అక్షరాలు నేర్చుకునే తరగతి గదిలో రక్తపాతం.. సమాజాన్ని కలచివేసిన ఘటన

అనంతపురం జిల్లా రాప్తాడులో 10వ తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే జరిగిన దాడి సమాజం ఎంతటి దారుణ పరిస్థితులలోకి జారిపోతుందో మరోసారి తెలియజెప్పే ఘటనగా నిలుస్తోంది. బాలికకు దగ్గరి బంధువు ఈ దాడికి పాల్పడడం మరింత కలకలం రేపుతోంది. 21 ఏళ్ల ఉన్మాది ఆ బాలికపై రంపంతో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడింది. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, హోం మంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు స్పందించారు.
తరగతి గదిలోనే పదో తరగతి విద్యార్థినిపై జరిగిన పాశవిక దాడి తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పాఠశాలల లోపల మన చిన్నారి బాలికలను లక్ష్యంగా చేసుకునే దాడికోరులకు మన సమాజంలో స్థానం లేదని ఆమె కోలుకుంటున్న తీరును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మరియు ఆమెకు అవసరమైన వైద్యాన్ని అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నరరూప రాక్షసుడిని పట్టుకుని, వేగంగా అత్యంత కఠినమైన చట్టపరమైన శిక్షపడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రక్షణ, చదువు నేర్పించే ప్రదేశంలో ఒక చిన్నారి బాలికపై జరిగిన ఇలాంటి అమానుష చర్య అత్యంత గర్హనీయం. బాధ్యుడిపై త్వరితగతిన, అత్యంత కఠినమైన చర్యలు తీసుకుని అతనికి శిక్షపడేలా చూడాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారన్నారు. ప్రతి ఒక్క బాలిక మరియు మహిళ యొక్క భద్రత, ఆత్మగౌరవాలు అత్యంత ప్రాధాన్యమైనవి. ఇలాంటి పాశవిక చర్యలను ఏమాత్రం సహించేది లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై జరిగిన ఈ పాశవిక దాడి మానవత్వాన్ని తీవ్రంగా కలచివేసింది. విద్యాబుద్ధులు నేర్పించి రక్షణ ఇవ్వాల్సిన పాఠశాల ప్రాంగణంలో, అదీ తరగతి గదిలోనే రంపంతో ఒక 21 ఏళ్ల యువకుడు తెగబడటం సమాజ భద్రత మరియు మానసిక ఆరోగ్య స్థితి ఏ స్థాయికి క్షీణిస్తుందో సూచించే విచారకరమైన ఘట్టం. బాధితురాలికి దగ్గరి బంధువే ఈ దారుణానికి ఒడిగట్టడం సమాజంలో మానవ సంబంధాలు, మానసిక నియంత్రణ ఎంత ప్రమాదకరమైన స్థితికి జారిపోతున్నాయో తెలియజేస్తోంది. మనిషిలో ఉన్మాదం పెరిగినప్పుడు అతను తనలోని విచక్షణను, సహజమైన మంచి వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతాడు. విపరీతమైన ఉన్మాద స్థితికి చేరుకున్న వ్యక్తి అవతలి మనిషి వేదనను లేదా పర్యవసానాలను గ్రహించలేడు. సంబంధాలు లేదా ప్రేమానురాగాల స్థానంలో ఎదుటివారిని ఒక ప్రాణమున్న మనిషిగా కాకుండా, తమ అహానికి లేదా స్వార్థానికి లోబడి ఉండాల్సిన వస్తువుగా మాత్రమే చూసే మానసిక వైకల్యం ఏర్పడుతుంది. వికృతమైన భావనలో వారు రాక్షస ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే ఈ రకమైన పైశాచిక దాడులతో ఉన్మాదులు సాధించేది శూన్యం. క్షణికావేశం, వికృతమైన మానసిక ధోరణి వల్ల చేసే ఇలాంటి దారుణాలు అంతిమంగా వారి జీవితాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టివేస్తాయి. చట్టం ముందు నేరస్థులుగా నిలబడి జీవితాంతం జైలు శిక్ష అనుభవించడం, సమాజం నుంచి తీవ్రమైన అసహ్యాన్ని, బహిష్కరణను ఎదుర్కోవడం మాత్రమే వారికి దక్కుతుంది. ఆవేశపు మత్తు దిగిన తర్వాత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నామని గ్రహించినా కాలం వెనక్కి రాదు. ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం సంఘటన జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, ఈ రకమైన క్రూర మనస్తత్వాలు సమాజంలో తయారవ్వకుండా మూలాల నుంచి నివారించాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థలో చిన్ననాటి నుంచే భావోద్వేగ నియంత్రణను, ఎదుటివారి నిర్ణయాలను గౌరవించడాన్ని నేర్పించాలి. విపరీతమైన ఆవేశం లేదా ఇతరులను వేధించే నైజం ఉన్న వారిని ప్రారంభంలోనే గుర్తించి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలి. అలాగే విద్యాసంస్థల్లో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించడం మరియు ఇలాంటి దాడులకు పాల్పడే వారికి అత్యంత వేగంగా, కఠినంగా శిక్షలు పడేలా చూడటం ద్వారా మాత్రమే సమాజంలో భద్రతను, మానసిక ఆరోగ్య వాతావరణాన్ని కాపాడుకోగలం.


