బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక పోకడలు… సమస్యల నుండి డైవర్షన్ కోసమేనా?

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా లాంటి ఒక పవర్ ఫుల్ లీడర్ ను గద్దె దించితే దేశం రాత్రికి రాత్రే అమెరికా లాగా మారిపోతుందని కలలు కన్న ఆ దేశ విద్యార్థులకు, ఇప్పుడు నెలకొన్న వాస్తవ పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా భయంకరమైన విద్యుత్ కోతలు , గ్యాస్ , ఇంధన కొరతతో సామాన్యులు, వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతోంది. ఈ దారుణమైన ఆర్థిక సంక్షోభంతో విసుగెత్తిపోయిన బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు.. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. శుక్రవారం ఢాకాలోని నేషనల్ మ్యూజియం ఎదుట నేషనల్ సిటిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన ర్యాలీ జరిగింది. షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ ఎన్సీపీ పార్టీనే ఇప్పుడు తాజా నిరసనలకు నాయకత్వం వహిస్తోంది. దేశంలో నెలకొన్న ఈ దయనీయ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ హోం, ఇంధన శాఖ మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు రోడ్లెక్కి డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తమ దేశంలోని అంతర్గత సమస్యలకు, తమ రాజకీయ నాయకుల అసమర్థతకు భారత్ ను బాధ్యురాలిని చేస్తూ విద్యార్థి నేతలు భారత్ వ్యతిరేక నినాదాలు చేయడం. అంటే దేశంలో కరెంటు లేకపోవడానికి, నిత్యావసరాల ధరలు పెరగడానికి ఇండియానే కారణం అన్నట్లుగా వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విద్యార్థి నాయకులు మైకుల్లో ఢిల్లీనా.. ఢాకానా? అని నినదిస్తుండగా, అక్కడున్న వేలాది మంది ఢాకా.. ఢాకా.. అంటూ ఉన్మాదంతో ప్రతిస్పందిస్తున్నారు.ఇంతటితో ఆగకుండా, ఈ విద్యార్థి నేతలు భారత్‌పై దారుణమైన కుట్ర ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశం బంగ్లాదేశ్‌పై కుట్రలకు పాల్పడుతోంది .. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ కుట్రల నుంచి దేశాన్ని రక్షించలేకపోతోంది. సరిహద్దుల్లో మన పౌరుల హత్యలు జరుగుతున్నాయి. ఇండియాలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ముస్లింలు దారుణమైన వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీలో కూడా మసీదులను కూల్చే ప్రణాళికలు జరుగుతున్నాయి అని ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన, మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్సీపీ నేత నహిద్ ఇస్లాం చేశాడు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



