ఆర్థిక సంక్షోభంలో ఉన్నా మారని తీరు పాక్ తీరు..ఇండియాపై అదే అక్కసు..ఎయిర్ స్పేస్ లో భారత్‌కు నో ఎంట్రీ!
కామెంట్లు (0)

ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్నా అలాగే ఆ దేశ అస్థిర పరిస్థితులతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాఅప్పుల కోసం ఐ.ఎం.ఎఫ్ దగ్గర, చైనా దగ్గర మోకరిల్లుతునన్నా భారత్‌పై ఉన్న అక్కసు మాత్రం తగ్గలేదు. భారత్ కు ఇబ్బంది కలిగించాలన్నదే వాళ్ల ఏకైక ఎజెండా అనేలా మరోసారి ప్రయతించింది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం దాయాది దేశం అక్కసుకు మరోసారి అద్దం పడుతోంది. భారత పౌర విమానాలకు తమ దేశ గగనతలాన్ని వాడుకునే అనుమతి నిరాకరిస్తూ.. ఆ నిషేధాన్ని నవంబర్ 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పొరుగు దేశాల గగనతలం గుండా విమానాలు వెళ్లడం అనేది అంతర్జాతీయ ఏవియేషన్ రూల్స్ ప్రకారం అత్యంత సాధారణ ప్రక్రియ. కానీ పాక్ కావాలనే భారత విమానాలకు నో ఎంట్రీ,బోర్డు పెట్టింది.
భారత విమానాలు తమ గగనతలం మీదుగా ప్రయాణించకుండా పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారికంగా ఒక నోటామ్ జారీ చేసింది. ఈ నోటీసు ప్రకారం నవంబర్ 24 వరకు ఏ ఒక్క భారతీయ కమర్షియల్ ఫ్లైట్ కూడా పాక్ గగనతలాన్ని వాడుకోకూడదు. నిజానికి పాకిస్థాన్‌కు, భారత్‌కు మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయనేది సర్వత్రా విదితమే. గతంలో 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కూడా పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇప్పుడు ఎలాంటి యుద్ధ వాతావరణం లేకపోయినా, కేవలం ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో, భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడానికే పాకిస్థాన్ ఈ కక్షపూరిత చర్యకు పాల్పడినట్లు రక్షణ, విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పదే పదే పాక్ ఉగ్రవాదాన్ని ఎండగడుతుండటం జీర్ణించుకోలేకే ఇలా ఎయిర్ స్పేస్ బ్యాన్ అనే దానిని ఎంచుకుంది.
పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత ప్రభుత్వానికి పెద్దగా పోయేదేమీ లేదు, కానీ ఇబ్బంది పడేది మాత్రం సామాన్య విమాన ప్రయాణికులే. ఢిల్లీ లేదా ముంబై నుంచి యూరప్ దేశాలైన లండన్, పారిస్, ఫ్రాంక్ఫర్ట్, అమెరికాకు , లేదా మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాలంటే.. పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లడం అనేది అత్యంత సులభమైన, తక్కువ దూరం ఉన్న మార్గం. కానీ ఇప్పుడు పాకిస్థాన్ ఎంట్రీ బ్యాన్ చేయడంతో.. మన ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు తమ రూట్ మార్చుకోవాల్సి వస్తోంది. పాకిస్థాన్‌ను టచ్ చేయకుండా గుజరాత్ మీదుగా, అరేబియా సముద్రం, మీదుగా ఒమన్ లేదా ఇరాన్ గగనతలానికి చేరుకుని అక్కడినుంచి యూరప్‌కు వెళ్లాలి. దీని వలన విమాన ప్రయాణ సమయం అదనంగా ఒకటిన్నర నుంచి రెండు గంటలు పెరుగుతుంది. ప్రయాణ సమయం పెరిగిందంటే.. సహజంగానే విమాన ఇంధనం ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఆ ఇంధనం భారాన్ని విమానయాన సంస్థలు ఫైనల్‌గా ప్రయాణికుల జేబుల నుంచే లాగుతాయి. రాబోయే రోజుల్లో యూరప్, అమెరికా విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడం ఖాయం.
అయితే పాకిస్థాన్ మన విమానాలను బ్యాన్ చేసి ఏదో సాధించేశామని సంబరపడుతోంది కానీ.. దానివల్ల మనకంటే వాళ్లకే అత్యధిక నష్టం కలుగుతోంది. అంతర్జాతీయ ఏవియేషన్ రూల్స్ ప్రకారం.. ఏ దేశపు గగనతలం మీదుగా విమానం వెళ్లినా, ఆ దేశానికి ఓవర్‌ఫ్లైట్ ఫీజు రూట్ నావిగేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పాకిస్థాన్ గగనతలం గుండా రోజూ వందలాది భారతీయ విమానాలు రాకపోకలు సాగించేవి. తద్వారా పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి ప్రతి నెలా మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే వాళ్లు గగనతలాన్ని మూసివేశారో.. ఆ ఆదాయానికి పూర్తిగా గండి పడింది. దేశంలో తినడానికి తిండి లేదు.. ఐఎంఎఫ్ దగ్గర కేవలం 1.2 బిలియన్ డాలర్ల అప్పు కోసం కఠినమైన షరతులకు ఒప్పుకుని సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
ఇటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో కూడా, కేవలం భారత్ పై ఉన్న ఈర్ష్యతో వందల కోట్ల ఆదాయాన్ని పాకిస్థాన్ చేజేతులా నాశనం చేసుకుంటోంది. ఆ దేశ పాలకుల ఆలోచనా విధానం ఎంత దిగజారిపోయిందో కనిపిస్తోంది.



