihari.

దేవునూర్ అటవీ భూముల వ్యవహారం,ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకవతవకలు,నియోజకవర్గం లో ఆశించిన అభివృద్ధి లేకపోవడం,యూరియా కొరత వల్ల రైతులు చేస్తున్న ఆందోళన,కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బిఆరెస్ చేస్తున్న ప్రచారాలు కడియం కు మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.ఏదేమైనా ఇదే చివరి ఎన్నిక అని చెప్పిన కడియం మరోసారి పోటీ కి సై అంటారా..?ఇందిరా ను కాదని పార్టీ టికెట్ ఇస్తుందా,73 ఏళ్ల శ్రీహరి రాజకీయ భవితవ్యం ఏంటో తెలియాలంటే ఉప ఎన్నిక రావాల్సిందే…