రాజకీయాల్లో దిట్ట అయిన రోశయ్య గారి జయంతి నేడు..!

Konijeti Rosaiah Birth Anniversary: రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పదవులు అధిరోహించారాయన…
ఎక్కువకాలం ఆర్థికమంత్రిగా పని చేసిన ఘనత ఆయనది..
బడ్జెట్ కూర్పులో దిట్ట..
ఆర్థికాంశాలపై మంచి పట్టు…
సీనియర్ నేతగా అపార అనుభవం గడించిన కొణిజేటి రోశయ్య గారి జయంతి నేడు. Konijeti Rosaiah Birth Anniversary.

1933, జులై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు రోశయ్య. తల్లి ఆదెమ్మ, తండ్రి సుబ్బయ్య. గుంటూరులోని హిందూ కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు. భార్య పేరు శివలక్ష్మి, వీరికి ఇద్దరు కొడుకులు, కె. ఎస్. సుబ్బారావు, ఎన్. మూర్తి, ఒక కుమార్తె పి. రమాదేవి.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులైన ఎన్.జి.రంగాకు శిష్యులు రోశయ్య.
1968లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు.
ఆ తరువాతి సంవత్సరాలైన 1974, 1980లలో కొనసాగారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎంల వద్ద పలు కీలకమైన శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు.

నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు…

  • 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణ, వాణిజ్య పన్నుల శాఖలకు పని చేశారు.
  • 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖలో చేశారు.
  • 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖల్లో పనిచేశారు.
  • 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు,
  • 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖల్లో..
  • 2004, 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆర్థికమంత్రిగా సుదీర్ఘ కాలం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలంపాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు.
2009-10 చివరి బడ్జెట్ తో కలిపి మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే చెల్లింది. ఇందులో ఆఖరి 7సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం! బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా పేరుపొందారు.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన తరువాత 2010 నవంబరు నెలలో ఆయన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.

మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా కీలక పదవుల్లో పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి చివరివరకు విధేయుడిగా నిలిచారు. కష్ట సమయాల్లో అధిష్టానానికి అండగా ఉన్నారు.