తన గొయ్యి తానే తీసుకుంటున్న పాకిస్థాన్..ఎయిర్ స్పేస్ క్లోజ్!

ఏవియేషన్ సెక్టార్ లో ఎయిర్ స్పేస్ నేది చాలా కీలకం. ఒక దేశం మీదుగా ప్యాసింజర్ లేదా కార్గో విమానాలు వెళ్లాలంటే ఆయా దేశాలకు భారీగా పన్నులు కట్టాలి. పాకిస్థాన్ భౌగోళికంగా ఆసియా , యూరప్ ఖండాలను కలిపే ఒక కీలకమైన ప్రదేశంలో ఉంది. అందుకే ఆసియా దేశాల నుంచి యూరప్ వెళ్లే చాలా విమానాలు పాకిస్థాన్ మీదుగానే వెళ్తాయి. తైవాన్ విమానాలు కూడా దశాబ్దాలుగా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాయి. కానీ తాజాగా బ్లూమ్ బర్గ్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఒక సంచలన కథనాన్ని బయటపెట్టాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. తైవాన్ కు చెందిన దిగ్గజ ఏవియేషన్ సంస్థలైన చైనా ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవా ఎయిర్ వేస్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన విమానాలు అక్టోబర్ 25 ఉదయం నుంచి పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించలేదు. పాక్ తీసుకున్న ఈ సడెన్ నిర్ణయంతో ఇప్పుడు ఆ విమానయాన సంస్థలు ఆసియా, యూరోప్ ఖండాల్లో ప్రయాణించడానికి ప్రత్యామ్నాయంగా ఆఫ్ఘనిస్తాన్ లేదా మరింత దూరం తిరిగి వెళ్లే కొత్త రూట్లను వెతుక్కుంటున్నాయి. దీంతో ప్రపంచంలో తైవాన్ ఎయిర్ లైన్స్ ను బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచింది.
ఈ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపడంతో, పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా అసిఫ్ .. బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ ఏవియేషన్ సంస్థ వన్ చైనా పాలసీకి పూర్తిగా కట్టుబడి ఉంది. చైనా, తైవాన్ వేరు వేరు దేశాలు కావని, తైవాన్ చైనాలో అంతర్భాగమే అన్న చైనా నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంది. ఈ పాలసీలో భాగంగా పాకిస్థాన్ గగనతలం మీదుగా కేవలం మెయిన్ ల్యాండ్ చైనా నుంచి వచ్చే విమానాలకు, చైనీస్ ఎయిర్ లైన్స్ కు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. తైవాన్ ఎయిర్ లైన్స్ కు ఇకపై మా దేశంలో ఎంట్రీ లేదు అని ఒక రక్షణ మంత్రి స్థాయిలో ఉండి, వేరొక దేశం తరఫున వకాల్తా పుచ్చుకుని ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.
తైవాన్ విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేయడం వెనుక ఉన్న ఏకైక కారణం డ్రాగన్ కంట్రీ చైనా. తైవాన్ అనేది ఒక స్వతంత్ర దేశం కాదని, దాన్ని ఎప్పటికైనా బలవంతంగానైనా తమలో కలుపుకుంటామని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. ఆ వాదనను అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించడానికి చైనా ఇప్పుడు పాకిస్థాన్ ను ఒక బ్రోకర్ లా , ఒక పావులా వాడుకుంటోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తైవాన్ విషయంలో స్వయంగా చైనా కూడా ఇప్పటివరకూ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోలేదు. అవును, చైనాలోని బీజింగ్, షాంఘై లాంటి ప్రధాన నగరాలకు ఇప్పటికీ తైవాన్ విమానాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం వేల కోట్లలో జరుగుతోంది. ఇక ఇలా తైవాన్ విమానాలను బ్యాన్ చేయడం వల్ల పాకిస్థాన్ కు వచ్చే రాజకీయ లాభం సున్నా. పైగా గగనతలం ద్వారా వచ్చే రెవెన్యూ కూడా పూర్తిగా ఆగిపోతుంది. కానీ చైనా మెప్పు కోసం ఇప్పుడు పాకిస్థాన్ ఏవియేషన్ ఆ ఆదాయాన్ని కోల్పోయి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంటోంది. భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్-చైనా మధ్య ఎప్పటినుంచో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. సీపెక్ ప్రాజెక్టు పేరుతో, అప్పుల పేరుతో చైనా ఇప్పటికే పాకిస్థాన్ ను ఒక వలస దేశంగా మార్చేసుకుంది. ఇప్పుడు ఆ ఐరన్-క్లాడ్ ఫ్రెండ్ షిప్ నిలుపుకోవడం కోసమే పాక్ తన గొయ్యి తానే తీసుకుంటోందని అంతర్జాతీయ డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాభనష్టాలు ఆలోచించకుండా డ్రాగన్ కంట్రీ వేసే ఎంగిలి మెతుకుల కోసం పాక్ ఎంతకైనా తెగిస్తుందని ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్థాన్ ఒక పెద్ద డబుల్ గేమ్ ఆడుతోంది. పాకిస్థాన్ ఒకవైపు చైనాతో స్నేహం అంటూనే, సైనిక పరంగా, ఆర్థిక సాయం కోసం మరోవైపు అమెరికాతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. కానీ తైవాన్ విషయంలో చైనా వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబడుతోంది. తైవాన్ కు ఆయుధాలు, బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం, నావల్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ నేరుగా తైవాన్ ను వ్యతిరేకించడం అంటే పరోక్షంగా అమెరికాకు ఎదురెళ్లడమే అవుతుంది. అమెరికా కనుసన్నల్లో నడిచే ఐఎంఎఫ్ నుంచి పాక్ మొన్ననే 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని తీసుకుంది. ఇప్పుడు అమెరికా తలుచుకుంటే పాకిస్థాన్ కు ఆ నిధులు ఆగిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి పాకిస్థాన్ ఆడుతున్న ఈ డేంజరస్ డబుల్ గేమ్ కు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది. చైనా ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో రానున్న రోజుల్లో చూడాలి.



