ఏపీ రైతులకు డబుల్ బొనాంజా…ఒకేసారి రూ.6వేలు అకౌంట్లో ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు ముందే ఒక భారీ శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద హామీ అన్నదాత సుఖీభవ . రైతులకు ఏటా పెట్టుబడి సాయం అందిస్తామన్న సూపర్ సిక్స్ హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే దసరా పండుగ నాటికి ఏపీ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద అందించే అన్నదాత సుఖీభవ నిధులను కలిపి ఒకేసారి రైతుల అకౌంట్లలో వేసేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా 6 వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల కానున్నాయి. కేంద్రం ఇచ్చే 2 వేల పెట్టుబడి సాయానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ సాయాన్ని జతచేసి దసరా కానుకగా అందించాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ప్రకారం, ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 పెట్టుబడి సాయం కింద ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా 6 వేలు పోగా, మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో భరించనుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. రబీ సీజన్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఈ సమయంలో రైతులకు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు కోసం చేతిలో డబ్బు అవసరం ఎంతో ఉంటుంది. మరోవైపు తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే దసరా పండుగ కూడా అక్టోబర్లోనే వస్తోంది. ఈ ఖర్చులన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సీఎం చంద్రబాబు దసరా పండుగకు ముందే నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. నిధుల పంపిణీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.


