అమ్కాకు రక్షణ శాఖ ఆమోదం.. ఇక పాకిస్థాన్ కు చెమటలే.. ఫైలెట్ లేకుండా ప్రయాణించే భారత్ ఫైటర్ జెట్లు..!!

యుద్ధ రంగంలో ఫైటర్ జెట్ల పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు ఏ యుద్ధం జరిగిన ఫైటర్ జట్లు రంగంలోకి దిగాల్సిందే. వాటి సౌండ్ కే శత్రువు గుండె ఆగిపోతోంది. అయితే భారత్ వ్యూహాత్మకంగా ఫైటర్ జెట్ల అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా దగ్గర ఐదవ తరం ఫైటర్ జెట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. భారత్ ప్రస్తుతం 4.5 తరం ఫైటర్ జెట్లు ఉపయోగిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో రక్షణ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని.. 5వ తరం ఫైటర్ జెట్లను అభివృద్ధి చేస్తోంది. అసలు ఫైటర్ జెట్లు ఎన్నిరకాలుగా ఉన్నాయి..? 6వ తరం ఫైటర్ జెట్లు అంత అడ్వాన్స్ అని ఎందుకు అంటారు.? ప్రస్తుతం ఏ దేశాలు 6వ తరం ఫైటర్ జెట్లను తయారు చేస్తున్నాయి.? భారత్ కూడా ఈ టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తోందా..?

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ -అమ్కా కార్యక్రమాన్ని అమలు చేసే విధానాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం ఐదవ తరం యుద్ధ విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేయనుంది. ఈ విమానాలు భారత వైమానిక దళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అమ్కా కార్యక్రమాన్ని ఆమోదించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA నేతృత్వంలో, ప్రైవేట్ పరిశ్రమల సహకారంతో అభివృద్ధి చేస్తారు. అమ్కా అనేది ఐదవ తరం యుద్ధ విమానం, ఇది శత్రువుల రాడార్‌లకు కనిపించకుండా ఉండే స్టెల్త్ సాంకేతికత, అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, అంతర్గత ఆయుధ గదులు, సూపర్‌క్రూజ్ సామర్థ్యం వంటి అత్యాధునిక లక్షణాలను కలిగి ఉంటుంది.

అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ లేదా అమ్కా అంటే ఏమిటి?
AMCA అనేది 25 టన్నుల బరువున్న రెండు ఇంజన్లతో పనిచేసే యుద్ధ విమానం. ఇందులో 6.5 టన్నుల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ విమానం శత్రువుల రాడార్‌లకు కనిపించకుండా ఉండే స్టెల్త్ సాంకేతికతతో రూపొందించబడుతుంది. ఇది రాబోయే తరం యుద్ధంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రారంభ వ్యయంగా అంచనా వేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ వ్యవస్థ ఉంటుంది. ఇది విమానాన్ని నడిపే పైలట్‌కు సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే నెట్‌సెంట్రిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ఇతర విమానాలు, డ్రోన్‌లు, భూమిపై ఉన్న యూనిట్‌లతో రియల్-టైమ్ సమన్వయం కోసం పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్‌మెంట్ సిస్టమ్.. విమానం నిర్వహణ అవసరాలను ముందుగానే గుర్తించి, సమస్యలను నివారిస్తుంది. డ్రోన్‌లతో కలిసి సంక్లిష్ట యుద్ధ పరిస్థితుల్లో పనిచేయగల సామర్థ్యం అమ్కా యుద్ధ విమానాలకు ఉంటుంది. తక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అంటే రాడార్‌లకు కనిపించకుండా ఉండే లక్షణం అమ్కాను.. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కంటే శక్తివంతమైందిగా మారుస్తుంది. అమ్కా తయారీతో, భారతదేశం ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసిన దేశాల జాబితాలో చేరింది. ఈ జాబితాలో ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా ఉన్నాయి.

అమ్కా భారతదేశానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ 2035 నాటికి అమ్కాను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ 2024లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదంతో ప్రారంభమైంది. అమ్కా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం ఇంజన్. దీనిని విదేశీ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ ద్వారా తయారు చేయనున్నారు. 2024 మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఐదు అమ్కా ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేయడానికి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆమోదించింది.

