నల్లమలలో వేటగాళ్ల బరితెగింపుకు..రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్..?
నల్లమలలో అసలేం జరుగుతోంది..? అటవీ శాఖ నిఘా ఏం చేస్తోంది..? డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లనివ్వకుండా అడ్డుపుడుతుందేవరు..?

నల్లమల.. పేరుకు తగ్గట్టే ప్రకృతి అందాలకు, అరుదైన వన్యప్రాణులకు కేరాఫ్ అడ్రస్. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈ అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు సహా ఎన్నో జీవజాతులకు నిలయం. ఇలాంటి అడవిలో వన్యప్రాణుల సంరక్షణకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అక్రమ వేట ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉచ్చులు.. విద్యుత్ తీగలు.. వీటి బారిన పడి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అడవిని కాపాడేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నిఘా కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని ఏర్పాట్లు ఉన్నా.. వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి..? నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోంది..? ఎక్కడ లోపాలున్నాయి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
అటవీ శాఖ చెబుతున్న నిఘా ఏర్పాట్లకు.. క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న ఘటనలకు మధ్య అసలు అంతరం ఎంత..? యాంటీ పోచింగ్ క్యాంపులు ఉన్నాయంటున్నారు.. సిబ్బంది పహారా కాస్తున్నారని చెబుతున్నారు.. డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, వైర్లెస్ పరికరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. కానీ అక్రమ వేట ఆరోపణలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా ఉందంటే సరిపోదు.. అది పనిచేస్తుందా లేదా అన్నదే ముఖ్యం. అడవి సరిహద్దుల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలుగుతున్నారా..? వేటగాళ్లు ఏర్పాటు చేసే ఉచ్చులను సకాలంలో తొలగిస్తున్నారా..? వన్యప్రాణుల మరణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇవన్నీ ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మారాయి. అయితే నిఘా వైఫల్యం లేదా అధికారుల నిర్లక్ష్యం ఉందని తేల్చాలంటే అధికారిక విచారణ అవసరం.


