అమెరికా అధ్యక్షుడికి ఈ అవార్డుల పిచ్చి ఎందుకు?మొన్న నోబెల్ ఇప్పుడు పులిట్జర్ ఎందుకిలా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకు నోబెల్ శాంతి బహుమతి తనకు రావాల్సిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పులిట్జర్ బహుమతి కూడా తనకు రావాల్సిందే అంటున్నారు. ట్రంప్ బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఒక దేశాధ్యక్షుడి స్థానంలో ఉన్న ట్రంప్ తనకు అవార్డులు రావాల్సిందే అని పదేపదే ఎందుకు వెంపర్లాడడడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు దశాబ్దాల పాటు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా, క్యాసినో ఓనర్ గా, ది అప్రెంటిస్ లాంటి షోలతో రియాలిటీ టీవీ స్టార్‌గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వ్యాపార ప్రపంచంలో ఒకటే రూల్ ఉంటుంది ..ఆల్ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. ఎప్పుడూ వార్తల్లో ఉండటం, తన పేరును ఒక బ్రాండ్ గా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారానే ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ట్రంప్ టవర్స్, ట్రంప్ గోల్ఫ్ కోర్సులు, ట్రంప్ స్టేక్స్.. ఇలా ప్రతిదానికీ తన పేరు పెట్టుకోవడం వెనుక ఉన్న సైకాలజీ కూడా ఇదే. సరిగ్గా ఇదే మైండ్ సెట్ తో ఆయన వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఒక దేశాధినేతలా కాకుండా, ఒక సీఈఓలా , ఒక బ్రాండ్ అంబాసిడర్ లా ఆలోచించడం మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకోవడానికి ఆయనకు నిరంతరం పబ్లిసిటీ అవసరం అయింది. తనను తాను ఎప్పుడూ అత్యుత్తమ నాయకుడిగా, ఎన్నడూ ఓడిపోని విజేతగా ప్రాజెక్ట్ చేసుకోవాలనేది ఆయన వ్యక్తిగత ఇమేజ్ మేనేజ్మెంట్. ఇందులో భాగంగానే అవార్డులు, రివార్డులు అనేవి తన విజయాలకు మరింత ఇమేజ్ ను ఇస్తాయని ఆయన బలంగా నమ్ముతారు. తాను తీసుకున్న నిర్ణయాలకు ఇలాంటి అంతర్జాతీయ అవార్డులు దక్కితే, చరిత్రలో తన పేరు ఒక గ్రేట్ ప్రెసిడెంట్ గా నిలిచిపోతుందనేది ఆయన ఆలోచన కావొచ్చు.