అమ్కాను భారత్ తయారు చేస్తోంది.. మరి ఇతర దేశాల 5వ తరం ఫైటర్ జెట్ల పరిస్థితి ఏంటి..? 2023 ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 15వ ఎడిషన్‌లో రష్యా Su-57E, అమెరికా F-35 విమానాలు ప్రదర్శించారు. సుఖోయ్ Su-57 ఇది రెండు ఇంజన్లతో పనిచేసే స్టెల్త్ యుద్ధ విమానం. దీని గరిష్ట వేగం మాక్ 1.8 , 7.4 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇది 54,100 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు, 1,864 మైళ్ల యుద్ధ పరిధిని కలిగి ఉంది. రష్యాకు సుమారు 76 Su-57 విమానాలు ఉన్నాయి. ఇవి భారత, UAEకి విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక అమెరికా తయారీ F-35 లైటనింగ్ II గురించి చూస్తే.. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ ఒకే సీటు గల యుద్ధ విమానం అత్యంత ఎక్కువగా ఉపయోగించబడుతున్న ఐదవ తరానికి చెందినది. ఇది అధునాతన స్టెల్త్, అసమానమైన సిట్యుయేషనల్ అవేర్‌నెస్, నెట్‌వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉంది. గరిష్ట వేగం మాక్ 1.6.

ఫైటర్ జెట్లను ఎన్ని తరాలుగా వర్గీకరించారు.. ?
1940-1950 మధ్య మొదటి తరం విమానాలు జెట్ ఇంజన్లతో ప్రారంభమయ్యాయి. ఇవి రాడార్‌లు లేకుండా, తుపాకులు, గైడెడ్ కాని రాకెట్‌లతో మాత్రమే ఉండేవి. వేగం, ఎత్తు పరిమితంగా ఉండేవి. ఒక రెండవ తరం యుద్ధ విమానాలు 1950-1960 మధ్య ఎక్కువగా ఉపయోగించారు. ఈ విమానాలు ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. ఇవి సాధారణ రాడార్‌లు, ఎయిర్ టూ ఎయిర్ మిసైళ్లను కలిగి ఉండేవి. 1970-1980 మధ్య మూడవ తరం యుద్ధ విమానాలను ఉపయోగించాు. ఈ విమానాలు ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ సర్ఫేస్ దాడులు చేయగలవు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఫ్లై-బై-వైర్ సిస్టమ్స్, ఎక్కువ వేగం, తక్కువ బరువు ఉండేవి. 1980-1990 మధ్య 3.5 తరం ఫైటర్ జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఈ తరం విమానాలను మూడవ తరం విమానాలకు అప్‌గ్రేడ్‌లతో రూపొంచారు. ఇవి పల్స్-డాప్లర్ రాడార్, గ్లాస్ కాక్‌పిట్‌లు, మరియు డిజిటల్ సిస్టమ్‌లను కలిగి ఉండేవి. 1990 నుంచి ఇప్పటి వరకు నాల్గవ తరం ఫైటర్ జెట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ విమానాలు డిజిటల్ సాంకేతికత, అధునాతన ఎలక్ట్రానిక్స్, నెట్‌వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఇక 4.5 తరం విమానాలు నాల్గవ తరం విమానాలకు అధునాతన సాంకేతికతలతో అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఇవి సెన్సార్ ఫ్యూజన్, తక్కువ రాడార్ సిగ్నేచర్ వంటి ఐదవ తరం లక్షణాలను కలిగి ఉంటాయి. 6వ తరం ఫైటర్ జెట్లు ప్రస్తుతం ఏ దేశం వద్దా సర్వీస్‌లో లేవు. ఎందుకంటే ఇవి ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. 6వ తరం జెట్లు AI-ఆధారిత సిస్టమ్స్, డ్రోన్‌లతో సమన్వయం, హైపర్‌సోనిక్ ఆయుధాలు, ఆప్షనల్ మ్యాన్డ్, అన్‌మ్యాన్డ్ సామర్థ్యాలు, అధునాతన స్టీల్త్ యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. 2030-2035 నాటికి ఈ జెట్లు సర్వీస్‌లోకి రావచ్చు.

6వ తరం జెట్లను అభివృద్ధి చేస్తున్న దేశాలు ఏవీ..?
అమెరిక ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ పేరుతో 6వ తరం ఫైటర్ జెట్లను అభివృద్ధి చేస్తోంది. ఇవి 2030 నాటికి సర్వీస్‌లోకి రావచ్చు. చైనా 2035 నాటికి 6వ తరం జెట్‌ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడా చైనాలో కొత్త ప్రోటోటైప్‌లు కనిపించాయి, కానీ వివరాలు రహస్యంగా ఉంచారు. ఇక రష్యా మిగ్-41లను 6వ తరం జెట్‌గా అభివృద్ధి చేస్తోంది. ఇవి కూడా 2030ల నాటికి సర్వీస్‌లోకి రావచ్చు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ సంయుక్తంగా నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి. యూకే, ఇటలీ, జపాన్ సంయుక్తంగా టెంపెస్ట్ ఫైటర్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇక భారత్ అమ్కా ప్రాజెక్ట్‌లో 6వ తరం సాంకేతికతలు ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2032-2035 నాటికి ఈ లక్షణాలతో అప్‌గ్రేడ్‌లు జరగవచ్చు.