
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఒకవైపు ప్రజా సేవలో బిజీగా ఉంటూనే మరోవైపు అంతకు ముందు అంగీకరించిన సినిమాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రమైన హరిహర వీరమల్లు షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ఆ వెంటనే సుజిత్ డైరెక్షన్‌లో ఓజీ సినిమా షూటింగ్‌ను కూడా ఫినిష్ చేశారు. అయితే తాజాగా ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కోసం పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంలో ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్‌కు లుక్ టెస్ట్ జరుగుతోంది. ఈరోజు లేదా రేపు లుక్ టెస్ట్ పూర్తి అయితే ఎల్లుండి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గతంలో పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హరీష్ శకర్, ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా షెడ్యూల్ సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో కథానాయకుడు పవన్ కల్యాణ్, కథానాయిక శ్రీలీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో పవన్ హనుమంతుడి లాకెట్ ధరించి, దర్శకుడు హరీశ్ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌తో సినిమా ఆగిపోలేదని, త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాశ్, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.